సంఘటిత శక్తి

ABN , First Publish Date - 2022-05-25T06:18:53+05:30 IST

క్వాడ్దేశాధినేతలంతా టోక్యోలో ఉండగానే, చైనా, రష్యా యుద్ధవిమానాలు జపాన్ సముద్రతీరం మీద వీరంగం వేశాయని ఆ దేశ రక్షణమంత్రి చేసిన వ్యాఖ్య కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే...

సంఘటిత శక్తి

క్వాడ్దేశాధినేతలంతా టోక్యోలో ఉండగానే, చైనా, రష్యా యుద్ధవిమానాలు జపాన్ సముద్రతీరం మీద వీరంగం వేశాయని ఆ దేశ రక్షణమంత్రి చేసిన వ్యాఖ్య కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే. జపాన్ రాజధాని టోక్యోలో క్వాడ్ సదస్సు సంకల్పించినప్పటినుంచీ చైనా సణుగుతోందనీ, గుర్రుమంటోందనీ వార్తలు వింటున్నాం. ఈ యుద్ధవిమాన విన్యాసాలకు భయపడేది లేదనీ, ఈ రెచ్చగొట్టే చేష్టలు సరికాదనీ జపాన్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే ఈ క్వాడ్ దేశాధినేతల భేటీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలోనూ, తైవాన్ విషయంలో చైనా వైఖరి భయపెడుతున్న సందర్భంలోనూ జరిగిన విషయం తెలిసిందే.


ఈ సదస్సు లక్ష్యం చైనాయేనా? అన్న ప్రశ్నకు సమాధానాలు నేరుగా ఉండవు కానీ, ఐదేళ్ళక్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ క్వాడ్ గ్రూప్‌ను మళ్ళీ పునరుద్ధరించాలని నిర్ణయించింది మాత్రం అందుకే. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ అగ్రనేతలంతా ఒక్కచోటకు చేరి మాట్లాడుకోవడం గత రెండేళ్ళలో ఇది నాలుగోసారి. మధ్యలో రెండుసార్లు వర్చువల్‌గా మాట్లాడుకున్నారు కూడా. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మిగతా దేశాలకు పూర్తి భిన్నమైన వైఖరి తీసుకున్న భారతదేశానికి ఈ ప్రత్యక్షభేటీ నిజానికి ఇబ్బందికరమైనదే. అయితే, మొన్న ఏప్రిల్‌లో అమెరికా భారత్ విదేశాంగ, రక్షణమంత్రుల టూ ప్లస్ టూ సదస్సు పరిస్థితులను కాస్తంత మెరుగుపరచిన నేపథ్యంలో భారత్ వైఖరిపట్ల అమెరికా సహా పశ్చిమదేశాలు తమ అసహనాన్ని పూర్తిగా తగ్గించుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా తమకు నచ్చినరీతిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, క్వాడ్ దేశాలకు ప్రధాన సమస్య చైనా ఈ ప్రాంతంలో తన శక్తినీ ఆధిపత్యాన్నీ ప్రదర్శించేందుకు ప్రయత్నించడం. చైనాతో సరిహద్దు వివావాదాలు భారత్ సహా చాలాదేశాలకు ఉన్నాయి. ఆస్ట్రేలియా అంచుల్లో ఉన్న దీవుల్లోకి కూడా చైనా చొరబడుతూ, వాటితో రక్షణరంగ ఒప్పందాలు కుదర్చుకుంటున్నది. సాలోమన్ దీవులతో కుదిరిన ఒప్పందం మేరకు వాటి రక్షణ పేరిట చైనా తన యుద్ధనౌకలను అక్కడ మోహరిస్తే ఆస్ట్రేలియాకు పెద్ద తలనొప్పి. అలాగే, జపాన్ కు కూడా చైనా పెడుతున్న బాధలు చాలా ఉన్నాయి. ఉక్రెయిన్ లోకి రష్యా చొరబడటంతో ఇంతవరకూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక నమ్మకం సడలిపోయిందనీ, నడవడిక మారిపోయిందనీ, దేశాలన్నీ తమ భద్రత విషయంలో భయపడే పరిస్థితి వచ్చిందని జపాన్ ప్రధాని ఈ సమావేశంలో చేసిన ప్రసంగం పూర్తిగా కొట్టిపారేయాల్సింది కాదు. అంతర్జాతీయ నియామాలు, ప్రాదేశిక సమగ్రతలూ అన్నీ ఉల్లంఘిస్తూ జరిగిన ఈ యుద్ధం వంటిది ఇండో పసిఫిక్ ప్రాంతంలో సంభవించకుండా జాగ్రత్తలు పడాలన్నది క్వాడ్ సంకల్పం. 


తమ గ్రూపు ఎవరికీ వ్యతిరేకం కాదనీ, ఆర్థిక, దౌత్య సంబంధాల బలోపేతం కోసం ఈ కూటమి ఏర్పడిందని క్వాడ్ దేశాలు మర్యాదకు అంటుంటాయి. ‘ఏషియా నాటో’ అని క్వాడ్ ను అభివర్ణిస్తున్న చైనా మాత్రం దీని ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత వేడెక్కిన విషయాన్ని గుర్తుచేస్తుంటుంది. ఒక స్వేచ్ఛాయుత, సుసంపన్నమైన, సంఘటిత ప్రాంతంగా ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని మార్చాలన్నది క్వాడ్ ఉద్దేశం. అలాగే, వాక్సిన్ దౌత్యం, పెట్టుబడులు, అధునాతన సాంకేతికతలను పెంచడం, పంచుకోవడం, వాతావరణ మార్పుల ముప్పు నివారించడం వంటి ఉత్తమ ఉద్దేశాలు లక్ష్యాలు దీనికి ఉన్నాయి. క్వాడ్ ప్లస్ పేరుతో దక్షిణకొరియా, వియత్నాం, న్యూజిలాండ్ దేశాలతో ఇటీవల భేటీలు నిర్వహించడం కూడా నాలుగుదేశాలకే దీనిని పరిమితం చేయదల్చుకోలేదని అర్థం. భారత్ సహా 13దేశాలతో అమెరికా ఏర్పాటు చేసిన ఐపీఈఎఫ్ (ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్ వర్క్) చైనాకు వ్యతిరేకంగా ఒక బలమైన శక్తిని సృష్టించే ప్రయత్నమే. తమది మంచికోసం ఉద్భవించిన సంఘటితశక్తి అని ప్రకటించుకున్న క్వాడ్ తన సంయుక్త ప్రకటనలో మరిన్ని సంకల్పాలను చెప్పుకుంది. రెండేళ్ళక్రితం కంటే ఉక్రెయిన్ యుద్ధం అనంతర పరిణామాల నేపథ్యంలో, రష్యా చైనా సయోధ్య హెచ్చిన స్థితిలో తమ సంఘటితత్వం మరింత అధికం కావాలన్నది క్వాడ్ ఆలోచన. చైనా సృష్టిస్తున్న ఉద్రిక్తతలు, తీరాల్లోకి చొరబడుతున్న దృష్టాంతాలను క్వాడ్ దాని పేరు ఎత్తకుండా ఘాటుగా విమర్శించింది, హెచ్చరించింది. జపాన్, ఆస్ట్రేలియా అధినేతలతో మోదీ సమావేశాన్ని అటుంచితే, అమెరికా అధ్యక్షుడితో విడిగా జరిపిన భేటీ ఉభయదేశాల సాన్నిహిత్యాన్నీ మరింత పెంచేందుకు ఉపకరిస్తుంది. 

Updated Date - 2022-05-25T06:18:53+05:30 IST