Abn logo
Aug 23 2021 @ 23:21PM

‘గులాబీ’లో కోల్డ్‌వార్‌.. సొంత పార్టీ నేతలపైనే..!

ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు

ఎమ్మెల్యేలు, మాజీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం

అధికార పార్టీలో ఫిరాయింపుదారులదే పెత్తనం

అసంతృప్తితో మాజీ ఎమ్మెల్యేలు, నేతలు


ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారు ఓవైపు, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి.. ఆ తరువాత పార్టీలో చేరిన వారు మరోవైపు. నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం ఎవరికి వారు ప్రయత్నిస్తుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌లో వర్గాలు ఏర్పడి.. ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తోంది. ఒకే పార్టీలో ఉండి కూడా.. పరస్పరం కేసులు పెట్టుకునేదాకా వెళ్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయినవారు, మాజీ ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో.. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి గెలుపొంది అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు హవా నడిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేల అనుచరులను తమవైపు తిప్పుకొంటూ, అభివృద్ధి పనులు, పార్టీ కార్యక్రమాల్లో అన్నీ తామే అన్నట్లుగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నారు.


నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యేల పెత్తనమే నడుస్తుండడంతో పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులు టీఆర్‌ఎస్‌లోని మాజీ ఎమ్మెల్యేల అనుచరులకు ఎలాంటి పనులు చేయకుండా పక్కన పెడుతున్నారు. కాంట్రాక్టులు, అభివృద్ధి పనుల మంజూరు అన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నడుస్తుండగా.. మాజీ ఎమ్మెల్యేల అనుచరులు మౌనంగా ఉంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి తమ ఉనికి చాటుకునేందుకు నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇరువర్గాల మధ్య విభేదాలు చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో.. పార్టీలో వర్గపోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. 


పాలేరులో సొంత పార్టీ నేతలపైనే కేసులు..

జిల్లాలో కీలకమైన పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల అనుచరులపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అనుచరులు పోలీసు కేసులు పెట్టడం, స్టేషన్లలో ఎమ్మెల్యే సిఫారసుకే పోలీసులు ప్రాధాన్యం ఇస్తుండడం జరుగుతోంది. పార్టీ సంస్థాగత కమిటీలు, స్థానిక సంస్థల టికెట్లలో తుమ్మల వర్గీయులకు ఎక్కడా స్థానం కల్పించలేదు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా తుమ్మల వర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడి ఫొటోను ప్రొటోకాల్‌కు సంబంధం లేకుండా ముద్రించడం వివాదానికి దారి తీసింది. టీఆర్‌ఎస్‌లో ఇరు వర్గాల మధ్య పోరు పోలీసుస్టేషన్‌కు చేరింది. తుమ్మల వర్గంపై పోలీ సులు కేసు నమోదుచేయడంతో స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు.


ఇల్లెందు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్‌ నుంచి గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరిన బానోతు హరిప్రియ వర్గీయులకు, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య వర్గీయులకు మధ్య అంతర్గత పోరు సాగుతోంది. కనకయ్య అనుచరులు కొందరు హరిప్రియ వర్గంలో చేరగా, కొందరు గ్రూపు విభేదాలను తట్టుకోలేక కాంగ్రెస్‌లో చేరారు. ఇక కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాక వర్గపోరు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంక ట్రావు ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన అనుచరులకు మాత్రం టచ్‌లో ఉన్నారు. 


పినపాకలో మాజీలకు లేని ఆహ్వానాలు..

పినపాకలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన రేగా కాంతారావు టీఆర్‌ఎస్‌లో చేరి ప్రభుత్వ విప్‌ అయ్యారు. ఆయన చేతిలో ఓడిపోయిన టీఆర్‌ఎస్‌ నేత పాయం వెంకటేశ్వర్లు అసంతృప్తితో ఉన్నారు. రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు కూడా పాయం వెంకటేశ్వర్లుకు ఆహ్వానాలు ఉండడంలేదు. అభివృద్ధి పనులు, కాంట్రాక్టు పనులు, ఇసుక కాంట్రాక్టుల అన్నీ రేగా అనుచరులే నడిపిస్తుండడంతో పాయం అనుచరుల్లో కొందరు కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, వైరా నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్‌ మద్దతుతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రాములునాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయనపై మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ పెద్ద పోరాటమే చేస్తున్నారు. పార్టీ మండల కమిటీలన్నింటినీ రాములునాయక్‌ తన అనుచరులతోనే నింపేశారు.


ఇక సత్తుపల్లిలో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌స్‌లో చేరిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అనతికాలంలోనే పార్టీపై పట్టు సాధించారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులందరినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవడంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు సండ్రపై గుర్రుగా ఉన్నారు. తన అనుమతి లేకుండా పొంగులేటి పర్యటనలు చేయడంపై సండ్ర.. మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సండ్రపై పోటీ చేసి ఓటమి చెందిన ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే మాజీ మంత్రి తుమ్మల మద్దతు సండ్రకే ఉంది. దీంతో రవి రాజకీయ భవ్యిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆయన టీఆర్‌ఎస్‌లో ఉంటారా? పార్టీ మారుతారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. 


టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచింది ఒక్కరే..

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఒకే ఒక్కరు గెలుపొందారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గెలుపొందగా, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, మధిర, పాలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థులు, సత్తుపల్లి, అశ్వారావుపేటలో టీడీపీ అభ్యర్థులు, వైరాలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత పరిణామాల్లో.. మధిర, భద్రాచలం స్థానాల నుంచి గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య మినహా మిగిలిన వారంతా అధికార టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయాలను వారే శాసిస్తున్నారు.


గత ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులుగా పోటీ చేసి, ప్రస్తుతం సొంత పార్టీలోనే ఉన్న నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కోసం తమకు పోటీగా మారకుండా.. వారిని, వారి అనుచరులను ముందుచూపుతో దూరం పెడుతున్నారు. ఎక్కడైనా ఎదురు తిరిగితే వారిపై పోలీసు కేసులు నమోదు చేయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎవరు టీఆర్‌ఎస్‌లో ఉంటారో, టికెట్లు దక్కకపోతే ఎవరు జెండా మారుస్తారోనన్న చర్చ జరుగుతోంది. 


మెచ్చా చేరికతో అశ్వారావుపేటలో మారిన సీన్‌..

మొన్నటివరకు టీడీపీలోనే కొనసాగిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇటీవల టీఆర్‌స్‌లో చేరడంతో నియోజకవర్గ రూపుమారింది. ఇక్కడ కూడా తుమ్మల మద్దతు సిట్టింగ్‌ అయిన మెచ్చాకే ఉంది. దీంతో నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడింది. ఇక ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విచిత్రమైన పరిస్థితిన ఎదుర్కొంటున్నారు. ఆయన నియోజకవర్గంలో పర్యటించాలంటే తమ అనుమతి ఉండాల్సిందేనంటూ స్థానిక ఎమ్మెల్యేలు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో నామా స్వతంత్రంగా నియోజకవర్గాల్లో తిరగడంలేదు. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రం ప్రొటోకాల్‌కు పరిమితమవుతున్నారు.


జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా ఎమ్మెల్యేలకే ప్రాధాన్యమిస్తూ వారి ఆహ్వానాల మేరకే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుబంధంతోపాటు కేడర్‌ బలం కలిగిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కరోనా, ఇతర కారణాలతో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడం, అనుచరులు, కార్యకర్తల ఇళ్లలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరవడానికి పరిమితమవుతున్నారు. మొత్తంగా జిల్లాలో పైకి అంతా ఒక్కటే అన్నట్లుగా కనిపిస్తున్నా.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి వర్గాల మధ్య కూడా అంతర్గత పోరు జరుగుతోంది. ఇది మున్ముందు ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. 

TAGS: TRS Khammam