గతమే నయం!

ABN , First Publish Date - 2022-08-12T06:30:48+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అభివృద్ధి పనులు అటకెక్కిన విషయం తెలిసిందే.

గతమే నయం!

సీఎండీఎఫ్‌ నిధులపై ఎమ్మెల్యేల అసహనం

రెండేళ్ల తర్వాత నియోజకవర్గానికి రూ.2 కోట్లు

పనుల మంజూరు అధికారం కలెక్టర్లకు

టెండర్ల పద్ధతిలో అప్పగింత

నిబంధనల పట్ల ఎమ్మెల్యేల్లో అసంతృప్తి

టీడీపీ హయాంలోనే మేలనే అభిప్రాయం


రెండేళ్ల తరువాత ఎట్టకేలకు నియోజకవర్గానికి రూ.2 కోట్లు చొప్పున ముఖ్యమంత్రి డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (సీఎండీఎఫ్‌) ఇచ్చారన్న సంతోషం ఎమ్మెల్యేల్లో మచ్చుకు కూడా కనిపించడం లేదు. సీఎండీఎఫ్‌పై పెత్తనం కలెక్టర్లకు ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికితోడు నామినేటెడ్‌ పద్ధతిపై పనుల కేటాయింపు విధానాన్ని రద్దు చేసి ప్రతి పనిని టెండర్ల ద్వారానే కేటాయించాలన్న నిబంధన పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 


నెల్లూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అభివృద్ధి పనులు అటకెక్కిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఖజానా మొత్తం సంక్షేమ పథకాలకే సరిపోతుండటంతో అభివృద్ధి పనులకు బ్రేకులు పడ్డాయి. చిన్న పనులు కూడా చేయించలేని స్థితిలో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఈ ప్రభావం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. పలుచోట్ల సమస్యలపై ప్రజలు వారిని నిలదీశారు. ఈ క్రమంలో ప్రజాగ్రహాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం నియోజకర్గానికి రెండు కోట్లు చొప్పున సీఎండీఎఫ్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి. ఈ నిధుల విడుదలతో ఎమ్మెల్యేలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ నిధులతో నియోజకవర్గ పరిధిలో చిన్నా చితక పనులు చేసిపెట్టవచ్చని, తమ అనుచరులకు ఆ పనులు అప్పగించి వారి మెప్పు పొందవచ్చని వారు ఆశించారు. 


గతంలో ఇలా..

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఎండీఎఫ్‌ నిధులను పెద్ద మొత్తంలో నియోజకవర్గాలకు కేటాయించారు. ఈ నిధులపై పెత్తనం మొత్తం ఎమ్మెల్యేలకే ఇచ్చారు. ఈ నిధుల కింద చేయాల్సిన పనులను ఎమ్మెల్యేలు ప్రతిపాదించేవారు. ఆ ప్రతిపాదన ఆధారంగా కలెక్టర్‌ పనులు మంజూరు చేసేవారు. అంతే కాదు.. ఈ పనులను నామినేటెడ్‌ పద్ధతిపై ఎమ్మెల్యే సూచించిన వారికే కాంట్రాక్టు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతి అనుసరిస్తుందని భావించారు. 


ఇప్పుడు ఎన్ని తిప్పలో..

అయితే ఇప్పుడు పద్ధతి మారిపోయింది. పనుల జాబితాను ఎమ్మెల్యేలు ఇన్‌చార్జి మంత్రి ముందు ఉంచాలి. ఇన్‌చార్జి మంత్రి కలెక్టర్‌కు సిఫారసు చేయాలి. తమ నియోజకవర్గాలకు కేటాయించిన రెండు కోట్ల నిధులకు సంబంధించిన పనులకు ఇంత తిప్పట అవసరమా అని ఎమ్మెల్యేలు లోలోన మదనపడుతున్నారు. అంతేకాదు.. గతంలో సీఎండీఎఫ్‌ ద్వారా చేపట్టే పనులను ఎమ్మెల్యే సూచించిన వారికి నామినేటెడ్‌ పద్ధతిపై కాంట్రాక్టు ఇచ్చేవారు. అందుకు అనువుగా ఒక్కో పనిని లక్ష రూపాయలకు మించకుండా విభజించి తమ అనుచరులకు కేటాయించేవారు. ఇప్పుడు అదంతా లేదు. ప్రతి పనికి టెండరు పిలవాలనే నిబంధన విధించడంతో ఎమ్మెల్యేలను తీవ్రంగా బాధిస్తున్నట్లు తెలిసింది. తాము సూచించిన వారికి నామినేటెడ్‌ పద్ధతిపై పనులు కేటాయిస్తే కాంట్రాక్టరుపై ఒత్తిడి చేసి పనులు చేయించుకునే అవకాశం ఉంటుందని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలిసింది. రెండేళ్ల తరువాత వచ్చిన రూ. 2కోట్లతో ఏవో నాలుగు మంచి పనులు చేసి, నలుగురు అనుచరులకు మేలు చేసే అవకాశం దొరుకుతుందని ఆశిస్తే ఇలా జరిగిందేమిటి మహాప్రభో! అని ఎమ్మెల్యేలు లోలోన మదనపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2022-08-12T06:30:48+05:30 IST