కల్యాణ మండపం పేరుతో వసూళ్లు

ABN , First Publish Date - 2021-06-18T05:58:05+05:30 IST

పాతసింగరాయకొండలోని శ్రీ వరహ లక్ష్మీనరసింహ దేవప్థానంలో టీటీడీ కళ్యాణ మండపం ఏర్పాటుకు అధికార పార్టీ నాయకులు వసూళ్లు చేస్తున్న విరాళాలు చర్చినీయాంశమైంది.

కల్యాణ మండపం పేరుతో వసూళ్లు
పాతసింగరాయకొండ శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం

రంగంలోనికి వైసీపీ నాయకులు

అవసరాన్ని మించి అధికంగా వసూలు చేసినట్లు ఆరోపణలు

సింగరాయకొండ, జూన్‌ 17: పాతసింగరాయకొండలోని శ్రీ వరహ లక్ష్మీనరసింహ దేవప్థానంలో టీటీడీ కళ్యాణ మండపం ఏర్పాటుకు అధికార పార్టీ నాయకులు వసూళ్లు చేస్తున్న విరాళాలు చర్చినీయాంశమైంది. ఈ దేవస్థానంలో ప్రతి ఏడాది అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతుంటాయి. అయితే, ఇక్కడ వివాహలు చేసుకోవడానికి ప్రత్యేకమైన మండపం లేదు. భక్తుల కోరిక మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వ టీటీడీ బోర్డ్డు మెంబర్‌గా ఉన్న ఎమ్మెల్యే స్వామి కల్యాణ మండపం ఏర్పాటుకు ప్రాతిపదనలు సిద్ధం చేసి నిధులు మంజూరుకు కృషిచేశారు. ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది.

ఇటీవల కల్యాణ మండప నిర్మాణం గురించి స్థానిక నాయకులు, భక్తులు టీటీడీ దేవస్థాన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దేవస్థానం తరుపున రూ. 50 లక్షలు కార్పస్‌ఫండ్‌ టీటీడీ దేవస్థానానికి ఇచ్చినట్లయితే, రూ. కోటి యాభై లక్షలు టీటీడీ నుంచి నిధులు మంజూరు అవుతాయని ఆయన పేర్కొన్నారు. రూ.2 కోట్లతో టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మండపం ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. దీంతో మండలంలో అధికార పార్టీ తరుపున అధికారాన్ని చెలాయిస్తున్న ముఖ్య నాయకుడి అనుచరులు రంగంలోకి దిగి విరాళాల వేటను ప్రారంభించారు. పలు కంపెనీల నుంచి భారీగా విరాళాలు సేకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కల్యాణ మండపం నిర్మాణానికి అవసరమైన కార్పస్‌ ఫండ్‌ నిధుల కంటే అధికంగా, రూ. కోటి వరకు వసూళ్లు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

స్థానికంగా ప్రముఖమైన రెండు ఆక్వా పరిశ్రమల నుంచి, ప్రధానమైన కంపెనీలు నుంచి భారీగా నిఽధులు సేకరించారని సమాచారం. మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమల వద్ద కూడా వైసీపీ నాయకులు కల్యాణ మండపం నిర్మాణం పేరిట విరాళాల సేకరణను ముమ్మరం చేశారు. దీంతో పాటు స్థానికంగా అక్రమ వ్యాపారాలు చేసే వ్యక్తులపై, అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులపై వైసీపీ నాయకులు దృష్టి సారించారు.  అయితే ఈ విరాళాల సేకరణలో పారదర్శకత లోపించిందని విమర్శలున్నాయి. సేకరించిన విరాళాలకు పత్రసహిత ఆదారాలతో వివరించి విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా వసూలు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

Updated Date - 2021-06-18T05:58:05+05:30 IST