ముదిరిన వార్‌

ABN , First Publish Date - 2021-05-17T05:11:46+05:30 IST

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రావి రామనాథంబాబు, పోలీసుల మధ్య ప్రారంభమైన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. తొలుత ఆయన పర్చూరు ఎస్‌ఐని ఫోన్‌లో దుర్భాషలాడటం, ఆ తర్వాత ఇంకొల్లు సీఐపై ప్రత్యక్షంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటం వివాదానికి కారణమైంది. ఈ అంశాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించి రామనాథంబాబుపై ఇటు మంత్రి బాలినేనికి, అటు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ముదిరిన వార్‌


 వైసీపీ నేత వర్సెస్‌ పోలీసులు

మంత్రిని కలిసిన చీరాల డీఎస్పీ, ఇంకొల్లు సీఐ 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎస్పీ 

ప్రజలను ఇబ్బందిపెట్టొద్దని కోప్పడ్డా.. అంతే..

 వైసీపీ ఇన్‌చార్జి రామనాథంబాబు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రావి రామనాథంబాబు, పోలీసుల మధ్య ప్రారంభమైన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. తొలుత ఆయన పర్చూరు ఎస్‌ఐని ఫోన్‌లో దుర్భాషలాడటం, ఆ తర్వాత ఇంకొల్లు సీఐపై ప్రత్యక్షంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటం వివాదానికి కారణమైంది. ఈ అంశాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించి రామనాథంబాబుపై ఇటు మంత్రి బాలినేనికి, అటు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆయన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తానేమి తప్పు చేయలేదంటూ అమీతుమీకి సిద్ధమయ్యారు. దీంతో వివాదం ఏమలుపు తిరుగుతుందనే అంశం చర్చనీయాంశమైంది. ఇటీవల పర్చూరు ఎస్‌ఐ రమణయ్యకు రామనాథం బాబు ఫోన్‌ చేశారు. కరోనా కట్టడి పేరుతో సామాన్యులను ఎందుకు ఇబ్బందిపెడుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో ఏమున్నా మీరు ఎస్పీ, డీఎస్పీలతో మాట్లాడుకోవాలని ఎస్‌ఐ పదేపదే బదులిచ్చారు. దీంతో ప్రజలను ఇబ్బందిపెడతారా.. మీ అంతు చూస్తామన్న తరహాలో ఎస్‌ఐని తీవ్రంగా హెచ్చరించారు. తదనంతరం రికార్డైన ఆ ఫోన్‌ సంభాషణ  సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఎస్‌ఐ రమణయ్య విషయాన్ని ఇంకొల్లు సీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చీరాల డీఎస్పీ, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సందర్భంలో శనివారం చీరాల వైద్యశాల వద్ద సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌పై సదరు వైసీపీ నేత చిందులు తొక్కారు. ఎస్‌ఐతో తాను మాట్లాడిన ఫోన్‌ సంభాషణలో కొంత తొలగించి తానేదో తప్పుగా మాట్లాడినట్లుగా అర్థం వచ్చేలా సోషల్‌ మీడియాకు మీరే పంపారంటూ నిలదీశారు. ముగ్గురు యువకుల శవ పంచనామా సందర్భంగా అక్కడ ఎక్కువమంది ప్రజలు ఉండగా అందరి ముందు రామనాథంబాబు సీఐపై దుర్భాషలాడారు.


సీఎం దృష్టికి తీసుకెళ్తా..

దీంతో పోలీసు శాఖ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. డీఎస్పీ, సీఐలు శనివారం రాత్రి ఒంగోలు వచ్చి మంత్రి బాలినేనిని కలిశారు. రామనాథంబాబు తీరు పట్ల యావత్తు పోలీసు సిబ్బంది ఆవేదన చెందారని, తన పరిధిలో తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఎస్పీ కౌశల్‌ రామనాథంబాబు వ్యవహార శైలిని అటు డీజీపీ, ఇటు డీఐజీల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పోలీసుల గౌరవాన్ని కాపాడాలని ఎస్పీ ఇటు మంత్రిని, అటు ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. పార్టీపరంగా కూడా వైసీపీ రాష్ట్ర నాయకులు అసలేం జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. మూడురోజుల క్రితం మంత్రి బాలినేనిని కలిసిన రామనాథంబాబు ఎస్‌ఐతో చేసిన సంభాషణ పై వివరణ  ఇచ్చి సీఐపై ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం డీఐజీ త్రివిక్రమవర్మను కూడా కలిసి సీఐపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తాజా సంఘటన జరగటంతో వ్యవహారం ఆసక్తికరంగా మారింది. 


నేనేం త ప్పు చేయలేదు: రామనాథం బాబు 

కర్ఫ్యూ పేరుతో సాధారణ  ప్రజలను ఇబ్బందిపెట్టవదని మాత్రమే ఎస్‌ఐని కోరాను. వ్యవసాయ సీజన్‌ కావటంతో అనివార్యంగా రైతులు, అలాగే కొవిడ్‌ బాధితులు రోడ్లపై తిరగాల్సి వస్తుందని వారి అవసరాలను గుర్తించి పంపించాలే తప్ప కేసులు పెట్టి వాహనాలు సీజ్‌ చేయవద్దని కోరాను. అయితే ఎస్‌ఐ ప్రతిదానికి ఎస్పీకి చెప్పండి అనటంతో అన్నిటికీ ఎస్పీ అయితే మీరేమి చేస్తారని కోప్పడ్డానే తప్ప దూషించలేదు. అయితే రికార్డు చేసిన ఆ సంభాషణ లో కొంత తొలగించి సోషల్‌ మీడియాలోకి పంపించటంలో సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌ కీలకపాత్ర పోషించారు. అదే విషయాన్ని ఆయన కనిపించినప్పుడు అడిగా. అంతకు తప్ప నేను చేసిన తప్పులేదు. సీఐ వ్యవహారశైలి, అతని చరిత్రపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందున తనపై కోపంతో దీన్ని వివాదం చేస్తున్నాడు.


వాస్తవాలను తెలియజేశా: సీఐ అల్తాఫ్‌ 

తన సర్కిల్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ రమణయ్య తొలుత విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. రామనాథంబాబు దుర్భాషలాడిన ఆడియోని నా బాధ్యతగా ఎస్పీకి, డీఎస్పీకి పంపించాను. విధి నిర్వహణలో ఉన్న నన్ను తీవ్రంగా దుర్భాషలాడినా సమన్వయంతో వ్యవహరించి ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఆ తర్వాత మంత్రిని కలిసి జరిగిన సంఘటనను వివరించాను. ఆడియో రికార్డు సోషల్‌ మీడియాలోకి వెళ్లటంతో నాకు సంబంధం లేదు.   


Updated Date - 2021-05-17T05:11:46+05:30 IST