బుడమేరు మట్టి మాయం

ABN , First Publish Date - 2022-04-30T05:58:15+05:30 IST

బుడమేరు మట్టి మాయం

బుడమేరు మట్టి మాయం
బుడమేరు పూడికతీత పనులు సర్వే చేయకముందే అక్రమంగా తవ్వి తీసిన మట్టి

సర్వే చేయకముందే 50 సెంట్ల పరిధిలో తవ్వకాలు

గుడివాడలో మట్టి మాఫియా మరో అరాచకం

టిప్పర్లతో భారీగా మట్టి తరలింపు

ప్రైవేట్‌ లే అవుట్‌ మెరకకు లక్షల క్యూబిక్‌ మీటర్లు

జగనన్న కాలనీల మెరకకు మాత్రం అందని మట్టి

బండారం బయటపడటంతో హడావుడిగా సర్వే

ఆర్‌ఐ వ్యవహారం తర్వాత మిన్నకుండిపోయిన అధికారులు


బుడమేరు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మురుగు, వరద నీరు బయటకు తీసుకెళ్లే ప్రధాన డ్రెయిన్‌. ప్రస్తుతం ఆధునికీకరణ నిమిత్తం పూడికతీత పనులు చేపడుతున్నారు. ఇంకేముంది.. గుడివాడ మట్టి మాఫియా చేరిపోయింది. సర్వే చేయకుండానే టిప్పర్లకు టిప్పర్ల మట్టిని అక్రమంగా ఎత్తుకుపోతోంది. ఆర్‌ఐ అరవింద్‌పై దాడి.. రివర్స్‌ కేసు.. నేపథ్యంలో అధికారులు కూడా అడ్డుకోకపోవడంతో బుడమేరునూ దర్జాగా దోచేసుకుంటున్నారు. 


గుడివాడ, ఏప్రిల్‌ 29 : బుడమేరు ఆధునికీకరణ పెండింగ్‌ పూడికతీత పనులపై గుడివాడ మట్టి మాఫియా కన్నుపడింది. లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి అందుబాటులో ఉండటంతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సన్నద్ధమయ్యారు. నందివాడ మండల సరిహద్దులోని చేదుర్తిపాడు-కొయ్యగూరపాడు నడుమ కిలోమీటర్ల మేర వెడల్పు, పూడికతీతకు సర్వే చేయకముందే మట్టి తవ్వకాలు చేపట్టి తరలించేశారు. షామియానాలు వేసి మరీ మట్టి తరలింపునకు పక్కా దారులు వేశారు. ఇప్పటికే 225 టిప్పర్ల మట్టి ప్రైవేట్‌ లే అవుట్ల మెరకకు తరలిందని తెలుస్తోంది. ఇప్పటికీ రెండు జేసీబీలు చేదుర్తిపాడు పరిధిలో బుడమేరు ముళ్లపొదల్లో ఉంచడం గమనార్హం. బుడమేరు మట్టి తరలుతోందనే కథనాలు పత్రికల్లో రావడంతో డ్రెయినేజీ, రెవెన్యూ శాఖల అధికారులు పూడికతీత పనుల సర్వే చేపట్టారు. మట్టి తవ్వితీశాక సర్వే చేయడమేంటని డ్రెయినేజీ డీఈఈ శిరీషను ప్రశ్నిస్తే, మూడేళ్ల కిందటే కిలోమీటర్ల పూడికతీతకు రూ.కోటి మంజూరైందని చెప్పారు. తరలిపోయిన మట్టికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు. గుడివాడ పట్టణంలోని ప్రైవేట్‌ లే అవుట్ల మెరక కోసం నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు గ్రామాల మీదుగా వెళ్తున్నాయి. వీటి రాకపోకలు మితిమీరడంతో బైపాస్‌ రోడ్డు టీచర్స్‌ కాలనీవాసులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

ప్రైవేట్‌ వ్యక్తుల కోసం ఇలా..

ఇప్పటికే గుడివాడ రూరల్‌, గుడ్లవల్లేరు మండలాల్లో మట్టి తోలకాలు ప్రారంభించి ప్రైవేట్‌ లే అవుట్లు విజయవంతంగా మెరక చేసిన మట్టి కాంట్రాక్టర్లు.. తాజాగా మెగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను మెరక చేసే ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుడమేరు మట్టిపై దృష్టి సారించారని సమాచారం. గ్రామ చెరువులు, కాలువలు, డ్రెయిన్లు.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ మట్టి తవ్వి ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. మోటూరులో అడ్డుకోబోయిన ఆర్‌ఐ అరవింద్‌పై మట్టి మాఫియా హత్యాయత్నానికి తెగబడింది. పైపెచ్చు ఆయనపైనే రివర్స్‌ కేసు పెట్టడంతో మట్టి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలంటే ప్రభుత్వ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో జగనన్న       లే అవుట్లకు మట్టి ఎలా సమకూర్చాలో అంతుబట్టక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

జగనన్న లే అవుట్ల మెరక ఎలా?

రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ మెరకకు నోచుకోలేదు. బేస్‌మెంట్‌ పూర్తి చేసిన లబ్ధిదారులకు మధ్యలో పూడ్చడానికి బుసక, మట్టి లభించకపోవడంతో లబోదిబోమంటున్నారు. అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదు. 98 శాతం ఇళ్లకు పునాదులు సైతం పడలేదు. బుడమేరులో కిలోమీటర్‌ మేర తవ్వకాలు చేపట్టనున్న నేపథ్యంలో లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్‌ రంజిత్‌ బాషా జోక్యం చేసుకుని ఈ మట్టిని జగనన్న లే అవుట్ల మెరకకు వినియోగించాలని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బుడమేరు మట్టి పేదల ఇళ్ల స్థలాల మెరకకు ఉపయోగిస్తారో, మట్టి మాఫియాపరం చేసి ప్రైవేట్‌ లే అవుట్ల మెరకకు తరలిస్తారో చూడాలి. 





Updated Date - 2022-04-30T05:58:15+05:30 IST