కాఫీ గింజల కొనుగోలులో జీసీసీ విఫలం

ABN , First Publish Date - 2022-01-28T06:47:29+05:30 IST

ఏజెన్సీలో కాఫీ సాగు చేస్తున్న ఆదివాసీ రైతులకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి కనీస స్థాయిలో కూడా సహాయ సహకారాలు అందడం లేదు. కాఫీ గింజలకు గిట్టుబాటు ధర కల్పించడంలో జీసీసీ పూర్తిగా విఫలమైంది. కాఫీ కొనుగోళ్ల విషయంలో ప్రైవేటు వ్యాపారుల కంటే దారుణంగా తయారైంది. వారపు సంతల్లో, గ్రామాలకు వచ్చి కాఫీ కొనుగోలు చేసే వర్తకులు చెల్లించే ధర కంటే జీసీసీ నిర్ణయించిన ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో జీసీసీకి పంట విక్రయించడానికి గిరిజనులు విముఖత చూపుతుండడంతో కాఫీ కొనుగోళ్ల లక్ష్యానికి సుదూరంలోనే ఆగిపోతున్నది.

కాఫీ గింజల కొనుగోలులో జీసీసీ విఫలం
విక్రయానికి సిద్ధం చేస్తున్న కాఫీ పండ్లు

గిరిజన రైతులకు అందని సహకారం

మార్కెట్‌ కంటే తక్కువ ధరలు నిర్ణయం

అంతర్జాతీయంగా పార్చిమెంట్‌ కిలో రూ.320, చెర్రీ రూ.140

రూ.280, రూ.125కు స్థానిక వర్తకుల కొనుగోళ్లు

జీసీసీ చెల్లిస్తున్నది రూ.180, రూ.75 మాత్రమే!

లక్ష్యానికి దూరంగా కొనుగోళ్లు

చింతపల్లి డివిజన్‌లో సేకరించాల్సింది 1,500 టన్నులు

ఇంతవరకు కొనుగోలు చేసింది ఆరు టన్నులే!

మరికొద్ది రోజుల్లో ముగియనున్న సీజన్‌


చింతపల్లి, జనవరి 27:

ఏజెన్సీలో కాఫీ సాగు చేస్తున్న ఆదివాసీ రైతులకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి కనీస స్థాయిలో కూడా సహాయ సహకారాలు అందడం లేదు. కాఫీ గింజలకు గిట్టుబాటు ధర కల్పించడంలో జీసీసీ పూర్తిగా విఫలమైంది. కాఫీ కొనుగోళ్ల విషయంలో ప్రైవేటు వ్యాపారుల కంటే దారుణంగా తయారైంది. వారపు సంతల్లో, గ్రామాలకు వచ్చి కాఫీ కొనుగోలు చేసే వర్తకులు చెల్లించే ధర కంటే జీసీసీ నిర్ణయించిన ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో జీసీసీకి పంట విక్రయించడానికి గిరిజనులు విముఖత చూపుతుండడంతో కాఫీ కొనుగోళ్ల లక్ష్యానికి సుదూరంలోనే ఆగిపోతున్నది. 

విశాఖ ఏజెన్సీలో సుమారు లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. ఏటా 10-12 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఆరేళ్ల క్రితం వరకు ఎటువంటి మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడంతో కాఫీ గింజలను ప్రైవేటు వ్యాపారులు అడిగిన ధరకు విక్రయించాల్సి వచ్చేది. 2015-16లో టీడీపీ ప్రభుత్వం గిరిజన రైతుల నుంచి కాఫీ గింజలు కొనుగోలు చేయించి, జాతీయ/అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయించే బాధ్యతను గిరిజన సహకార సంస్థకు అప్పగించింది. లాభాపేక్ష లేకుండా మార్కెట్‌లో ఎంత ధరకు కాఫీ గింజలు విక్రయిస్తే అంతే మొత్తాన్ని గిరిజన రైతులకు చెల్లించాలని ఆదేశించింది. రైతుల నుంచి సేకరించిన కాఫీ గింజలకు తొలివిడత కొంత ధర చెల్లించి, మార్కెట్‌లో విక్రయించిన తరువాత మిగిలిన సొమ్ము చెల్లించేది. గిరిజన కాఫీ రైతులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్న జీసీసీకి కేంద్ర కాఫీ బోర్డు ప్రోత్సాహకంగా కిలోకు రూ.10 చొప్పన చెల్లిస్తుంది. దీంతో కాఫీ గింజల రవాణా ఖర్చులు రైతులపై పడేవి కావు. అప్పటి నుంచి జీసీసీ కాఫీ కొనుగోలు చేస్తున్నది.


రెండేళ్ల నుంచి గాలికొదిలేసిన జీసీసీ

కాఫీ మార్కెటింగ్‌ విషయంలో జీసీసీ 2015-16 నుంచి 2018-19 సీజన్‌ వరకు సమర్థంగానే పనిచేసింది. చింతపల్లి సబ్‌ డివిజన్‌లో 2015-16లో చెర్రీ, పార్చిమెంట్‌ కలిపి 932 టన్నులు, 2016-17లో 185 టన్నులు (ఆ ఏడాది కాఫీ దిగుబడులు భారీగా తగ్గాయి), 2017-18లో 567 టన్నులు, 2018-19లో 625 టన్నులు కొనుగోలు చేసింది. ఆ తరువాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కొరవడడం, జీసీసీ ఉన్నతాధికారులు శ్రద్ధ చూపకపోవడంతో కాఫీ కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. 2019-20లో 104 టన్నులు, 2020-21లో 118 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు టన్నుల గింజలను మాత్రమే కొనుగోలు చేశారంటే జీసీసీ తీరు ఏ విధంగా వుందో అర్థం చేసుకోవచ్చు. 


ప్రైవేటు వ్యాపారుల కంటే తక్కువ రేటు ఇస్తున్న జీసీసీ

బెంగళూరు మార్కెట్‌లో కాఫీ పార్చిమెంట్‌ కిలో రూ.320, చెర్రీ రూ.140 ధర పలుకుత్నుది. ఏజెన్సీలో ప్రైవేటు వర్తకులు పార్చిమెంట్‌ రూ.280, చెర్రీ రూ.125కు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ మాత్రం పార్చిమెంట్‌ రూ.180, చెర్రీకి రూ.75 మాత్రమే చెల్లిస్తున్నది. దీంతో గిరిజన రైతులు తమ కాఫీ పంటను ప్రైవేటు వర్తకులకు విక్రయిస్తున్నారు. 


మార్కెట్‌ ధరల ప్రకారం జీసీసీ కొనుగోలు చేయాలి

కిముడు లక్ష్యయ్య, కాఫీ రైతు, లంబసింగి

కాఫీ కొనుగోళ్ల విషయంలో జీసీసీ అధికారుల తీరు న్యాయబద్ధంగా లేదు. గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో వున్న ధరల ప్రకారం మాకు డబ్బులు చెల్లించేవారు. కానీ ఇప్పుడు స్థానికంగా కొనుగోళ్లు జరిపే ప్రైవేటు వర్తకులకన్నా తక్కువ ఇస్తున్నారు. పార్చిమెంట్‌ కిలోకి రూ.100కుపైగా తక్కువ ఇస్తుండడంతో జీసీసీకి అమ్మడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కాఫీ కొనుగోలు ధరల విషయంలో జీసీసీ ఎండీ, చైర్‌పర్సన్‌ స్పందించాలి.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

ఎం.జగన్నాథరెడ్డి, జీసీసీ డీఎం, చింతపల్లి 

ప్రైవేటు వర్తకులు చెల్లిస్తున్న ధరతో పోలిస్తే జీసీసీ చెల్లిస్తున్న ధర తక్కువగా వుండడంతో లక్ష్యం మేరకు కాఫీ కొనుగోలు చేయలేకపోతున్నాం. ఈ ఏడాది మా డివిజన్‌లో 1,500 టన్నుల కాఫీ గింజలు కొనుగోలు చేయాలి. కానీ ఇంతవరకు ఆరు టన్నులు మాత్రమే కొనుగోలు చేయగలిగాం. జీసీసీ చెల్లించే ధర గిట్టుబాటు కాదని గిరిజన రైతులు చెబుతున్నారు. ధరల వ్యత్యాసాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. 

 

Updated Date - 2022-01-28T06:47:29+05:30 IST