సహకార సంరంభం!

ABN , First Publish Date - 2021-03-08T05:16:30+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)కు ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గత వారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహకార ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరువాత వెంటనే సహకార ఎన్నికలు నిర్వహించాలని పలువురు సూచనలు ఇచ్చారు.

సహకార సంరంభం!
ఎన్నికలకు సిద్ధమవుతున్న పీఏసీఎస్‌

సొసైటీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న అధికారులు

ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం

(కొమరాడ)

స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)కు ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గత వారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహకార ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరువాత వెంటనే సహకార ఎన్నికలు నిర్వహించాలని పలువురు సూచనలు ఇచ్చారు. ఈ మేరకు ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. పీఏసీఎస్‌లకు 2013లో ఎన్నికలు నిర్వహించారు. 2018 జనవరి, ఫిబ్రవరి నెలతో వీరి పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రతీ ఆరు నెలల కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. 2019 ఆగస్టులో పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలను నియమించారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వీరి పదవీ కాలం జనవరి 31తో ముగిసింది. మళ్లీ వీరిని కొనసాగించడానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారడంతో ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు జిల్లా సంయుక్త కలెక్టర్‌ను, పీఏసీఎస్‌లకు అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జిలను ఆరు నెలల కాలానికి నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే వీరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ ఒత్తిళ్లు కూడా అంతగా ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

21 అంశాలతో...

జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యుల వారీగా 21 అంశాలతో కూడిన వివరాలను అధికారులు రూపొందిస్తున్నారు. పీఏసీఎస్‌లలో రూ.300లు షేర్‌ ధనం చెల్లించిన వారే ఓటు హక్కు కలిగి ఉంటారు. తాజాగా ఓటరు జాబితాను తయారు చేస్తున్నారు. సభ్యులు తీసుకున్న బాకీ, వాయిదా ఏడాది దాటి ఉంటే అలాంటి వారు ఓటు హక్కు కోల్పోయినట్లే. రెండేళ్లలో రూ.5 వేలు, ఆరు నెలల్లో రూ.10 వేలు మేర డిపాజిట్లు ఉన్న సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. నిబంధనల మేరకు మార్చి నెలాఖరుకు అర్హులైన ఓటర్లు వివరాలతో జాబితాలను తయారు చేసి పంపాలని సహకార శాఖ నుంచి పీఏసీఎస్‌లకు సమాచారం వచ్చింది.

జిల్లాలో పరిస్థితి ఇలా

జిల్లాలో మొత్తం 94 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 5 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో రూ. 300లు షేర్‌ ధనం వాటా చెల్లించిన వారు 2,46,522 మంది ఉన్నారు. పీఏసీఎస్‌లకు సంబంధించి ఎన్నికల ప్రకటనకు 30 రోజుల ముందు రూ. 300లు షేర్‌ ధనం మొత్తాన్ని చెల్లించిన వారు ఓటు హక్కుకు అర్హులవుతారని కొమరాడ పీఏసీఎస్‌ సీఈవో మాధవరావు చెప్పారు.


Updated Date - 2021-03-08T05:16:30+05:30 IST