జ్ఞాన మార్గదర్శకుడు

ABN , First Publish Date - 2021-07-23T05:30:00+05:30 IST

అనంతమైన ఈ చరాచర ప్రపంచమంతటా వ్యాపించిన అఖండ మండలాకార దివ్యపథాన్ని

జ్ఞాన మార్గదర్శకుడు

రేపు గురు పూర్ణిమ

అఖండ మండలాకారం వ్యాప్తయేన చరాచరమ్‌

తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవేనమః


అనంతమైన ఈ చరాచర ప్రపంచమంతటా వ్యాపించిన అఖండ మండలాకార దివ్యపథాన్ని దర్శింపజేసేది గురువు. కనుకనే లోకమంతా దివ్య జ్ఞానమూర్తి అయిన ఆ గురువుకు సదా ప్రణమిల్లుతోంది. సకల ప్రపంచానికీ దివ్య జ్ఞాన, ధర్మ గురుపీఠం భారతదేశం. సర్వ దేవతా స్వరూపుడైన గురువు పాదపద్మ పూజే మానవాళి జీవన పరమార్థమైన మోక్షానికి పూలబాట. భారతీయ సంస్కృతిలో గురువుది విశిష్టమైన స్థానం.




త్రిమూర్తి స్వరూపుడు...


అజ్ఞానపు చీకట్లను తొలగించి, జ్ఞానజ్యోతితో దారి చూపించే దైవం గురువు. దేవ లోకానికి బృహస్పతి, అసుర లోకానికి శుక్రాచార్యుడు గురువులు. సకల మానవ లోకానికీ జ్ఞాన మార్గదర్శకుడైన గురువు వ్యాస మహర్షి.


వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రమకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌


వశిష్టుడి మనవడిగా, పరాశర మునీంద్రునికీ, సత్యవతికీ యమునానదీ తీరాన కృష్ణ ద్వీపంలో ఆయన జన్మించాడు. కృష్ణద్వైపాయనుడిగా ప్రశస్తి పొందాడు. ఆయన కుమారుడు శుకయోగి. ధర్మ జ్ఞాన కాంతులను విశ్వంలో ప్రసరింపజేయడానికి వ్యాసుడు జన్మించిన రోజైన ఆషాఢ పూర్ణిమ గురుపూర్ణిమగా ఖ్యాతి పొందింది. 


అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరిః

అఫాలలోచన శ్శంభుః భగవాన్‌ బాదరాయనమః

ఆయన నాలుగు శిరస్సులు లేని బ్రహ్మ. రెండు చేతులే కలిగిన విష్ణువు. ఫాలభాగంలో మూడో కన్ను లేని శివుడు అయిన బాదరాయణుడు... వ్యాసుడు త్రిమూర్తి స్వరూపుడు. భారతీయ ఆర్ష వాఙ్మయంలో ప్రధానమైన వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించి, పంచమ వేదమైన శ్రీమహాభారతాన్ని... సాక్షాత్తూ తొలి వేలుపు గణపతే లేఖకునిగా రచించి, శ్రీకృష్ణావతార కథామూలమైన శ్రీమద్భాగవతాన్నీ, అష్టాదశ పురాణాలనూ, వేదాంగాలనూ వేదవ్యాసుడు లోకానికి అనుగ్రహించాడు. 


వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః

వ్యాస మునీంద్రుడు మహా విష్ణు స్వరూపుడు. గురువులందరిలోనూ ఆయనది గురుస్థానం. ‘మునీనామహం వ్యాసః’ అంటే ‘మునులలో వ్యాసుణ్ణి నేనే!’ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు. 


గురువును ధ్యానించి...

గురువును పూజించుకోవడం అనాది సంప్రదాయం. గురు అనుగ్రహాన్ని పొందినవారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు. గురు అనుగ్రహం లేనిదే జ్ఞానాన్ని పొందడం దుర్లభం. గురువును మన సంప్రదాయం అత్యున్నత స్థానంలో నిలిపింది. శ్రీ వేదవ్యాసుని జయంతి అయిన ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకొంటారు. గురువులను పూజించడం, వారు అందించిన అపారమైన జ్ఞానానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం, వారు చేసిన ఉపదేశాలను సదా మననం చేసుకోవడం మన కర్తవ్యం. మనకు తెలియని విషయాలను ఎవరు చెప్పినా వారిని గురువులుగా పరిగణించాలి. పురాణాల్లో ఎందరో సద్గురువులు కనిపిస్తారు.


త్రేతాయుగంలో శ్రీరాముడికి దివ్యాస్త్రాలను ప్రసాదించి, సీతాదేవితో కళ్యాణం జరిపించిన లోక కళ్యాణ గురువు విశ్వామిత్రుడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ బలరాములకు వేద శాస్త్రాలను బోధించిన, సాందీప ముని. అలాగే కౌరవ పాండవులను ధనుర్విద్యా కోవిదులను చేసిన ద్రోణాచార్యులు... వీరంతా సద్గురువులుగా విశేష కీర్తి పొందారు. వీరితోపాటు రామాయణ మహాకావ్యాన్ని జాతికి బహుమతిగా అందించిన వాల్మీకి మహర్షినీ, గీతాచార్యులైన శ్రీకృష్ణుడినీ... మనకు విద్య నేర్పిన, మార్గదర్శకులైన గురువులనూ ఒకేసారి స్మరించుకొనే సందర్భం గురు పౌర్ణమి.  


 కళ్యాణశ్రీ జంథ్యాల వేంకట రామశాస్త్రి


Updated Date - 2021-07-23T05:30:00+05:30 IST