వ్యాక్సిన్‌ వచ్చేసింది!

ABN , First Publish Date - 2021-01-14T07:02:48+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి భరతం పట్టడానికి ‘కోవీ షీల్డ్‌’ 47 వేల వ్యాక్సిన్‌ డోస్‌లు జిల్లాకు చేరాయి.

వ్యాక్సిన్‌ వచ్చేసింది!
వ్యాక్సిన్‌ బాక్సుల్లో ఐస్‌ సిద్ధం చేస్తున్న సిబ్బంది


 ‘కోవీషీల్డ్‌ ’ వయల్స్‌ జిల్లాకు రాక 

డీఎంహెచ్‌వో కార్యాలయ   ఆవరణలో ప్రత్యేక డీప్‌ఫ్రీజర్‌  సెంటర్‌లో 47 వేల డోస్‌లు భద్రం 

ఈనెల 16న 33 కేంద్రాల్లో 3,300 హెల్త్‌కేర్‌ సిబ్బందికి  వ్యాక్సినేషన్‌ 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ మహమ్మారి భరతం పట్టడానికి ‘కోవీ షీల్డ్‌’ 47 వేల వ్యాక్సిన్‌ డోస్‌లు జిల్లాకు చేరాయి. ఔషధం వస్తున్న సందర్భంగా తెల్లవారుజాము నుంచే డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణ అంతా ఆత్రుత నెలకొంది. విజయవాడకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఈ వ్యాక్సిన్‌ను జిల్లా నుంచి వెళ్లిన ప్రత్యేక పోలీస్‌ బలగాలు ఎస్కార్ట్‌గా ఉండి బుధవారం ఉదయం 6.45 నిమిషాలకు డీఎంహెచ్‌వో కార్యాలయానికి తీసుకువచ్చారు. అప్పటికే ఇక్కడ ఉన్న జిల్లా ఇమ్యునైజేషన్‌ అధి కారి (డీఐవో) డాక్టర్‌ అరుణ, జిల్లా టీబీ నియంత్రణాధికారి, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎన్‌ ప్రసన్నకుమార్‌ వ్యాక్సిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నుంచి కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీప్‌ ఫ్రీజర్‌లో భద్రపరిచారు. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగి వ్యాక్సిన్‌కు సరిపడా చల్లదనం కోసం బాక్సుల్లో ఉంచే ఐస్‌ బాక్స్‌లను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. సదరు ప్రక్రియ అంతా గంట వ్యవధిలో పూర్తయ్యింది. వ్యాక్సిన్‌ బాక్సులు అధి కారులు తీసుకుంటున్న సమయంలో అక్కడ ఒక్కసారిగా ఏదో విజయం సాధించబోతున్నా మనే ధీమా అందరిలో కనిపించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ఈనెల 16 నుంచి ఎంపిక చేసిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. 

లాంఛనంగా ప్రారంభం 

జిల్లాలో తొలుత ఎంపిక చేసిన 33 కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 100 మంది చొప్పున 3,300 మంది వ్యాక్సిన్‌ ఇచ్చి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కో కేంద్రంలో మూ డు గదులు ఏర్పాటు చేశారు. మొదటి గదిలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉంటారు. వ్యాక్సిన్‌కు వచ్చే సిబ్బంది వివరాలు సరిచూసి వైద్యులున్న రెండో గదికి పంపుతారు. అక్కడ వ్యాక్సిన్‌ వేశాక , మూడో గదిలో ఒక కేర్‌ టేకర్‌ నేతృత్వంలో వీరు అరగంటపాటు అబ్జర్వేషన్‌లో ఉంటారు. వ్యాక్సిన్‌ వల్ల ఏ దుష్ఫలితం కనిపించినా వెంటనే ప్రత్యామ్నయ వైద్యం అందిస్తారు. దీనికి సంబంధించిన మందులు ప్రతీ సెంటర్‌లో నిల్వ చేశారు. 

వ్యాక్సిన్‌ వేసే కేంద్రాలివే 

అమలాపురం ఏరియా ఆసుపత్రి, గోడిలంక కమ్యునిటీ హెల్త్‌ సెంటర్‌ (పీహెచ్‌సీ). అనపర్తి సీహెచ్‌సీ, బిక్కవోలు పీహెచ్‌సీ. పి గన్నవరంలో లూటుకుర్రు, నాగుల్లంక పీహెచ్‌సీల్లో, జగ్గంపేట, రాజపూడి పీహెచ్‌సీలు. కాకినాడ జీజీహెచ్‌లో పోస్ట్‌ పాటర్న్‌ యూనిట్‌ (పీపీయూ) స్థానిక రేచర్లపేటలో అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ), కాకినాడ రూరల్‌లో కరప, తూరంగి పీహెచ్‌సీలు, కొత్తపేటలో గోపాలపురం, పెదపాల, ఊబలంక పీహెచ్‌సీల్లో. మండపేట యూహెచ్‌సీ, ముమ్మిడివరంలో కేశనకు ర్రు, కొత్తలంక పీహెచ్‌సీల్లో, పెద్దాపురం పీపీ యూ, పిఠాపురం సీహెచ్‌సీ, చేబ్రోలు పీహెచ్‌సీలో, ప్రత్తిపాడులో సీహెచ్‌సీ, శంఖవరం పీహెచ్‌సీ, రాజమహేంద్రవరం అర్బన్‌లో జిల్లా ఆసు పత్రి పీపీయూలో, స్థానిక సీతంపేట బృహన్నలపేట యూపీహెచ్‌సీలో, రాజమహేంద్రవరం రూరల్‌లో ధవళేశ్వరం పీహెచ్‌సీ, రాజానగరం పీహెచ్‌సీ, కోరుకొండ పీహెచ్‌సీలో, రామచంద్రపురం పీపీయూలో, రంపచోడవరంలో పెదగెద్దాడ పీహెచ్‌సీ, రాజోలు తాటిపాక పీహెచ్‌సీ, తునిలో ఏరియా ఆసుపత్రి పీపీయూలో తొలి రోజు 3,300 హెల్త్‌ కేర్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయనున్నట్టు డీఐవో డాక్టర్‌ అరుణ చెప్పారు.




Updated Date - 2021-01-14T07:02:48+05:30 IST