సెంటు భూమిలో నివాసమెలా?

ABN , First Publish Date - 2020-11-14T06:02:53+05:30 IST

నివాసయోగ్యమైన ప్రదేశాలలోనే కనీసం మూడు సెంట్ల నివేశన స్థలం ఇస్తే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. సెంటు భూమి ఇచ్చి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు ప్రజలను మభ్య పెట్టడం రాజకీయ లబ్ధి పొందడానికే కాదా? పేదలకు కేటాయించిన....

సెంటు భూమిలో నివాసమెలా?

నివాసయోగ్యమైన ప్రదేశాలలోనే కనీసం మూడు సెంట్ల నివేశన స్థలం ఇస్తే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. సెంటు భూమి ఇచ్చి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు ప్రజలను మభ్య పెట్టడం రాజకీయ లబ్ధి పొందడానికే కాదా? పేదలకు కేటాయించిన స్థలాలను ఐదేళ్లలో పేర్లు మార్చుకొని అమ్ముకోవచ్చని ప్రభుత్వం జీఓ విడుదల చెయ్యడం పూర్తి బాధ్యతా రాహిత్యం. అసలు పేదలు తలదాచుకోవడానికి స్థలాలు ఇస్తున్నారా? లేక ఓట్లు దండుకోవడానికి ఇస్తున్నారా?


పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తానని, అవినీతిని సమూలంగా ప్రక్షాళన చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. మరి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఇళ్లస్థలాల పేరుతో జరుగుతున్న భూ కుంభకోణాలకు ఏం సమాధానం చెబుతారు? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం అవసరమైన భూములు సేకరించడంలో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను ప్రశ్నించకుండా ఎలా ఉండగలం? పేదలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధిపొందాలన్న ఆరాటం తప్ప, ప్రజలకు మెరుగైన, నివాసయోగ్యమైన స్థలాలు ఇచ్చి మేలు చేయాలన్న ఆలోచన ఇళ్ల స్థలాల పంపిణీలో కనపడటం లేదు. పేదలు ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను దౌర్జన్యంగా గుంజుకొని ఇళ్లస్థలాలు ఇస్తున్నారు. ఒక పేద వాడి నోటికాడ భూమి గుంజుకొని మరొక పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏ రకమైన సంక్షేమం? దళితుల, బడుగుల భూములు గుంజుకొని వారి జీవనాధారాన్ని దెబ్బతీయడం దారుణం.


తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద సకల సౌకర్యాలతో నిర్మించిన నాలుగు లక్షల ఇళ్లను ఎందుకు ఇవ్వడం లేదు? గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన స్థలాలనే జగన్ ప్రభుత్వం గుంజుకొని పేదలకు ఇవ్వడం మోసం కాదా? ప్రజలు కోరుకొన్న ప్రాంతాలలో ఇళ్ల స్థలాల ఇస్తామని ఆశ చూపి పట్టణాలకు దూరంగా జనావాసాలు లేనిచోట రోడ్డు మార్గం కాదుకదా కాలిబాటకూడా లేనిచోట కొండలు, శ్మశానాలు పక్కన, లోతట్టు ముంపు ప్రాంతాల్లో మడ అడవుల పక్కన నివాసయోగ్యం కానీ చోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు! అది కూడా సెంటు (48 గజాలు) మాత్రమే. సెంటు భూమిలో నివాసం సాధ్యమేనా? 


అమరావతి ఎడారి అని, స్మశానం అని, ముంపునకు గురవుతుందని దుష్ప్రచారం చేసి చివరకు అదే ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించడానికి జగన్ ప్రభుత్వం పూనుకొన్నది. రైతులు రాజధానికోసం భూములు ఇస్తే ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాలకు ఇచ్చుకొంటే అభ్యంతరం లేదని అలా కాకుండా సీఆర్‌డిఏ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొన్న భూములు ఇళ్ల స్థలాలకు కేటాయించాలనుకోవడం చట్ట విరుద్ధమని హైకోర్టు ఘాటుగా అక్షింతలు వేసింది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులే చేపట్టకుండా ఆ పేరుతో భూములను ఇళ్ల స్థలాలకు ఎలా వినియోగిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతుల నుంచి అధికార పార్టీ నాయకులు వందల కోట్లు కమీషన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అవే కాకుండా ఇళ్ల స్థలాలు ఇస్తామని పేదల నుంచి కూడా పెద్ద ఎత్తున వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా పేదలకు ఇళ్ల స్థలాల పథకం మాటున అధికార పార్టీ నేతల ఖాతాల్లోకి వెల్లువెత్తిన కమీషన్ల విలువ వేల కోట్లలోనే వున్నట్లు సమాచారం. 


ఇళ్ల స్థలాల పేరుతో ఏళ్ల నుంచి దళితులు సాగుచేసుకొంటున్న అసైన్డ్ భూములు గుంజుకొని ప్రభుత్వం వారిపై కాలకూట విషాన్ని చిమ్మింది. తమ జీవనాధారమైన భూములు గుంజుకోవడంతో పలువురు పేద రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తన 2 ఎకరాల డి ఫారం బలవంతపు భూసేకరణ వల్ల తూ.గో. జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బాలరాజు మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో తన రెండున్నర ఎకరాల భూమిని అధికారులు, అధికార పార్టీ నాయకులు స్వాధీనం చేసుకుని రాత్రికి రాత్రి లేఅవుట్లు వేయడంతో మదన్ మోహన్, భూలక్ష్మి దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నివాసయోగ్యమైన ప్రదేశాలలోనే కనీసం మూడు సెంట్ల నివేశన స్థలం ఇస్తే కొంత ప్రయోజన కరంగా ఉంటుంది. సెంటు భూమి ఇచ్చి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు ప్రజలను మభ్య పెట్టడం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప, దాని వల్ల పేదలకు ఒనగూరే ప్రయోజనం శూన్యం.


సెంటు భూమిలో వైకాపా నాయకులు నివాసం ఉండగలరా? పేదలకు కేటాయించిన స్థలాలను ఐదేళ్లలో పేర్లు మార్చుకొని అమ్ముకోవచ్చని ప్రభుత్వం జీఓ విడుదల చెయ్యడం బాధ్యతా రాహిత్యం. పేదలు తలదాచుకోవడానికి స్థలాలు ఇస్తున్నారా? లేక స్థలాల పేరుతో పట్టాలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు దండు కోవడానికి స్థలాలు ఇస్తున్నారా? పట్టణాల్లోని విలువైన స్థలాలను ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రభుత్వం కారు చౌకగా అమ్మేస్తూ పట్టణాల్లోని పేదలను మాత్రం దూరంగా తరిమేస్తుంది. ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావుడి అంతా ప్రజాధనం దోచుకోవడానికి తప్ప ప్రజలకు మేలు చెయ్యడానికి మాత్రం కాదు. ఏది ఏమైనా జనాన్ని బురిడీ కొట్టించడానికి జగన్ పన్నిన ఇళ్ల స్థలాల పద్మవ్యూహాన్ని జనమే బదా బదలు చెయ్యాలి. 


-కె.ఎస్‌.జవహర్ (మాజీ మంత్రి)

Updated Date - 2020-11-14T06:02:53+05:30 IST