రోజుకో మలుపు.. చివరి నిమిషంలో మారిన పేరు

ABN , First Publish Date - 2020-08-12T16:27:21+05:30 IST

జవహర్‌నగర్‌ కో-ఆప్షన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నాటినుంచి సభ్యుల ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఎట్టకేలకు బుధవారం ఉత్కంఠకు

రోజుకో మలుపు.. చివరి నిమిషంలో మారిన పేరు

కొలిక్కివచ్చిన కో-ఆప్షన్‌లు

నేడే ఎన్నిక


జవహర్‌నగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి ) : జవహర్‌నగర్‌ కో-ఆప్షన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నాటినుంచి సభ్యుల ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఎట్టకేలకు బుధవారం ఉత్కంఠకు తెర పడనుంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ అధ్యక్షతన బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. ఇదే సమావేశంలో కో-ఆప్షన్‌ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు. 


ఇలా మొదలైంది....

కో-ఆప్షన్‌ నోటిఫికేషన్‌ వచ్చిన రెండు రోజుల్లోనే తొలుత మైనార్టీ కోటాలో పలువురు తీవ్రంగా పోటీ పడ్డారు. చివరకు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళకు కేటాయించడంతో పాటు మరో మైనార్టీ నాయకుడిని అందరూ ఆమోదించారు. హమ్మయ్య అనుకున్న క్రమంలోనే క్రిస్టియన్‌ మైనార్టీ వర్గానికి చెందిన మతపెద్దలు, ఆశావహులు  తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డికి విన్నవించుకున్నారు. దాంతో ఆలోచనలో పడ్డ టీఆర్‌ఎస్‌ నాయకులు మరోసారి భేటీ అయ్యారు. అయితే, అందరి అంచనాలు తారుమారు చేస్తూ మైనార్టీ మహిళా కోటాలో భూమ విజయను, మరో మైనార్టీ నాయకుడు ఫారుఖ్‌ను ఫైనల్‌ చేశారు. 


జనరల్‌ కోటాలో....

మైనార్టీ కోటాలో ఎంపిక పూర్తి కావడంతో జనరల్‌ స్థానంలో ముగ్గురు సభ్యుల ఎంపికలో పదవులు ఆశించినవారు చివరి వరకు తమ ప్రయత్నలు చేశారు. అధిష్ఠానం అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తూ శ్రీనివాస్‌గౌడ్‌, శోభారెడ్డి, శ్వేతముఖేశ్‌లను ఎంపిక చేసింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ల సమక్షంలో ఎంపిక చేసిన ఐదుగురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. 


పట్టువీడని గండి నర్సయ్య...

దళిత నేతగా అందరికీ సుపరిచితుడైన గండి నర్సయ్య కో-ఆప్షన్‌ పదవిని ఆశిస్తున్నారు. ఒకపక్క నామినేషన్ల పర్వం ముగిసినా పట్టువీడని గండి నర్సయ్య మంత్రి మల్లారెడ్డికి తన వాదన వినిపించి చివరిరోజు నామినేషన్‌ దాఖలు చేశారు. పది రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న సభ్యుల ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.


ఐదుగురు వీరే..

మైనార్టీ కోటాలో ఫారుక్‌, భూమ విజయ, ఇతరుల కోటాలో శోభారెడ్డి, శ్వేతముఖేశ్‌ పేర్లు ఖరారు కాగా, చివరి నిమిషంలో శ్రీనివాస్‌గౌడ్‌ స్థానంలో గండి నర్సయ్యకు చోటు కల్పించినట్లు సమాచారం..

Updated Date - 2020-08-12T16:27:21+05:30 IST