కోట్లాట

ABN , First Publish Date - 2022-01-15T06:19:13+05:30 IST

కోట్లాట

కోట్లాట

జిల్లావ్యాప్తంగా జోరుగా కోడి పందేలు

సుమారు 800 వరకూ బరులు

కోడి పందేల్లో రూ.10 కోట్ల లావాదేవీలు

లోపల-బయటలో మరో రూ.10 కోట్లు

అతిపెద్ద బరిగా అంపాపురం

పక్క జిల్లాల నుంచి భారీగా పందెపురాయుళ్లు

పండుగ పందేలు జోరందుకున్నాయి. కోడి పందేలు రూ.కోట్లలో జరిగాయి. బరులు భారీగా వెలిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పందెపురాయుళ్లు కాలు దువ్వారు. ఫలితంగా పండుగ మొదటి రోజు జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల వరకూ  కోడి పందేలు, మరో రూ.10 కోట్లు లోపల-బయట ఆటలు జరిగాయి. కృష్ణాజిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచీ పందెపు రాయుళ్లు రావడంతో కోడి పందేలు కోలాహలంగా సాగాయి.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) :  జిల్లాలో శుక్రవారం కోడి పందేలు, పేకాట, గుండాటలు భారీగా జరిగాయి. ఇటు విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోనూ, అటు జిల్లా పోలీసుల పరిధిలోనూ భోగి రోజున కోడిపుంజులు బరుల్లోకి దిగాయి. గ్రామాల్లోని ఇళ్ల మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశాల్లోనూ చిన్నచిన్న బరులను ఏర్పాటు చేశారు. ఇక మామిడి తోటలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో భారీ బరులు సిద్ధమయ్యాయి. గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో అతిపెద్ద బరులు ఏర్పాటు చేశారు. స్టేడియం మాదిరిగా తీర్చిదిద్దారు. ఇక జిల్లాలో మొత్తం 800 వరకు కోడిపందేల బరులు ఉన్నట్టు తెలుస్తోంది. వాటికి పక్కనే సమీపంగా గుండాట, పేకాట శిబిరాలను నెలకొల్పారు. సంక్రాంతి, కనుమ రోజున పందేలు మరింత ఎక్కువగా జరుగుతాయని సమాచారం. 

తొలిరోజు రూ.10 కోట్లు

జిల్లాలో తొలిరోజు ఒక్క కోడి పందేలపైనే రూ.10 కోట్ల వరకు చేతులు మారాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అంపాపురం, మైలవరం, ముసునూరు, జగ్గయ్యపేట, వత్సవాయి, కంచికచర్ల, ఈడుపుగల్లు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన బరుల్లో పందేలు పరుగులు తీశాయి. అంపాపురంలో రూ.లక్ష నుంచి రూ.10 లక్షల బరులు, కొన్నిచోట్ల రూ.10 వేల నుంచి రూ.లక్ష, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ప్రత్యేకంగా బరులు సిద్ధం చేశారు. సంక్రాంతి రోజున పందేలు రూ.50 కోట్ల వరకు జరగొచ్చని సమాచారం. మైలవరం నియోజకవర్గంలో ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో వేర్వేరుగా బరులు సిద్ధమయ్యాయి. ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం, కొత్తూరు తాడేపల్లిలో ఈ శిబిరాలు పందెపురాయుళ్లకు ఆహ్వానాలు పలుకుతున్నాయి. నందిగామ నియోజకవర్గంలో కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలోని శివారు తోటల్లో ఏర్పాటు చేసిన బరుల వద్ద తెలంగాణ వాసుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ దాదాపు 20 బరులను ఏర్పాటు చేశారు. రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. దీనికి 200 మీటర్ల దూరంలో పేకాట క్లబ్‌ మాదిరిగా ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఆటగాళ్లకు ఆహ్వానం పలికి, ఆతిథ్యం ఇవ్వడానికి ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు. ఈ శిబిరాలను ఓ ప్రజాప్రతినిధి లాంఛనంగా ప్రారంభించారు. అంపాపురం వద్ద ఇటు కృష్ణా, అటు పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దుల్లో ఏర్పాటు చేయడంతో రెండు జిల్లాల నుంచి భారీగా తరలివస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి బెట్టింగ్‌ రాయుళ్లు అంపాపురం చేరుకున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులే ఈ మొత్తం వ్యవహారాలను చక్కబెడుతున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడు, ఈడుపుగల్లు, ఉప్పులూరు గ్రామాల్లో బరులు ఏర్పాటు చేశారు. ఈడుపుగల్లు బరులు అత్యధిక రేటు పలుకుతున్నాయి.

లోపల-బయట ఆటలో రూ.10 కోట్లు

పేకాటలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిపెట్టేది లోపల-బయట. జిల్లాలో కోడిపందేల బరులకు చెంతనే నిర్వహిస్తున్న పేకాట శిబిరాల్లో లోపల బయట ఆటను బాగా నిర్వహిస్తున్నారు. పందేల్లో గెలిచిన వారు ఈ ఆట ఆడుతున్నారు. గెలిచిన వారు పందేల వైపు పరుగులు తీస్తున్నారు. చిన్న, పెద్ద బరులు అని తేడా లేకుండా అన్నిచోట్ల లోపల బయటను రెండో అతిపెద్ద ఆటగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు బెట్టింగ్‌లు పెట్టారు. కోడి పందేలపై భోగి రోజున రూ.10 కోట్లు చేతులు మారితే, పేకాటలోని లోపల బయటపై మరో రూ.10 కోట్ల లావాదేవీలు జరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. శిబిరాల వద్ద మినీ రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. తెల్లవార్లూ జరిగే ఈ పందేలు, బెట్టింగ్‌ల్లో పాల్గొనే వారికి ఆహారాన్ని సమకూర్చడానికి వివిధ రకాల వంటకాలను సిద్ధం చేశారు. మద్యం తాగుతూ, ఆహారం తినేందుకు వీలుగా మొబైల్‌ రెస్టారెంట్లను సిద్ధం చేశారు. 

కరోనా భయమే లేదు

జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అప్రమత్తత అవసరమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, సంక్రాంతి పందేల ముందు ప్రమాదం కనిపించడం లేదు. పందేల్లో పాల్గొంటున్న వారు, వాటిని తిలకించడానికి వచ్చినవారు ఏమాత్రం కరోనా నిబంధనలు పాటించలేదు. మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్‌ వినియోగించడం మానేశారు. భౌతిక దూరం అనే పదానికి స్థానమే లేదు. 








Updated Date - 2022-01-15T06:19:13+05:30 IST