మచిలీపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ సిబ్బంది(Anganwadi staff) ఐక్యతకు మరో నిదర్శనమిది. సాటి అంగన్వాడీ టీచరు(Anganwadi Teacher) చనిపోగా అంతా తామై అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం(Humanity) చాటుకున్నారు. స్నేహితురాలి జ్ఞాపకలను నెమరువేసుకుంటూ అశ్రునయనాలతో సాగనంపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం 23వ డివిజన్ చిన ఉల్లింగిపాలెం అంగన్వాడీ టీచర్ అన్నం సౌజన్య(41) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి ఇంటివద్ద మృతిచెందగా, అద్దె ఇల్లు కావడంతో మృతదేహాన్ని ఎక్కువ సేపు అక్కడ ఉంచే అవకాశం లేకపోయింది. దీంతో మృతదేహాన్ని ఆమె చిన్నకుమార్తె, అల్లుడు.. అంబులెన్స్‌లో మచిలీపట్నంలోని హిందూ శ్మశానవాటికకు తరలించారు. గురువారం ఉదయానికి ఈ విషయం తెలుసుకున్న అంగ్వాడీ టీచర్లు, ఆయాలు మూకుమ్మడిగా శ్మశానవాటికకు చేరుకున్నారు. రక్తసంబంధీకుల మాదిరిగా దగ్గరుండి మరీ అంత్యక్రియలు పూర్తిచేసి కన్నీటి వీడ్కోలు పలికారు.