తప్పని వర్రీ!

ABN , First Publish Date - 2022-03-08T03:52:48+05:30 IST

ఈ ఇద్దరి మధ్య నెలకొన్న కోల్డ్‌వార్‌ అన్నదాతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం గింజ కూడా కొనుగోలు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం కొనుగోలు కేంద్రాలకు ట్రక్‌ షీట్లు రాకపోవడమే.

తప్పని వర్రీ!
జలదంకి : కొనుగోళ్లు లేక పొలాల్లోనే ఉన్న ధాన్యపు రాసులు

 రూ.116 కోట్ల సీఎంఆర్‌ బకాయిలు

అవన్నీ ఇవ్వాలంటున్న మిల్లర్లు 

రూ.200 కోట్లకు బీజీ ఇవ్వండి : అధికారులు

అనుమతి లేకుండా ధాన్యం సేకరిస్తే చర్యలు

ఫలించని చర్చలు.. ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌!

అన్నదాతపై తీవ్ర ప్రభావం


నాలుగేళ్లుగా సీఎంఆర్‌ బకాయిలు చెల్లించండి. అదివీలుకాకపోతే కనీసం ఆ అప్పును బ్యాంకు గ్యారెంటీగా (బీజీ) అయినా మార్చండి.

- మిల్లర్ల వాదన


అబ్బే.. అదేం కుదరదు. ధాన్యం కొనుగోలు చేయాలంటే రూ.200 కోట్లు కట్టి తీరాల్సిందే.  బీజీలు చెల్లించకుండా ధాన్యం కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ ఉంచితే సదరు మిల్లులను సీజ్‌ చేస్తామని

- ఇది అధికారుల హెచ్చరిక


జలదంకి, మార్చి 7 : ఈ ఇద్దరి మధ్య నెలకొన్న కోల్డ్‌వార్‌ అన్నదాతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం గింజ కూడా కొనుగోలు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం కొనుగోలు కేంద్రాలకు ట్రక్‌ షీట్లు రాకపోవడమే. దీనిపై ఆరా తీసిన రైతులకు రైస్‌మిల్లర్లు, సివిల్‌ సప్లయీస్‌ అధికారుల మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్‌ బహిర్గతమైంది. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ (బీజీ) ఇవ్వాలి. ఆ తరువాత ప్రభుత్వం తరలించిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మార్చి ప్రభుత్వ గోదాములకు తరలించాలి. అలా తరలించిన బియ్యానికి ప్రభుత్వం మిల్లింగ్‌ చార్జీలు మిల్లర్లకు చెల్లించాలి. ఈ విధంగా నాలుగేళ్లుగా రూ.116 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది.  ఈ ఏడాది ధాన్యం కొనుగోలు చేసేందుకు ట్రక్‌ షీట్లు, గోనె సంచులు రావాలంటే ముందుగా మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించి రూ.200 కోట్లు బీజీలు ఇవ్వాలని అధికారులు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన బకాయి చెల్లిస్తే బీజీలు ఇస్తామని, లేకుంటే ఆ నిధులనే బీజీలుగా మార్చాలని తెగేసి చెబుతున్నారు. దీంతో ట్రక్‌ షీట్లు రిలీజ్‌గాక, గోనె సంచులు అందక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం గింజ కొనేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే, బ్యాంకు గ్యారెంటీలు చెల్లించకుండా అనధికారికంగా ధాన్యం కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ ఉంచితే సదరు మిల్లులను సీజ్‌ చేస్తామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

 ఫలించని చర్చలు

బ్యాంక్‌ గ్యారెంటీల విషయమై ఇటీవల నెల్లూరులో మిల్లర్ల అసోసియేషన్‌ నాయకులతో అధికారులు జరిపిన చర్చలు ఫలించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో తాము పండించిన పంట విక్రయించుకునేందుకు వీలుగాక కొందరు రైతులు దళారులు చెప్పిన ధరకే విక్రయించి నష్టపోతున్నారు. ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పండిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోదాములు లేక వచ్చిన ధరకు అమ్ముకునేందుకు రైతులు సమాత్తమవుతున్నారు.


మిల్లర్లకు అధికారుల హుకం

ఇదిలా ఉండగా పలువురు రైతులు మిల్లు యజమానితో మాట్లాడుకుని అనామత్తుగా మిల్లుకు ధాన్యం తోలి ఆ తరువాత ట్రక్‌ షీట్లు డౌన్‌లోడ్‌ అయినపుడు సీఎంఆర్‌ కింద రాయించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఈ విషయమై ముందుగానే మిల్లర్లకు సివిల్‌ సప్లయీస్‌ అధికారులు ట్రక్‌ షీట్లు లేకుండా మిల్లులో ధాన్యం దిగితే ఆ సరుకంతా బీ రిజిష్టర్‌లో (ప్రైవేటు కొనుగోళ్లు) కింద నమోదు చేయాలని హుకం జారీ చేశారు. అలా కాకుండా ఎ రిజిష్టర్‌ (సీఎంఆర్‌ కొనుగోళ్లు) కింద నమోదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బీ రిజిష్టర్‌లో నమోదైన ధాన్యానికి వ్యవసాయ మార్కెటింగ్‌(ఏఎంసీ) కి ఒక్క శాతం రుసుము చెలించాల్సి ఉంటుంది. అలా లక్ష రూపాయల సరుకుకు వెయ్యి రూపాయల వంతున మిల్లర్లు ఏఎంసీకి చెల్లించాలి. అదే సీఎంఆర్‌ కింద అయితే ఏఎంసీకి చెస్‌ చెల్లించాల్సిన పనిలేదు. దీంతో మిల్లర్లు అనామత్తుగా ధాన్యం మిల్లులో దించుకోవాలంటే భయపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మొత్తానికి రైతన్నకే  నష్టం వచ్చే విధంగా ఈ నిబంధనలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం విక్రయాల సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు, రైతుసంఘాల నేతలు కోరుతున్నారు.

 

మళ్లీ పుట్టి ముంచుతుందా!?

అన్నదాతకు దక్కని గిట్టుబాటు ధర

కొనుగోలు కేంద్రాల్లో ఓపెన్‌ కాని లాగిన్లు

ఈ-క్రాప్‌ నమోదుగాక రైతాంగం వెతలు


బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 7 : ఆరుగాలం రేయనక.. పగలనక కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక అన్నదాతలు వెంపర్లాతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వ్యవసాయాధికారులు రైతుల పేర్లు నమోదు చేసి సొసైటీల ద్వారా ట్రక్‌షీట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియకు లాగిన్లు ఓపెన్‌ కాలేదు.  పేరుకు ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.16,960, బీ గ్రేడ్‌ రకం రూ.16,940 గిట్టుబాటు ధర కల్పించామని అధికారులు చెబుతున్నా నిబంధనల కొర్రీతో అమలు కావడం లేదు. ఇదే అదనుగా మిల్లర్లు, దళారులు మిలాఖత్‌తో ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని పుట్టి రూ.13వేలకే ఎగరేసుకుపోతుండగా.. షుగర్‌లె్‌సలు మాత్రం రూ.15,500 నుంచి రూ.16వేలకు కొని తెలంగాణకు ఎగుమతి చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. 


ఓపెన్‌ కాని లాగిన్లు

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లకు నేటికీ లాగిన్లు ఓపెన్‌ కాలేదు. వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టుకున్న రైతాంగం దిక్కుతోచక మిల్లర్లు, దళారులనే ఆశ్రయిస్తున్నారు. వ్యవసాయాధికారులు పంటలకు ఈ-క్రాప్‌ నమోదు చేసి, పీపీసీ సెంటర్ల ద్వారా రైతులకు టోకెన్లు (ట్రక్కు షీట్‌) ఇప్పించాల్సి ఉంది. అయితే ఇంత వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లాగిన్‌  ఓపెన్‌ కాకపోవడం.. మరోవైపు వరికోతలు 20శాతం మేర పూర్తికావస్తున్నా ఈ-క్రాప్‌ 20 నుంచి 30శాతం మేర నమోదు కావడం విశేషం. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో  10వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. మరో వెయ్యి ఎకరాల్లో వరద పోటెత్తడంతో పొలాల్లో ఇసుక మేటలు, ప్రవాహానికి తెగిపోయిన కాలువల వల్ల నేటికీ పంటలు వేసుకోలేక బీడును తలపిస్తున్నాయి.


 జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు 

జిల్లావ్యాప్తంగా మొత్తం 5.50 లక్షల ఎకరాల్లో అన్నదాతలు వరి వేశారు. జిల్లాలో గత 10రోజుల నుంచి వరి కోతలు సాగుతుండగా.. బుచ్చి మండలంలో వారం నుంచి జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సుమారు లక్షా యాభైవేల ఎకరాల్లోవరికోతలు కోసినా వ్యవసాయాధికారులు ఇప్పటి వరకు లక్షా 20వేల ఎకరాల్లో ఈ-క్రాప్‌ చేసినట్లు చెబుతున్నారు. ఈక్రాప్‌ పూర్తయితేనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాల్సి ఉంది.

 

కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి! 

రైతుల పరిస్థితి కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవిగా  మారింది. పంట వేసినప్పటి నుంచి ఎరువులు, పురుగు మందుల ధరలు అమాంతం పెరిగాయి. తీరా పంట చేతికొచ్చినప్పటి నుంచి ఽధాన్యం ధరలు తగ్గాయి. ఎరువుల కొరతతో ఈసారి పిండి కట్టలు బ్లాక్‌లో కొనుక్కోవాల్సి వచ్చింది. పండించిన పంట చేతికొచ్చేసరికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. కానీ లాగిన్లు ఓపెన్‌ కాలేదంటూ నేటికీ గింజకొన్న పాపాన పోలేదు. కోసిన ధాన్యం రోడ్డు మీద పోసుకుని ఇబ్బందులు పడలేక మిల్లర్లను, దళారులను ఆశ్రయించి రూ.3వేలు నష్టం వచ్చినా రూ.13వేలకే అమ్ముకోక తప్పడం లేదు.

- చందల మనోజ్‌కుమార్‌, బుచ్చిరెడ్డిపాళెం  



Updated Date - 2022-03-08T03:52:48+05:30 IST