Abn logo
May 23 2020 @ 13:56PM

75 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న విక్ర‌మ్ ‘కోబ్రా’

ప్రయోగాత్మక పాత్రలకు ఎప్పుడూ ముందుండే సియాన్‌ విక్రమ్‌ నటిస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘కోబ్రా’. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ బహు పాత్రల్లో కనిపించబోతున్నారు. విక్రమ్‌ కెరీర్‌లోనే అత్యధిక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచిపోయి విడుదలకు మరింత జాప్యం జరుగనుంది. అసలు ‘కోబ్రా’ స్టేటస్‌ ఏంటో తెలియక అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ 7 స్ర్కీన్‌ స్టూడియో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘కోబ్రా’ షూటింగ్‌ 90 రోజులపాటు జరిపామని, ఇంకా 25శాతం షూటింగ్‌ మిగిలి ఉందని, లాక్‌డౌన్‌ తరువాత వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేస్తామని చెప్పారు. కాగా, ఈ చిత్రంలో విక్రమ్‌కు జోడీగా కన్నడతార శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, భారత క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కథలో అతి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఒకేసారి ‘కోబ్రా’ తెరకెక్కుతోంది.

Advertisement
Advertisement
Advertisement