ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన : సీఎం జగన్

ABN , First Publish Date - 2020-08-15T16:44:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన సాగిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన : సీఎం జగన్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన సాగిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ శకటాలను సీఎం వీక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.


కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు రూ. 59వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించామని జగన్ చెప్పుకొచ్చారు. చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడ పురుగు పడితే ఎండిపోతుందని.. ‘అవినీతి’ అనేది చీడ పురుగు అని సీఎం వ్యాఖ్యానించారు. అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయన్నారు. ఈ నిజాన్ని గమనించబట్టే  రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా రూ. 4వేల కోట్లకు పైగా ఆదా చేశామన్నారు. చదువే నిజమైన ఆస్తి, సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చినట్లు జగన్ తెలిపారు.


శాశ్వతంగా పరిష్కరించే దిశగా.. 

ప్రతి పౌరుడు దేశ భక్తి పెంచుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. సామాజిక ఆర్థిక భరోసాను రాజ్యాంగం కల్పించింది. ప్రజల కనీస అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా, చేయూత, అమ్మ ఒడి, ఆసరా పథకాలు తీసుకొచ్చాం. పేదల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా అడుగులేస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరింత అభివృద్ధి చెందాలి. నామినెటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు కేటాయించాం. సమానత్వం అనే పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదు. రైతు భరోసా ద్వారా రైతులకు ఆర్థికసాయం చేస్తున్నాం. కులం, మతం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వైద్య రంగంలోకి విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న అందరికీ ఆరోగ్య శ్రీ వర్తింపజేశాం. నిత్యావసర వస్తువులు సెప్టెంబర్ నుంచి రోడ్ డెలివరీ చేస్తాం. 2022 ఖరీష్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం. రాష్ట్ర నీటి ప్రయోజనాల విషయంలో రాజీపడం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు కరవు నివారణ పథకం, రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టులు త్వరలో ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం 6 ప్రాధాన్య ప్రాజెక్టులు వంశధార ఫేస్-02, వంశధార, నాగావళి అనుసంధానం చేస్తాం. వెలుగొండ ఫేస్-1,అవుకు టన్నెల్-02, సంగం బ్యారేజ్, నెల్లూరు బారేజ్‌లను త్వరలోనే పూర్తి చేస్తాంఅని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-08-15T16:44:40+05:30 IST