సమష్టి కృషితో సీజనల్‌ వ్యాధుల కట్టడి

ABN , First Publish Date - 2022-05-24T05:45:01+05:30 IST

రానున్న రోజుల్లో సీజనల్‌ వ్యాధులను అదుపు చేసేందుకు సమష్టి కృషి ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు.

సమష్టి కృషితో సీజనల్‌ వ్యాధుల కట్టడి
సదస్సులో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌


వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

అలక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ హెచ్చరిక


ముంచంగిపుట్టు, మే 23: రానున్న రోజుల్లో సీజనల్‌ వ్యాధులను అదుపు చేసేందుకు సమష్టి కృషి ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. స్థానిక కల్యాణ మండపంలో సోమవారం మలేరియా, డయేరియా, టైఫాయిడ్‌ తదితర సీజనల్‌ వ్యాధులను అదుపు చేసేందుకు గాను ముందస్తు ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్లతో  వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యాధులను అదుపు చేసేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, భవిష్యత్తు కార్యాచరణపై వారితో చర్చించారు. గ్రామాల్లో వ్యాధులు విజృంభించకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్‌  వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో పాటు పలు రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని,  వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలో ఎక్కువగా మలేరియా కేసులు నమోదవుతున్నాయని, మలేరియా దోమల నివారణ స్ర్పేయింగ్‌ పనులు సక్రమంగా చేపట్టాలన్నారు. లేకుంటే సంబంధిత అధికారులపై  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాతా శిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకు వైద్య ఆరోగ్య శాఖలోని ఏఎన్‌ఎంలు, ఆశ, సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది అంతా సమన్వయంతో పని చేసి గర్భిణులను, బాలింతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఏ గ్రామంలోనైనా జ్వరాలు, ఇతర వ్యాధులతో మృతి చెందినా, మాతా శిశు మరణాలు జరిగినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో వ్యాధులు వ్యాపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని, ఆ గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు బాధితులకు సంపూర్ణ వైద్య సేవలు అందే విధంగా చూడాలని ఆదేశించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎల్‌.రామ్మోహన్‌, ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌, జిల్లా మలేరియా అధికారి మణి, జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి కుమార్‌, ఎంపీడీవో ఏవీవీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:45:01+05:30 IST