చల్లని స్వామి

ABN , First Publish Date - 2021-12-31T05:45:54+05:30 IST

మహాభారత కాలం నాటిదిగా స్థానికులు పేర్కొనే ఆ గ్రామంలో అరుదైన విశేషం ఒకటి ఉంది. అదే... నీటి వేడిని నియంత్రించే మహిమాన్వితుడిగా పేరుపొందిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం.

చల్లని స్వామి

మహాభారత కాలం నాటిదిగా స్థానికులు పేర్కొనే ఆ గ్రామంలో అరుదైన  విశేషం ఒకటి ఉంది.  అదే... నీటి వేడిని నియంత్రించే మహిమాన్వితుడిగా పేరుపొందిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం.


కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని గబ్బూరుకు ఆలయ పట్టణం అనే పేరుంది. ఈ గ్రామంలో ముప్ఫైకి పైగా ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో దీన్ని ‘గోపురగ్రామ’ అని, ‘గర్భపుర’ అని పిలిచేవారు. స్థానికుల కథనం ప్రకారం... ఈ ఊరు మహాభారత కాలంలో అర్జునుడి కుమారుడైన బభ్రువాహనుడి రాజధాని. దాన్ని అప్పట్లో ‘మణిపురం’ అని వ్యవహరించేవారు. అశ్వమేథ యాగం సందర్భంగా పాండవులు పంపిన యాగాశ్వాన్ని బభ్రువాహనుడు బంధించి, ఒక స్తంభానికి కట్టేశాడట. గబ్బూరులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఒక రాతి నిర్మాణం ఉంది. దాన్ని ‘బభ్రువాహన స్తంభం’ అంటారు. పాండవుల యాగాశ్వాన్ని బభ్రువాహనుడు ఆ స్తంభానికే కట్టేశాడని స్థానికుల విశ్వాసం.


గబ్బూరులోని గుడులన్నిటిలో విశిష్టమైనది శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరుడి ఆలయం. దాదాపు ఎనిమిదివందల ఏళ్ళ క్రితం కళ్యాణ చాళుక్య రాజులు దీన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం పైభాగం నుంచి వేడి నీటితో అభిషేకం చేస్తే... విగ్రహ పాదాల వద్దకు చేరేసరికి ఆ నీరు చల్లగా అయిపోతుందని, అయితే నాభికి దిగువగా... పాదాల మీద వేడి నీరు పోస్తే, అది వేడిగానే ఉంటుందనీ చెబుతారు. ఈ విచిత్రాన్ని తిలకించడానికి అభిషేక సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు. భక్తితో ఆరాధించేవారి కష్టాలను తొలగించి... వారి జీవితాల్లో చల్లదనం నింపే ‘చల్లనిస్వామి’గా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరుణ్ణి భక్తులు కొలుస్తారు. ఈ ఆలయంలో ధనుర్మాసంలో, ఇతర విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. 

Updated Date - 2021-12-31T05:45:54+05:30 IST