కోడే గెలిచింది

ABN , First Publish Date - 2021-01-14T05:52:50+05:30 IST

కోడే గెలిచింది. కోర్టుల ఆంక్షలు, పోలీసు, రెవెన్యూ అధికారుల హెచ్చరికలు బేఖాతరయ్యాయి. పందేలకు ఎటువంటి అనుమతులు ఇవ్వబోమని చెప్పిన పోలీసులు మిన్నకుండిపోయారు. బుధవారం కోడి పందేలు యథేచ్ఛగా నిర్వహించారు.

కోడే గెలిచింది
జంగారెడ్డిగూడెం మండలంలో కోడిపందేలు


యథేచ్ఛగా కోడి పందేలు, జూద క్రీడలు

చేతులు మారిన కోట్లు.. కానరాని పోలీసులు

 కోడే గెలిచింది. కోర్టుల ఆంక్షలు, పోలీసు, రెవెన్యూ అధికారుల హెచ్చరికలు  బేఖాతరయ్యాయి. పందేలకు ఎటువంటి అనుమతులు ఇవ్వబోమని చెప్పిన పోలీసులు మిన్నకుండిపోయారు. బుధవారం  కోడి పందేలు యథేచ్ఛగా నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో మినహా పందెగాళ్లు రెచ్చిపోయారు. లక్షలాది రూపాయలు చేతులు మారాయి.

 జంగారెడ్డిగూడెం, జనవరి 13:  పట్టణంలోని సుబ్బంపేట, శ్రీనివాసపురం, లక్కవరం, ఎ.పోలవరం, పంగిడిగూడెం, పేరంపేట, గుర్వాయిగూడెం, దేవులపల్లి గ్రామాల్లో పందేలు  ఏర్పాటు చేసి కోళ్లకు కత్తులు కట్టి  పందేలను నిర్వహించారు.  పోలీసుల నుంచి ఎటువంటి దాడులు ఉండవని నిర్వాహకులు చెప్పడంతో పేకాట స్థావరాలు కిటకిటలాడాయి.  బరుల వద్దే కొంత మంది రహస్యంగా మద్యం అమ్మకాలు జరిపారు. పందేల స్థావరాల వద్ద జేబుదొంగల హడావుడి కూడా ఎక్కువగానే ఉంది. చిన్నపిల్లలు సైతం పేకాట, జూద క్రీడల్లో సొమ్ము విరజిమ్మారు.  పందేలలో పెద్దనోట్లదే హవా. ఎవరు పందెం కట్టినా రూ.500లు, రూ.2వేల నోట్లే చేతులు మారాయి.  

కొవ్వూరు: మండలంలోని దొమ్మేరు, తోగుమ్మి, నందమూరు, ఐ.పంగిడి, ఆరికిరేవుల గ్రామాలలో పందాలు యథేచ్ఛగా సాగాయి.  అధికార యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరించడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం వరకు పందేలకు  అనుమతి ఇవ్వలేదు. అనంతరం కోడి పందేలను  చూసీచూడనట్టు వదిలేశారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో బరులను అప్పటికప్పుడు సిద్ధం చేసి పందేలను నిర్వహించారు.  జూదక్రీడలను అరికట్టేందుకు వేసిన గ్రామస్థాయి ప్రత్యేక బృందాల జాడలేదు.

ద్వారకాతిరుమల: మండలంలో  దొరసానిపాడు, ద్వారకాతిరుమల, వెంకటకృష్ణాపురం, తిమ్మాపురం, తిరుమలంపాడు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. రాత్రి వేళల్లో కోడిపందేలను నిర్వహించేందుకు ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. కోడిపందేల నిర్వహణకు నిర్వాహకులు వేలాది రూపాయలను చెల్లించుకున్నట్టు సమాచారం. 

గోపాలపురం: బుధవారం మధ్యాహ్నం నుంచి కోడిపందేలు యథేచ్ఛగా జరిగాయి.  బరులు సిద్ధం చేసి వాటిలో పందిళ్లు వేయించి కోడి పందేలు నిర్వహించారు.  గుండాట, పేకాట వంటివి యదేచ్చగా జరిగాయి. కోడి పందేల్లో చనిపోయిన కోళ్లకు డిమాండ్‌ పెరిగింది. రూ.1500 నుంచి 3వేల వరకు వీటిని విక్రయించారు. 

దేవరపల్లి: మండలంలోని దేవరపల్లి, దుద్దుకూరు, బందపురం, గౌరీపట్నం, త్యాజంపూడి, యర్నగూడెం, యాదవోలు గ్రామాల్లో కోడిపందేలు, గుండాట, యథేచ్ఛగా జరిగాయి. వందలాది మంది కోడిపందేల్లో పాల్గొన్నారు.  కరోనా నిబంధనలు పాటించలేదు. 

నల్లజర్ల: మండలంలో యథేచ్ఛగా కోడి పందేలు జరిగాయి.  మండలం తొమ్మిది చోట్ల బరులు వేసి పందేలు నిర్వహించారు.  కోడి పందేలతో పాటు గుండాట, పేకాట శిబిరాలు వెలిశాయి. కాగా కవులూరు–పోతవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ముందు కోడి పందేలు నిర్వహించడంతో అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై కలెక్టర్‌ కార్యాలయానికి  ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

బుట్టాయగూడెం: మండలంలో దుద్దుకూరుతోపాటు మారుమూల ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. పోలీసుల హెచ్చరికల వల్లో, కరోనా భయమో తెలియదు కానీ పందెం బరుల వద్ద జనాల సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఎమ్మెల్యే బాలరాజు  పందేలను తిలకించారు.

జీలుగుమిల్లి: మన్యంలోని గిరిజన గ్రామాల్లో అరకొరగా కోడి పందేలు జరిగాయి.  తాటియాకులగూడెంలో ఒక బరి వద్ద పందెం రాయుళ్లు లేక వెలవెల బోయింది. మరో చోట జాతీయ రహదారి పక్కనే పందెం బరి, గుండాట ఏర్పాటు చేయటం గమనార్హం. మరో వైపు పోలీసులు నిర్వాహకుల వివరాలు బైండోవర్‌ కేసుల నమోదు వంటి కార్యకమ్రాల్లో నిమగ్నమయ్యారు. రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో వీఆర్‌ఏలను పందేల నిర్వహణపై నిఘా ఉంచాలని సూచించారు. 

టి.నరసాపురం: మండలంలో టి.నరసాపురం, తిరుమలదేవిపేట, బొర్రం పాలెం, వీరభద్రవరం, బంధంచర్ల, అప్పలరాజుగూడెం గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి.  పలుచోట్ల కోతాట, గుండాట వంటి జూద క్రీడలతో పాటు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.

కొయ్యలగూడెం:  మండలంలో  రామానుజపురం, బయ్యన్నగూడెం, రాజవరం, ఉంగుటూరు, దిప్పకాయలపాడు, బోడిగూడెం తదితర గ్రామాల్లో పందేలు సాగాయి.  పందేలను చూడటానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  గుండాట, పేకాట యథేచ్ఛగా సాగింది.

టి.నరసాపురం: మండలంలో టి.నరసాపురం, తిరుమలదేవీపేట, బొర్రంపాలెం, వీరభద్రవరం, బంధంచర్ల, అప్పలరాజుగూడెం గ్రామాలలో యఽథేచ్ఛగా కోడిపందేలు జరిగాయి.

కుక్కునూరు: మండలంలో నాలుగు చోట్ల కోడిపందేలు ప్రారంభమ య్యాయి. కుక్కునూరులో అధికార, ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో చీరవల్లి, వేలేరు గ్రామాల్లో కోడిపందాలు జరిగాయి. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కోడిపందేలకు వచ్చారు. అయితే  4 బరుల్లోను మందకొడిగానే  పందేలు జరిగాయి.  మద్యం అమ్మకాలు, ఇతర జూద క్రీడలు  కూడా నిర్వహించారు. 

చింతలపూడిలో కాలు దువ్వని కోళ్లు.. 

చింతలపూడి: చింతలపూడి మండలంలో కోడి పందేల జాడ కాన రాలేదు.  పోలీసులు ముందుగానే అదనపు సిబ్బందిని రప్పించి కట్టడి  చేశారు. సంక్రాంతి నాడు జరిగే అవకాశం ఉందని   చెప్పుకుంటున్నారు. 

కామవరపుకోట: మండలంలో కోడి పందేలు, జూదక్రీడలు బుధ వారం ముమ్మరంగా  ప్రారంభమయ్యాయి. మంగళవారం వరకు పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు చేసిన  అధికారుల జాడ కానరాలేదు.  

తాళ్లపూడి:  మండలంలోని పోచవరం, గజ్జరం–2లో, తాళ్లపూడి, వేగేశ్వరపురం, పెద్దేవం–2లో బరులు వేసి కోడి పందేలు నిర్వహించారు.     గుండా టల్లో యువత చెయ్యి కాల్చుకుంది.

చాగల్లు: మండలంలోని మీనానగరం, బ్రాహ్మణగూడెం, ఊనగట్ల, మార్కొండపాడు గ్రామాల్లో  కోడి పందేలు నిర్వహించారు. పేకాట, గుండాట  సైతం నిర్వహించారు.  మద్యం సైతం అందుబాటులో ఉంచారు.    కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం గమనార్హం.


Updated Date - 2021-01-14T05:52:50+05:30 IST