కుప్పకూలిన ఆరోగ్య వ్యవస్థ

ABN , First Publish Date - 2021-04-21T05:54:03+05:30 IST

భారతదేశం పూర్తిగా రోగగ్రస్తమైనట్లు కనిపిస్తోంది. ‘నా పిఏ, సిబ్బంది అందరూ కరోనాకు గురయ్యారు’ అని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పారు....

కుప్పకూలిన ఆరోగ్య వ్యవస్థ

భారతదేశం పూర్తిగా రోగగ్రస్తమైనట్లు కనిపిస్తోంది. ‘నా పిఏ, సిబ్బంది అందరూ కరోనాకు గురయ్యారు’ అని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పారు. సుప్రీంకోర్టులో సగం సిబ్బంది, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు కొందరు న్యాయమూర్తులు, సిబ్బంది కరోనాతో పోరాడుతున్నారు. దేశంలో ఆరుగురు ముఖ్యమంత్రులు, అనేకమంది మంత్రులు రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కరోనా తాకిడికి ఆసుపత్రుల పాలయ్యారు. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను, కేంద్రాన్ని హైకోర్టులు ప్రశ్నిస్తున్నాయి. ‘పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ను ఆసుపత్రులకు మళ్లించండి..’ అని ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు ప్రస్తుత పరిస్థితిని తట్టుకోలే నంత బలహీనంగా మారాయని హైకోర్టు అభిప్రాయపడింది. పరిస్థితి దుర్భరంగా మారిందని, వ్యవస్థలను కరోనా ముంచెత్తుతున్నట్లు కనిపిస్తోందని నీతీ ఆయోగ్ సభ్యుడు వికే పాల్ మూడు వారాల క్రితమే హెచ్చరించారు. కరోనాపై ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి బృందంలో ఆయన కూడా ఒకరు. ‘మేము ఇప్పటి వరకు ఇన్ని శవాలను ఎన్నడూ చూడలేదు. శవాల కుప్పల మధ్య శ్మశానంలో కాలు పెట్టలేకలేపోతున్నాము’ అని లక్నో ముక్తిధామ్ శ్మశాన వాటికలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి చెప్పాడు. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాంతమైన గోరఖ్‌పూర్ పాటు లక్నో, అలహాబాద్‌లలో లాక్‌డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించినప్పటికీ యుపి ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. గోరఖ్ పూర్‌లో పరిస్థితి దారుణంగా ఉన్నదని అక్కడ నివసిస్తున్న కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ తెలిపారు. లక్నోలో ఒక మాజీ జడ్జి భార్యకు మూడు రోజుల పాటు ఆసుపత్రిలో బెడ్ వసతి లభించక మృతి చెందారు. వారణాసిలో ఒక వ్యక్తి వారం రోజుల పాటు ఆసుపత్రిలో అడ్మిషన్ లభించక మరణించాడు. ఆ తర్వాత శవాన్ని తరలించేందుకు కూడా అంబులెన్స్ లభ్యం కాకపోవడంతో అతడి భార్య ఈ-–రిక్షాలో తీసుకువెళ్లిన వైనం పత్రికల దృష్టి కెక్కింది. వారణాసి హరిశ్చంద్ర ఘాట్‌లో కూడా కుప్పలు తెప్పలుగా అంత్యక్రియలు జరుగుతున్నాయని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బహిరంగసభల్లో, రోడ్ షోలలో విస్తృతంగా పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చి అక్కడ అభివృద్ధి అధ్వాన్నంగా ఉన్నదని చెప్పిన యోగి ఆదిత్యనాథ్ స్వయంగా కరోనాకు గురయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో దాదాపు 40 శాతం వైద్య సిబ్బంది కరోనాకు గురయ్యారని, డాక్టర్లకు కూడా ఆక్సిజన్, బెడ్స్ దొరకని పరిస్థితి ఉన్నదని ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు. ఢిల్లీలో కరోనా టెస్ట్ చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి కచ్చితంగా కరోనా సోకినట్లు తేలుతోంది. ఫోన్ ఎత్తితే చాలు కనీసం ఒక బెడ్ అయినా ఏదో ఒక ఆసుపత్రిలో ఇప్పించమని అభ్యర్థన వస్తోంది. ఢిల్లీ వాట్సాప్ గ్రూప్‌ల్లో కరోనా మరణ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధానిలో దాదాపు వారం రోజుల పాటు కర్ఫ్యూ విధించడమే పరిస్థితికి అద్దం పడుతోంది. సరిగ్గా ఏడాది క్రితం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు కూడా కనపడుతున్నాయి. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టర్మినల్, రైల్వేస్టేషన్లు వేలాది వలస కూలీలతో కిక్కిరిసిపోయాయి.


విచిత్రమేమంటే దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ స్వయంగా పశ్చిమ బెంగాల్‌లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. లక్షలాది మంది మాస్కులు లేకుండా సభల్లో, ప్రచారాల్లో పాల్గొన్నప్పటికీ బిజెపి నేతలు ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కుంభమేళాకు ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనలు పోస్టర్ల రూపంలో ఉత్తరాఖండ్ అంతటా వెలిశాయి. కరోనా పరిస్థితి విషమిస్తున్న దృష్ట్యా మిగిలిన నాలుగు దశలను ఒకే దశలో నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. మమతా బెనర్జీ ప్రచారాన్ని ఒకరోజు పాటు నిలిపివేసేందుకు చూపిన ఉత్సాహం ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రచారాన్ని కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో చూపలేదు. కరోనా రీత్యా తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను బిజెపి నేతలు ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే రాహుల్ ఎన్నికల సభలను రద్దు చేసుకున్నారని కేంద్ర ఐటి, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. దేశంలో అందరికీ వాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ రాసినందుకు కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ దాడి చేశారు. కొవిడ్ విషమ పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలు ప్రవర్తించడం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా అన్నారు కాని ఈ దేశంలో నాయకులు మాత్రం కొవిడ్ పట్ల జాగరూకతతో ప్రవర్తించారా? యథా రాజా, తథా ప్రజా అని పెద్దలు ఊరికే అనలేదు కదా?


కాని ఉన్నట్లుండి ఏమి మార్పు వచ్చిందో ఏమో కాని కరోనాపై రెండో యుద్ధం తీవ్రతరం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో మిగతా పార్టీలన్నీ తమ ఎన్నికల ప్రచారాన్ని కుదించుకున్నప్పటికీ వెనక్కు తగ్గని బిజెపి ఆరు దశల ప్రచారం ముగిసిన తర్వాత 500 కంటే ఎక్కువ మంది పాల్గొనే సభలను నిర్వహించబోమని ప్రకటించింది. కరోనా వ్యాప్తికి ఎన్నికలను నిందించలేమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంతకుముందు ఎందుకు అన్నట్లు? దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతోందని నీతీ ఆయోగ్ సభ్యుడు ప్రకటించిన 20 రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకలు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. 


భారతదేశంలో నాయకులకు తాము ప్రకటించిన చర్యలు, విధానాలు నిజంగా అమలు అవుతున్నాయా లేదా అన్న విషయంలో పెద్దగా ఆసక్తి ఉండదు. పెద్ద ఎత్తున చర్యలను, సంక్షేమ కార్యక్రమాలను అందమైన పేర్లతో ప్రకటించి చేతులు దులుపుకోవడమే కాదు, ప్రచారం చేసుకోవడం, ఆఖరుకు కరోనా వాక్సిన్ సర్టిఫికెట్‌పై కూడా ఫోటోలు వేసుకోవడం వారికి బాగా తెలుసు. ఒక సంవత్సర కాలంగా ప్రధానమంత్రి దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. బడ్జెట్‌లో ఆరోగ్యానికి భారీ ఎత్తున కేటాయించినట్లు ఊదర గొట్టారు. విచిత్రమేమంటే దేశంలో గత ఏడాదికీ ఈ ఏడాదికీ ఆరోగ్య రంగంలో పరిస్థితులు పెద్దగా మారలేదన్న విషయం ప్రస్తుత సంక్షోభాన్ని బట్టి అర్థమవుతోంది. ఇంకా దేశంలో పదివేలమంది జనాభాకు కేవలం 8.5 పడకలు, 8 మంది వైద్యులే ఉన్నారని ఒక నివేదిక వెల్లడించింది, దేశంలో 68 శాతం మందికి ఇంకా కనీస ఔషధాలు అందుబాటులో ఉండడం లేదని ఆ నివేదిక పేర్కొంది. ఏడాది తర్వాత కూడా ఇంకా దేశంలో ఆసుపత్రి పడకల కోసం, ఆక్సిజన్ కోసం, మందులకోసం, రెమిడిసివిర్ వంటి ఇంజక్షన్ల కోసం జనం పడిగాపులు గాయాల్సి వస్తోంది. చివరికి మరణాల రేటు కూడా 10.2 శాతం పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 162 ఆక్సిజన్ ప్లాంట్లలో కేవలం 33 మాత్రమే నెలకొల్పగలిగామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరి ఏం మారినట్లు?


కరోనా తొలి విడత కంటే రెండవ విడత ఉధృత రూపం దాలుస్తోందని, దీని వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం మరోసారి పడక తప్పదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కరోనా రెండో ప్రభంజనం సేవలరంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, ఆర్థిక కార్యకలాపాలపై పరోక్ష ప్రభావం చూపి ఆర్థిక అనిశ్చితికి దారి తీయవచ్చునని నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ రెండురోజుల క్రితం అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్లీ ఏమైనా ప్యాకేజి ప్రకటించే అవకాశాలున్నాయా అని అడిగినప్పుడు ఆ విషయం ఆర్థిక మంత్రిత్వ శాఖే నిర్ణయించాలని ఆయన చెప్పారు. విచిత్రమేమంటే గత సంవత్సరం ప్రధానమంత్రి స్వయంగా ప్రజల ముందుకువచ్చి నెలల తరబడి లాక్‌డౌన్‌ను ప్రకటించారు కాని ఇప్పుడు కేంద్రం ఆ విషయంలో చేతులు ఎత్తేసి రాష్ట్రాలకే నిర్ణయాధికారాన్ని వదిలేసింది. మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ పారిశ్రామికవేత్తలకు నిర్దిష్టమైన హామీ ఇవ్వాల్సి వచ్చింది. గతంలో లాక్‌డౌన్ విధించిన తర్వాత ప్యాకేజీల పేరిట దేశంలోని బ్యాంకులను, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టి, రాష్ట్రాలను అప్పులు చేసుకోమని చెప్పడం మినహా ఏమీ చేయని కేంద్రం ఇప్పుడు మళ్లీ ప్యాకేజి ప్రకటిస్తే అమ్ముకోవడానికి ఏమి మిగిలి ఉందా అన్న విషయం ఆలోచించాల్సి ఉన్నది.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-04-21T05:54:03+05:30 IST