సీమపై శీతకన్ను!

ABN , First Publish Date - 2022-08-10T08:55:10+05:30 IST

ఎగువ నుంచి పరవళ్లు తొక్కుకుంటూ కృష్ణమ్మ రాష్ట్రం లోకి దూసుకొస్తోంది. ఆలమట్టి ..

సీమపై శీతకన్ను!

  • కృష్ణమ్మ పరవళ్లు.. అయినా రాయలసీమకు పూర్తిగా నీరివ్వలేని దైన్యం
  • మూడేళ్లలో ఒక్క పథకాన్నీ పూర్తిచేయని జగన్‌ ప్రభుత్వం
  • కాల్వల సామర్థ్యమూ పెంచలేదు.. దీంతో ఎక్కువ నీటిని వదల్లేని దుస్థితి


(అమరావతి-ఆంధ్రజ్యోతి):  ఎగువ నుంచి పరవళ్లు తొక్కుకుంటూ కృష్ణమ్మ రాష్ట్రం లోకి దూసుకొస్తోంది. ఆలమట్టి .. నారాయణపూర్‌ జలాశయాలు నిండిపోవడంతో వరద నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు.. వరద నీటిని నిల్వ చేయడానికి మూడేళ్లుగా జగన్‌ సర్కారు ఎలాంటి శ్రద్ధా పెట్టని ఫలితంగా.. శ్రీశైలం నిండుకుండలా ఉన్నా రాయలసీమకు పూర్తిస్థాయిలో నీరివ్వలేని దుస్థితి నెలకొంది. కాలువలకు గరిష్ఠ సామర్థ్యంలో నీరు విడుదల చేయలేని పరిస్థితి. దాంతో చెరువులూ నిండడం లేదు. పరివాహక ప్రాంతాల్లోని కాలువ గట్ల నిర్వహణా లేదు. వరద నీటిని గరిష్ఠ సామర్థ్యంలో విడుదల చేస్తే గట్లు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 44,000 క్యూసెక్కులను విడిచిపెట్టే వీలున్నా.. గట్లు తెగిపోతాయని 17,000 క్యూసెక్కులను మాత్రమే విడిచిపెడుతున్నారంటే .. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 మూడేళ్లుగా రాయలసీమకు గరిష్ఠ స్థాయిలో జలాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. సీమ ప్రాజెక్టుల పట్ల జగన్‌ ప్రభుత్వ ఉదాశీనతే కారణమని చెబుతున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పేర్లను మార్చి.. రాయలసీమ దుర్భిక్ష నివారణ కార్యక్రమం పేరిట చేపట్టదలచిన పథకాలన్నీ నిలిచిపోయాయి. సీమ ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రంతో కవ్వించే ధోరణితో వ్యవహరించడం వల్లే జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ), న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌- బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌-గోరకల్లు రిజర్వాయరు వరకూ కాంక్రీట్‌ లైనింగ్‌ పనులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించినా.. మూడేళ్లలో ఖర్చుచేసింది రూ.120 కోట్లే. దీంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అలాగే గోరకల్లు రిజర్వాయరు-అవుకు రిజర్వాయరు వరకూ గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువ లైనింగ్‌ పనులు, అవుకు అదనపు టన్నెల్‌ పనులకు రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతూ వచ్చినా రూ.600 కోట్లు మాత్రమే వ్యయం చేయడంతో.. పనులు ముందుకు సాగలేదు. నిప్పులవాగు, కుందూ నదుల విస్తరణ, రాజోలి, జోలదరాశి జలాశయాల కోసం రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తామని.. కేవలం రూ.80 కోట్లే విదిల్చడంతో పనులు ఎందుకు పనికిరానివిగా మారిపోయాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూ. 3,800 కోట్లు వ్యయం చేస్తామని చెప్పి 80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇలాంటి అలసత్వానికి తోడు.. ఆయా ప్రాజెక్టుల అంచనా వ్యయాలు మూడేళ్లలో మూడింతలై.. మున్ముందు చేపట్టాలంటేనే భయపడే పరిస్థితి ఎదురైందని అంటున్నారు.


అంతా దిగువకే..

రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు భారీ స్థాయిలో కురవనప్పటికీ.. ఎగువన  కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ఉప్పొంగుతోంది. ఆలమట్టి నిండిపోవడంతో దిగువకు నీరు వదులుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలంలోకి  2,04,895 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,04,733 క్యూసెక్కుల వరద వస్తుంటే.. విద్యుదుత్పత్తి, క్రస్టు గేట్ల ద్వారా మొత్తం 285,724 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 884.60 అడుగులు ఉంది. సాగర్‌ గరిష్ఠ నీటి నిల్వ 312.05 టీఎంసీలకు గాను ఇప్పటికే 279 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి ప్రవాహం ఇలాగే కొనసాగితే గురువారం గేట్లు  ఎత్తివేసే వీలుందని నిపుణులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠ నిల్వ 45.77 టీఎంసీలకుగాను ప్రస్తుతం 40.68 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అవుట్‌ఫ్లో 67,742 క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ నిల్వ 3.07 టీఎంసీలూ నిల్వ ఉన్నాయి. బ్యారేజీ నుంచి 78,419 క్యూసెక్కులు వదులుతున్నారు.

Updated Date - 2022-08-10T08:55:10+05:30 IST