95 కంపెనీలు.. రూ.75,000 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-03-16T08:12:57+05:30 IST

దేశీయంగా వాహనాలు, వాటి విడిభాగాల తయారీకి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకానికి ఇండస్ట్రీ..

95  కంపెనీలు.. రూ.75,000 కోట్ల పెట్టుబడులు

ఆటో రంగ పీఎల్‌ఐ 

పథకానికి భారీ స్పందన

ప్రోత్సాహకాలందుకోనున్న సంస్థల జాబితాలో

మారుతి, హీరో మోటోకార్ప్‌, టీవీఎస్‌, టాటా 


న్యూఢిల్లీ: దేశీయంగా వాహనాలు, వాటి విడిభాగాల తయారీకి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకానికి ఇండస్ట్రీ వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ ఏడాది జనవరి 9 నాటికి 115 కంపెనీలు ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాగా, ప్రభుత్వం 95 కంపెనీలకు ప్రోత్సాహకాలిచ్చేందుకు అంగీకరించింది. ఈ 95 కంపెనీలు దేశీయంగా తయారీ కోసం వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.74,850 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ పథకం ద్వారా వాహన రంగంలో కొత్తగా రూ.42,500 కోట్ల పెట్టుబడులు రావచ్చన్న ప్రభుత్వ అంచనా కంటే చాలా అధికమని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. వాహన రంగ పీఎల్‌ఐ పథకంలో భాగంగా ప్రోత్సాహకాలు అందుకోనున్న కంపెనీల జాబితాలో మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్‌, లూకా్‌స-టీవీఎస్‌, టాటా కుమిన్స్‌, టయోటా కిర్లోస్కర్‌ ఆటో పార్ట్స్‌ తదితర కంపెనీలున్నాయి. 

ఆటోమోటివ్‌ పీఎల్‌ఐ పథకంలో రెండు భాగాలున్నాయి. ఒకటి కాంపొనెంట్‌ చాంపియన్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌. మరొకటి చాంపియన్‌ ఓఈఎం ఇన్సెంటివ్‌ స్కీమ్‌. భారీ పరిశ్రమల శాఖ చాంపియన్‌ ఓఈఎం ఇన్సెంటివ్‌ స్కీమ్‌ కింది ఇప్పటికే 20 కంపెనీలకు ప్రోత్సాహకాలిచ్చేందుకు అంగీకరించింది. ఈ ఇరవై కంపెనీలు ఐదేళ్లలో రూ.45,016 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించాయి. కాగా, కాంపొనెంట్‌ చాంపియన్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ కింద తాజాగా మరో 75 కంపెనీలకు ప్రోత్సాహకాలిచ్చేందుకు మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది. ఈ కంపెనీలు రూ.29,834 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించాయి. ఈ 75 కంపెనీల్లో నాన్‌-ఆటోమొబైల్‌ రంగానికి చెందిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌), సియట్‌ లిమిటెడ్‌ కూడా ఉన్నాయి. 


 10 కొత్త ‘ఈవీ’ల అభివృద్ధి 

యోచనలో టాటా మోటార్స్‌  

విద్యుత్‌ వాహనాల (ఈవీ) విభాగంలో వచ్చే ఐదేళ్లలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు దేశీయ వాహన దిగ్గజం టాటా మోటా ర్స్‌ వెల్లడించింది. అంతేకాదు, 10 కొత్త ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ను అభివృద్ధి చేయనున్నట్లు టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహనాల వ్యాపార ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు. టాటా మోటార్స్‌ తన ఈవీ వ్యాపారం కోసం ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ టీపీజీ నుంచి ఈ మధ్యనే 100 కోట్ల డాలర్లు (రూ.7,500 కోట్లు) సమీకరించింది.

Updated Date - 2022-03-16T08:12:57+05:30 IST