పోర్టు పనులకు సహకరించండి

ABN , First Publish Date - 2021-09-29T06:39:31+05:30 IST

రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం ప్రాథమిక పనులు పూర్తిచేసుకునేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి మారిటైం బోర్డు అధికారి, పోర్టు నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న అరబిందో ఇన్‌ఫ్రా ప్రతినిధి విజ్ఞప్తి చేశారు.

పోర్టు పనులకు సహకరించండి
ఎమ్మెల్యే మహీధర్‌తో చర్చిస్తున్న మారిటైం బోర్డు అధికారి

నిర్వాసితులు అడ్డుకోకుండా చూడండి

ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డితో మారిటైం బోర్డు అధికారి, అరబిందో ప్రతినిధి భేటీ

భూసేకరణ , పునరావాస ప్రక్రియ  వేగవంతం చేయాలని మానుగుంట  సూచన 

కందుకూరు, సెప్టెంబరు 28 : రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం ప్రాథమిక పనులు పూర్తిచేసుకునేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి మారిటైం బోర్డు అధికారి, పోర్టు నిర్మాణ  బాధ్యతలు దక్కించుకున్న అరబిందో ఇన్‌ఫ్రా ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. మారిటైం బోర్డు అధికారి ఐవీరెడ్డి, అరబిందో ప్రతినిధి భీముడు మంగళవారం స్థానిక సబ్‌కలెక్టరు కార్యాలయంలో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలన్న లక్ష్యంతో సముద్రంలో డ్రిల్లింగ్‌ లాంటి పనులు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వివరించారు. ముందు సంసిద్ధత కోసం చేయాల్సినవి కనీసం మూడు, నాలుగు నెలలు పడుతుందన్నారు. ఆ పనులను ప్రస్తుతం ప్రారంభిస్తే ప్రధానమైన నిర్మాణ పనులు ప్రారంభించేలోగా భూసేకరణ , పునరావాస ప్రక్రియ పూర్తవుతుందని వారు ఎమ్మెల్యేకు వివరించారు. అయితే ఇందుకు పునరావాస గ్రామాలైన శాలిపేట, కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం గ్రామస్థులు ఒప్పుకోవటం లేదన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూసేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియలో అధికారుల పని ఒత్తిడి, ఇతర సాంకేతిక సమస్యలతో జాప్యం జరిగితే పనులు మొదలయ్యాక ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఆందోళన ఆ గ్రామాల ప్రజల్లో బలంగా ఉందన్నారు. అలాగే కార్యక్రమం నడుస్తున్న విధానం కూడా వారి అనుమానాలకు బలం చేకూర్చేదిగా ఉందని తెలిపారు. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మీరు ఆ దిశగా ప్రయత్నిస్తే ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి పనులు చేసుకునేందుకు వారు సహకరించేలా తన వంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే వారికి వివరించారు. 




Updated Date - 2021-09-29T06:39:31+05:30 IST