జలవివాదాలపై జగన్ సీరియస్.. కేంద్ర మంత్రికి లేఖ

ABN , First Publish Date - 2020-08-12T02:05:32+05:30 IST

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు.

జలవివాదాలపై జగన్ సీరియస్.. కేంద్ర మంత్రికి లేఖ

అమరావతి : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు జగన్ లేఖ రాశారు. ఈ నెల 7న షెకావత్ రాసిన లేఖకు జగన్ రిప్లయ్ ఇచ్చారు. మొత్తం 5 పేజీలతో కూడిన లేఖను జగన్ రాశారు. ఈ లేఖలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన విషయాలతో పాటు పలు అంశాలను ఏపీ ప్రభుత్వం పొందుపరిచింది. తాను ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యానని.. అంగీకారం కూడా తెలిపిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా పాయింట్స్‌తో ఆగస్టు-04న లేఖ కూడా పంపిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. 


ఇవేమీ కొత్తవి కావు..!

మా రాష్ట్రం నుంచి ఎటువంటి స్పందన లేదని మీరు పేర్కొనటం చూస్తే లేఖ అధికారులు ఈ అంశం మీ దృష్టికి తీసుకురాలేదు. మీరు లేఖలో పేర్కొన్నట్టుగా కృష్ణానదిపై ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ కొత్తవి కావు. ఇవన్నీ 2015 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినవే. రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం అనుబంధ ప్రాజెక్ట్ మాత్రమే. ప్రస్తుతం ఉన్న కాల్వల ద్వారానే, అదనపు ఆయకట్టు ఈ పథకం కింద ఉండదు. తమకు కేటాయించిన నీటిలోనే మేము రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీటిని వినియోగించుకుంటాము. కొత్త ప్రాజెక్ట్స్‌కు మాత్రమే నదీ యాజమాన్య బోర్డ్‌ల వద్ద అనుమతి తీసుకోవాలని విభజన చట్టంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్ట్ లో మేము పిటిషన్ కూడా దాఖలు చేశాం. ఈ విషయమై సుప్రీంకోర్ట్ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని 2016లోనే సూచించింది. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ నిర్మిస్తున్న ఈ పథకాలపై ఎపెక్స్ కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. దీని వల్ల మేము మరలా ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్‌ కౌన్సిల్‌ తెలంగాణను ఆదేశించలేదు. రెండో ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించాం. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరగకుండా ఆగిపోయిందిఅని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో జగన్ రాసుకొచ్చారు.


కేసీఆర్ తీవ్ర ఆగ్రహం..

కాగా.. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థ వంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు.  ఇటు ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.











Updated Date - 2020-08-12T02:05:32+05:30 IST