దేశంలో ఆందోళనకరంగా బొగ్గు నిల్వలు.... పవర్ ప్లాంట్స్‌కి గడ్డుకాలం

ABN , First Publish Date - 2021-10-05T23:49:29+05:30 IST

బొగ్గు నిల్వలు తగిన స్థాయిలో లేకపోవడంతో బొగ్గు ఆధారిత విద్యుత్తు

దేశంలో ఆందోళనకరంగా బొగ్గు నిల్వలు.... పవర్ ప్లాంట్స్‌కి గడ్డుకాలం

న్యూఢిల్లీ : బొగ్గు నిల్వలు తగిన స్థాయిలో లేకపోవడంతో బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడినట్లు విద్యుత్తు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 1 నాటికి 72 ప్రాజెక్టులకు మూడు రోజులకు సరిపడిన బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని, 50 ప్లాంట్లకు 4 నుంచి 10 రోజులకు, 13 ప్రాజెక్టులకు 10 రోజులకు పైగా అవసరమైన బొగ్గు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.


భారత దేశ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 383.37 గిగావాట్స్. దీనిలో 53 శాతం అంటే 202.67 గిగావాట్స్ సామర్థ్యంగల ప్రాజెక్టులు బొగ్గుపై ఆధారపడుతున్నాయి. దేశంలో అతి పెద్ద బొగ్గు వినియోగదారు విద్యుదుత్పత్తి రంగమే. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోల్ ఇండియా లిమిటెడ్ బొగ్గును అత్యధికంగా తవ్వుతోంది. 


భారత దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ జరుగుతుండటంతో విద్యుత్తుకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. సెప్టెంబరులో భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి, సరఫరా తగ్గాయి. దిగుమతి చేసుకునే బొగ్గు ధరలు పెరిగాయి. దీంతో దేశీయ బొగ్గుపైనే విద్యుత్తు ప్లాంట్లు ఆధారపడవలసి వచ్చింది. మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు బొగ్గుకు చెల్లించవలసిన బాకీలను చెల్లించలేదు. దీంతో బొగ్గు సరఫరా తగినంతగా జరగలేదు. 


సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్దేశించినట్లుగా 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను థర్మల్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ నిర్వహించి ఉంటే, బొగ్గు నిల్వలు తగ్గిపోయే పరిస్థితి ఉత్పన్నమై ఉండేది కాదని కోల్ ఇండియా లిమిటెడ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.


Updated Date - 2021-10-05T23:49:29+05:30 IST