పాలమూరు ఆలయాలపై శీతకన్ను

ABN , First Publish Date - 2021-10-26T04:38:13+05:30 IST

ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక అయిన పాలమూరు ఆలయాలపై ప్రభుత్వం శీతకన్ను చూపుతోంది. యాదాద్రి స్ఫూర్తితో ఇక్కడి ఆలయాలకు పునర్వైభవం దక్కుతుందనే భక్తుల ఆశలు అడియాసలవుతున్నాయి.

పాలమూరు ఆలయాలపై శీతకన్ను
జడ్చర్ల మండలం గంగాపురంలోని ప్రసిద్ధ లక్ష్మీచెన్నకేశవాలయం

యాదాద్రి తరహా అభివృద్ధి ఏదీ?

ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక మహబూబ్‌నగర్‌ ఆలయాలు

కానుకలు, దాతల విరాళాలతోనే దూపదీప నైవేధ్యాలు

పురావస్తుశాఖ అడ్డంకితో అభివృద్ధికి నోచుకోని జడ్చర్ల చెన్నకేశవాలయం

కురుమూర్తిరాయుని ఆలయానికిభక్తులే అండ

కందూరు రామలింగేశ్వరాలయానిదీ అదే పరిస్థితి

ఆధునిక నిర్మాణాలతో మన్యంకొండకు కొత్తశోభ


ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక అయిన పాలమూరు ఆలయాలపై ప్రభుత్వం శీతకన్ను చూపుతోంది. యాదాద్రి స్ఫూర్తితో ఇక్కడి ఆలయాలకు పునర్వైభవం దక్కుతుందనే భక్తుల ఆశలు అడియాసలవుతున్నాయి. పిలిస్తే పలికే దైవాలుగా భక్తులు భావించే ప్రసిద్ధ ఆలయాలు కనీస నిధులు రాక అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాలోని మన్యంకొండ వెంకటేశ్వరాలయం మినహా మిగిలిన ఆలయాలకు దేవాదాయశాఖ నుంచి ప్రత్యేక నిధులేవీ రావడం లేదు. భక్తులిచ్చే కానుకలు, దాతల విరాళాలు, మాన్యం భూముల కౌళ్లతో ఆ ఆలయాల్లో దూపదీప నైవేద్యాలు కొనసాగుతున్నాయి.

-మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. చాలా ఆలయాలు భక్తులు, దాతలు ఇచ్చే విరాళాలతోనే నిర్వహించే పరిస్థితి నెలకొంది. జడ్చర్ల మండలం గంగాపురంలోని లక్ష్మీచెన్నకేశవాలయం పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో గోడలు పగుళ్లు బారుతున్నాయి. వెయ్యేళ్ల కిందట చాళుక్య రాజులు ఆనాటి శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయం పురావస్తుశాఖ పరిధిలోకి వచ్చిందనే సాకుతో దేవాదాయశాఖ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా వదిలేసింది. వంద ఎకరాలకుపైగా మాన్యం, నిత్యం భక్తుల రాకపోకలతో సందడిగా ఉండే ఆలయం రోజురోజుకు శిథిలమవుతున్న పరిస్థితి నెలకొంది. ఆలయ ప్రధాన నిర్మాణం ప్రాచీన కట్టడం కావడంతో కనీసం సున్నాలేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆలయం చుట్టూ ఉండే మండపాలు, ఇతర నిర్మాణాలు ఇప్పటికే కూలిపోగా, పక్కన ఇతర నిర్మాణాలతో అవసరాలు తీరుస్తున్నారు. ఏటా బ్రహ్మోత్సవాలు, ఇతర పండుగలు, పర్వదినాల సందర్భంగా వచ్చే విరాళాలు, కానుకలతో ఆలయ నిర్వహణ సాగుతోంది. ఆలయం చుట్టూ దాతల విరాళాలతో షెడ్ల వంటి నిర్మాణాలు చేపట్టారు. విలువైన శిల్పకళా సంపద ఈ ఆలయ నిర్మాణంలో కనిపిస్తోంది. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ఆలయానికి సాంకేతిక ఇబ్బందులు తొలగించి, యాదాద్రి తరహాలో అభివృద్ధి పరచాలని భక్తులు కోరుతున్నారు. 


పేదల తిరుపతికి దాతల అండే పెద్ద కొండ

పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి వేంకటేశ్వరాలయ అభివృద్ధికి దేవాదాయశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దాతల సహకారంతోనే ఇక్కడ కోనేరు, గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా యేటా జరిగే జాతరకు  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలొస్తారు. ఆలయానికి అధికంగా ఆదాయం వస్తున్నా, ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా రూ.1.50 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. కానీ ఆ స్థాయిలో భక్తులకు సదుపాయుయాలు గానీ, ఆలయ అభివృద్ధి పనులు గానీ జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయ రాజగోపుర నిర్మాణానికి రూ.1.20 కోట్లు కేటాయించగా, ఆ పనులు 70 శాతం మేర జరిగాయి. మరో రూ.90 లక్షల నిధులతో కోనేరు, మెట్లు, ఫ్లోరింగ్‌ పనులు సాగుతున్నాయి. ఆలయాన్ని పునరుద్ధరించేందుకు, కొండపైకి భక్తులు సులువుగా వెళ్లేందుకు మరో మార్గం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులతో పాటు, ప్రముఖ నాయకులకు ఇష్టదైవమైన కురుమూర్తిరాయుని ఆలయాన్ని అత్యంత వైభోపేతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


రామలింగేశ్వరాలయానికి నిధుల కొరత

దక్షిణకాశీగా పేరుగాంచిన కందూరు రామలింగేశ్వరాలయం అడ్డాకుల మండలం కందూరులో ఉంది. చాళుక్య ప్రభువుల కాలంలో  వెలిసినట్లు భావిస్తోన్న ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కల్ప వృక్షాలకు విశిష్టత ఉంది. బ్రహ్మోత్సవాలు, జాతర సమయంలో మినహా ఇతర సందర్భాల్లో ఆలయాన్ని పట్టించుకునే నాథుడు కరువయ్యారు.  భక్తులు కలుగజేసుకొని ఆలయ వృద్ధికి చర్యలు చేపట్టారు. ఈ ఆలయానికి దేవాదాయ శాఖ నుంచి అభివృద్ధి పనులకు ఆశించిన రీతిలో నిధులు రాకపోవడంతో పనులు సాగడం లేదు. 2017లో దేవాదాయశాఖ ద్వారా ప్రాకార మండప నిర్మాణానికి రూ.38 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో కొంత నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన నిధులివ్వకపోవడంతో ఆ పనులు ఆగిపోయాయి. దాతల సహకారంతో కోనేరు మెట్లు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆలయానికి జాతర ద్వారా వచ్చే రూ.20 లక్షల ఆదాయం బ్రహ్మోత్సవ నిర్వహణకు సరిపోతుండడంతో ఇక్కడ ప్రత్యేకంగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. ఎంతో విశిష్టత, ప్రత్యేకత గలిగిన ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ వృద్ధి చేయాలనే డిమాండ్‌ భక్తుల నుంచి వస్తోంది. 


మన్యంకొండలో పలు అభివృద్ధి పనులు

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పాలమూరు జిల్లాలో ఇతర ఆలయాలతో పోల్చుకుంటే మన్యం కొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఆశించిన రీతిలో నిధులు దక్కాయి. పలు పనులు సాగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజ కవర్గ పరిధిలోకి ఈ ఆలయం వస్తుండడం, జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆలయం కావడంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ క్షేత్రం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దాంతో నిధులు రాబట్టగలిగారు. దిగువన కొండకు ఎడమవైపు జీర్ణావస్థలో ఉన్న ఓబులేశ్వరస్వామి (లక్ష్మీనరసింహస్వామి) ఆలయాన్ని రూ.70 లక్షలతో పునరుద్ధరించారు. కోనలోకి వెళ్లే మార్గం వెడల్పు చేయడంతో పాటు, ఆలయానికి గోపురం, ధ్వజస్తంభం, మండపం, ప్రధాన రహదారి వద్ద ఆర్చి ఏర్పాటు చేశారు. ఆలయం లోపల ఫ్లోరింగ్‌, లైటింగ్‌, ఇతర పనులు చేపట్టారు. ఆలయ ప్రతిష్ట కూడా పెరగడంతో మన్యంకొండ వచ్చిన భక్తులంతా ఆలయాన్ని సందర్శించి వెళుతున్న పరిస్థితి నెలకొంది. మన్యంకొండపైనే మిషన్‌భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు ఏర్పాటు చేయడంతో ఆలయం వద్ద నీటి కొరత లేకుండా పోయింది. ఆలయంలో అన్ని అవసరాలకు కృష్ణా జలాలే వినియోగిస్తున్నారు. భక్తుల వసతి నిమిత్తం రూ.1.80 కోట్లతో వసతి గృహాన్ని నిర్మిస్తుండగా, రూ.2 కోట్లతో అలివేలుమంగ అమ్మవారి ఆలయం వద్ద ఏసీ కల్యాణ మండపం పనులు చేపట్టారు. దాదాపు 70 శాతం మేర పనులు పూర్తవగా, మిగిలిన పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని తలపెట్టారు. నరసింహస్వామి ఆలయం వద్ద, అలివేలు మంగ ఆలయంవద్ద రూ.40లక్షలతో మూడు షెడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొండపైకి రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. వీటితో పాటు దిగువన అలివేలు మంగ ఆలయ కోనేరు వద్ద, ఎగువ హనుమద్దాసుల కోనేరు వద్ద ఒక్కో చోట రూ.44 లక్షలతో పార్కుల అభివృద్ధికి నిఽధులు కేటాయించారు. దిగువన 45 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు, ప్రధాన రహదారి నుంచి ఘాట్‌ మొదలయ్యే వరకు రోడ్డు విస్తరణకు కూడా నిధులు ప్రతిపాదించారు. ఈ పనులన్నీంటికీ నిధులు మంజూరయితే ఈ ఆలయ ప్రతిష్ఠ పెరుగుతుందని, భక్తులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.









Updated Date - 2021-10-26T04:38:13+05:30 IST