కోల్డ్‌ స్టోరేజీల కూల్‌ దందా

ABN , First Publish Date - 2020-03-29T11:38:15+05:30 IST

అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా తయారైంది అన్నదాతల పరిస్థితి. ఆరుగాలం కష్టించి పండించిన మిర్చి పంటను కోల్డ్‌ స్టోరేజీల్లో దాచుకుందామంటే అక్కడా చోటు లేక

కోల్డ్‌ స్టోరేజీల కూల్‌ దందా

ఖాళీ ఉన్నా నిండిందని గేట్లకు తాళం

రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులు

వ్యాపారుల పంటకే ప్రాధాన్యమిస్తుండటంతో నష్టపోతున్న రైతులు

కోల్డ్‌ స్టోరేజీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మార్కెట్‌ ఛైర్మన్‌, అధికారులు

ఖమ్మం మార్కెట్‌, మార్చి 28: అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా తయారైంది అన్నదాతల పరిస్థితి. ఆరుగాలం కష్టించి పండించిన మిర్చి పంటను కోల్డ్‌ స్టోరేజీల్లో దాచుకుందామంటే అక్కడా చోటు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లు మూతపడటంతో తాము పండించిన మిర్చి పంటను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకునేందుకు వెళ్లగా అక్కడ కూడా నిల్వకు అవకాశం లేకపోవడతో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మిర్చి  రైతులు రెండు రోజులుగా తెచ్చిన పంట దిగుమతి లేక లాక్‌డౌన్‌ ప్రభావంతో తినడానికి తిండి దొరకని పరిస్థితిలో బిక్కు బిక్కుమంటూ పడిగాపులు కాస్తున్నారు. కోల్డ్‌ స్టోరేజీల గేట్లు తెరుచుకోక పోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్నున్నారు.


ఖాళీ ఉన్నా.. నిండిందని గేట్లకు తాళం

కరోనా ప్రభావం వల్ల మార్కెట్‌ల్లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోగా, రైతులు తమ మిర్చి పంట నిల్వకు కోల్డ్‌ స్టోరేజీలకు తరలిస్తున్నారు. జిల్లాలోని మిర్చి  పండించే గ్రామాలనుంచి రైతులు తమ పంటను ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు తదితర వాహనాలతో సమీప కోల్డ్‌ స్టోరేజీల వద్దకు రావడంతో కోల్డ్‌ స్టోరేజీల యజమాన్యాలు గేట్లకు తాళం వేయడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు. వాస్తవానికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి పంపిన తమ గిడ్డంగులలో నిల్వ లెక్కకు, వారి వద్ద ఉన్న వాస్తవిక లెక్కకు పొంతన లేకపోవడంతో మార్కెట్‌ అధికారులు రంగంలోకి దిగారు.


కోల్డ్‌ స్టోరేజీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మార్కెట్‌ ఛైర్మన్‌, అధికారులు

మిర్చి రైతుల వాహనాలు బారులు తీరాయని తెలుసుకున్న మార్కెట్‌ అధికారులు శనివారం మార్కెట్‌ సమీపంలోని పలు కోల్డ్‌స్టోరేజీలను మార్కెట్‌ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డిలు ఆకస్మికంగా సందర్శించారు. రికార్డుల్లో తనిఖీలు చేసి మిర్చి బస్తాల లెక్కలను పరిశీలించి, కోల్డ్‌స్టోరేజీలో ఖాళీగా ఉన్న ర్యాకులను గమనించారు. ఖాళీ ఉన్నా.. ఎందుకు రైతుల మిర్చి  బస్తాలను దిగుమతి చేసుకోవట్లేదని కోల్డ్‌ స్టోరేజీ యజమాన్యాన్ని ప్రశ్నించారు. తక్షణమే రైతుల బస్తాలను దించుకోవాలని ఆదేశించారు. కోల్డ్‌ స్టోరేజీ లెక్కల్లో రైతుల పంట కన్నా వ్యాపారులు పంట ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌ అధికారులు వారిని రైతుల పంటకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. తక్షణమే రైతుల పంట దిగుమతి చేసుకోపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


రెండు రోజులుగా పడిగాపులు

కరోనా ప్రభావంతో మిర్చి అమ్ముకోడానికి అవకాశం లేదు కనుక కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేద్దామని శుక్రవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని కోల్డ్‌స్టోరేజీ వద్దకు వచ్చా. కోల్డ్‌ స్టోరేజీలు నిండాయని ఇవాళ పోస్టర్లు అంటించారు. ఇకనైనా దిగుమతి చేసుకుంటారని రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్నా.. కోల్డ్‌స్టోరేజీ యజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అధికారులు సైతం మా సమస్యను పట్టించుకోవడంలేదు. కనీసం లాక్‌డౌన్‌ ప్రభావంతో హోటళ్లు కూడా లేక పోవడంతో భోజనానికి ఇబ్బందులు పడుతున్నాం. 

ఎం.రాంబాబు, మిర్చీ రైతు, జీకె బంజర, రఘునాధపాలెం మండలం

Updated Date - 2020-03-29T11:38:15+05:30 IST