కొబ్బరిని కమ్మేస్తున్న ‘రూగోస్‌’ వైరస్‌

ABN , First Publish Date - 2022-01-29T06:28:04+05:30 IST

జిల్లాలో కొబ్బరి తోటలను ‘రూగోస్‌’ అనే తెల్లదోమ (వైరస్‌ తెగులు) ఆశించి, రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది. సుమారు రెండేళ్ల క్రితం అక్కడక్కడా కనిపించిన ఈ తెగులు, ప్రస్తుతం సముద్ర తీరంలో వున్న అన్ని మండలాలోని కొబ్బరి తోటలకు విస్తరించింది.

కొబ్బరిని కమ్మేస్తున్న ‘రూగోస్‌’ వైరస్‌
‘రూగోస్‌’ అనే తెల్లదోమ ఆశించడంతో ఎండిపోతున్న కొబ్బరి ఆకులు

శరవేగంగా విస్తరిస్తున్న తెల్లదోమ

ఆకులను ఆశించి రసం పీల్చివేత

నల్లగా మారి ఎండిపోతున్న ఆకులు

ఐదో వంతుకు పడిపోయిన కాయ దిగుబడి

తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన

జీవ నియంత్రణ పద్ధతులతో

నివారణ చర్యలు చేపపట్టాలని శాస్త్రవేత్తల సూచన


రాంబిల్లి/ పాయకరావుపేట రూరల్‌, జనవరి 28:

జిల్లాలో కొబ్బరి తోటలను ‘రూగోస్‌’ అనే తెల్లదోమ (వైరస్‌ తెగులు) ఆశించి, రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది. సుమారు రెండేళ్ల క్రితం అక్కడక్కడా కనిపించిన ఈ తెగులు, ప్రస్తుతం సముద్ర తీరంలో వున్న అన్ని మండలాలోని కొబ్బరి తోటలకు విస్తరించింది. సాధారణంగా ఎకరా తోటలో ఏడాదికి ఐదారు వేల కొబ్బరి కాయల దిగుబడి వస్తుంది. కానీ ఈ తెగులు సోకితే వెయ్యి కాయలకు మించి దిగుబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు. రూగోస్‌ తెల్లదోమ లక్షణాలు, కొబ్బరి తోటలకు కలుగజేసే నష్టం, నివారణ చర్యలపై బీసీటీ కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త బి.నాగేంద్రప్రసాద్‌, ఉద్యాన శాస్త్రవేత్త జి.వి.సుబ్బారెడ్డి తెలిపిన సమాచారం...

తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దులో పొల్లాచ్చి అనే ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో సుమారు ఆరేళ్ల క్రితం రూగోస్‌ వలయాకార తెల్లదోమను గుర్తించారు. అక్కడి నుంచి కొబ్బరి మొక్కల ద్వారా కడియం నర్సరీలకు, అక్కడి నుంచి మొక్కలు కొనుగోలు నాటిన ఆయా ప్రాంతాల్లోని కొబ్బరి తోటలను ఈ తెగులు ఆశించింది. జిల్లాలో పాయకరావుపేట నుంచి భీమిలి వరకు సముద్ర తీర మండలాల్లో సుమారు 10 వేల హెక్టారుల్లో కొబ్బరి తోటలు వుండగా, సగానికిపైగా తోటలకు తెల్లదోమ వ్యాపించింది. రూగోస్‌ తెల్లదోమ కొబ్బరి ఆకుల అడుగుభాగాన చేరి తేనె వంటి జిరుగు పదార్థాన్ని విసర్జిస్తుంది. దీనికి ఒక రకమైన శిలీంధ్రం ఆకర్షితమై ఆకులపై పెరుగుతుంది. దీనివల్ల ఆకులు నల్లటి మసితో నిండి, ఎండ తగలకపోవడంతో కిరణజన్య సంయోగక్రియలకు అంతరాయం ఏర్పడుతుంది. తద్వారా పత్రహరితాన్ని తయారుచేసుకోలేక ఎండిపోతాయి. గెలలు ఆలస్యంగా వస్తాయని, పిందె దశలోనే కాయలు రాలిపోతాయని, తద్వారా దిగుబడి బాగా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యంగా వున్న తోటల్లో ఏడాదికి ఎకరాకు ఐదారు వేల కొబ్బరి కాయల దిగుబడి వస్తుందని, ఈ తెగులు సోకితే వెయ్యి కాయలకు మించి దిగుబడి రాదని వెల్లడించారు.


నివారణ చర్యలు

రసాయన క్రిమి సంహారక మందులతో రూగోస్‌ వైరస్‌ తెల్లదోమను నియంత్రించడం సాధ్యం కాదు. ఒకవేళ రసాయన మందులు పిచికారీ చేస్తే...తెల్లదోమలను తినే మిత్ర పురుగులు చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల జీవ నియంత్రణ పద్ధతి ద్వారానే అరికట్టాలి. మిత్రపురుగులైన ఎన్‌కార్సియా గొడిలోపియా లేదా క్రైసోపెర్లా లేదా డైకోక్రైసా జాతి బదనికలను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసి తోటల్లో వదలడం ద్వారా సర్పిలాకార తెల్లదోమను సమర్థంగా అరికట్టవచ్చు. దోమ లార్వా నిద్రావస్థలో వున్నప్పుడు ఆకులపై బదనికలను వదిలితే దోమ సమూలంగా నాశనమవుతుంది. ఎన్‌కార్సియా గొడిలోపియా పురుగులు అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధన స్థానంలో లభ్యమవుతాయి. వీటిని దోమలు ఉన్నచోట మాత్రమే విడిచిపెట్టాలి. 

వేప నూనెతో.... 

రూగోస్‌ వైరస్‌ తెల్లదోమ నివారణకు వేప సంబంధ మందులను పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లీటరు నీటికి పది మిల్లీలీటర్ల వేపనూనె,ఒక గ్రాము డిటర్జెంట్‌ పౌడర్‌ కలిపి చెట్టులో ప్రతి భాగం తడిసేలా, మసి అంతా పోయేలా పిచికారీ చేయాలి. కొబ్బరి చెట్లు బాగా ఎత్తుగా వుంటాయి కాబట్టి ‘రెడ్‌ బీ’ అనే స్ర్పేయర్‌తో మందును పిచికారీ చేయాలి. పది రోజులకు ఒకసారి చొప్పున మూడు లేదా నాలుగుసార్లు పిచికారీ చేయాలి. ఇంకా పసుపు రంగు జిగురు అట్టలను చెట్లకు కట్టడం ద్వారా దోమ ఉధృతిని అరికట్టవచ్చు.


తెల్లదోమ నివారణకు ప్రభుత్వం సహకరించాలి

పి.చంటిరాజు, కొబ్బరి రైతు, గోపాలపట్నం, పాయకరావుపేట మండలం

మాకు పది ఎకరాల కొబ్బరి తోట ఉంది. దీనికితోడు ఎకరా రూ.35 వేల చొప్పున మరో 15 ఎకరాలను కౌలుకు తీసుకున్నాను. సాధారణంగా ఎకరాకు ఆరు నుంచి ఏడు వేల వరకు కాయ దిగుబడి వస్తుంది. ఏడాది క్రితం తెల్లదోమ వ్యాపించడంతో కాయ దిగుబడి క్రమేపీ తగ్గిపోతున్నది. కౌలు డబ్బులు వచ్చే పరిస్థితి కూడా లేదు. సామూహిక చర్యల ద్వారానే తెల్లదోమ నివారణ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు ప్రభుత్వం సహకరించాలి.


Updated Date - 2022-01-29T06:28:04+05:30 IST