కోచ్‌ రవిశాస్త్రికి కొవిడ్‌

ABN , First Publish Date - 2021-09-06T08:25:01+05:30 IST

టీమిండియా బయోబబుల్‌లో మరోసారి కరోనా కలకలం రేగింది. హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో అతడు క్వారంటైన్‌లో ఉన్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

కోచ్‌ రవిశాస్త్రికి కొవిడ్‌

లండన్‌: టీమిండియా బయోబబుల్‌లో మరోసారి కరోనా కలకలం రేగింది. హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో అతడు క్వారంటైన్‌లో ఉన్నట్టు బీసీసీఐ ప్రకటించింది. శాస్త్రితో సన్నిహితంగా మెలిగిన మరో ముగ్గురు సహాయక సిబ్బందిని కూడా ముందుజాగ్రత్తగా ఐసోలేషన్‌కు తరలించినట్టు పేర్కొంది. శుక్రవారం రాత్రి నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లో శాస్త్రికి పాజిటివ్‌గా రావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడితోపాటు సన్నిహితంగా మెలిగిన బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌, ఫిజియో నితిన్‌ పటేల్‌కు ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు వీరిని హోటల్‌ గదుల్లో ప్రత్యేకంగా ఐసొలేట్‌ చేశారు. భారత ఆటగాళ్లకు రెండుసార్లు యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్‌గా వచ్చిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. దీంతో నాలుగో రోజు ఆటను యాథావిధిగా కొనసాగించారు. భారత బృందంలో ప్రతి ఒక్కరూ రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. టీమిండియా బస చేసిన హోటల్లో శాస్త్రి రాసిన పుస్తకం విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రవిశాస్త్రితోపాటు అరుణ్‌, శ్రీధర్‌, నితిన్‌ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం తర్వాత శాస్త్రిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. 


కేఎల్‌ రాహుల్‌కు జరిమానా

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అంపైర్‌ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు భారత ఓపెనర్‌ రాహుల్‌పై 15 శాతం జరిమానా విధించారు. మూడో రోజు ఆట 34వ ఓవర్‌లో అతడు కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా ఇంగ్లండ్‌ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాహుల్‌ మైదానం వీడాడు.  జరిమానాతో పాటు అతడి క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా జత కలిపారు.

Updated Date - 2021-09-06T08:25:01+05:30 IST