ఎన్టీటీపీఎస్‌లో నిండుకున్న బొగ్గు నిల్వలు: దేవినేని

ABN , First Publish Date - 2021-10-11T02:54:55+05:30 IST

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే విజయవాడ ఎన్టీటీపీఎస్‌లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయని, విద్యుత్‌ సంక్షోభానికి దారి

ఎన్టీటీపీఎస్‌లో నిండుకున్న బొగ్గు నిల్వలు: దేవినేని

విజయవాడ: ప్రభుత్వ వైఫల్యం కారణంగానే విజయవాడ ఎన్టీటీపీఎస్‌లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయని, విద్యుత్‌ సంక్షోభానికి దారి తీసే పరిస్థితులు నెలకొంటున్నాయని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీటీపీఎస్‌లో ఏడు యూనిట్లకు గాను ప్రస్తుతం ఐదు యూనిట్లలో మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి జరగడంతో 1760 మెగావాట్లకు గాను 950 మెగా వాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. ఏడు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కావాలంటే సుమారు 21 వేల టన్నుల బొగ్గు అవసరం ఉందన్నారు. చంద్రబాబు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసి  రూ.36 వేల కోట్లతో 10 వేల మెగా వాట్ల విద్యుత్‌ తెచ్చారన్నారు. జగన్‌ ఈ 29 నెలల్లో కేవలం వెయ్యి మెగావాట్లు తేలేక విద్యుత్‌ కోతలు విధిస్తూ ఇప్పటికే 12 వేల కోట్లు ముక్కు పిండి వసూళ్లు చేశారన్నారు. మరలా మరో 24 వేల కోట్ల భారం ట్రూ అఫ్‌ చార్జీల రూపంలో మోపబోతున్నాడని దుయ్యబట్టారు. దేశంలోనే పేరున్న జెన్‌కోను నిర్వీర్యం చేయడంతో బొగ్గు అప్పు ఇచ్చే వారు లేకుండా పోయారన్నారు. పూర్తిగా విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి పంపి జగనన్న విశనకర్ర పథకాన్ని ఏపీలోకి తీసుకురానున్నాడని దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.   

Updated Date - 2021-10-11T02:54:55+05:30 IST