సార్‌..పట్టించుకోండి..!

ABN , First Publish Date - 2020-07-07T10:57:00+05:30 IST

ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన తర్వాత సమీక్షలకే పరిమితమైంది. డిసెంబర్‌లో శంకుస్థాపన చేసిన సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇస్తేనే కరువు నేల

సార్‌..పట్టించుకోండి..!

కడపలో భూగర్భ మురుగు కాలువ కలేనా..?

ఉన్నఫళంగా ఎక్కడికెళ్లాలి..? గండికోట పునరావాస బాధితుల ఆవేదన

ఆర్డీపీపీ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులర్‌ హామీ అమలు చేయాలి

బహ్మంసాగర్‌ లీకేజీ మరమ్మతులు ఎప్పుడో

ప్రొద్దుటూరు టెక్స్‌టైల్స్‌ నిర్మాణం జరిగేనా..?

కడప ఉక్కు పరిశ్రమ పనులకు శ్రీకారం చుట్టాలి

నేడు జిల్లాకు సీఎం వైఎస్‌ జగన్‌


(కడప-ఆంధ్రజ్యోతి): ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన తర్వాత సమీక్షలకే పరిమితమైంది. డిసెంబర్‌లో శంకుస్థాపన చేసిన సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇస్తేనే కరువు నేల సస్యశామలం అవుతుంది. కడప నగరంలో భూగర్భ డైనేజీ కలగానే ఉంది.  చేనేతల చిరకాల స్వప్నమైన టైక్స్‌టైల్‌ పార్క్‌ ప్రకటనతో సరి. సీమకే తలమానికమైన రాయలసీమ ఽథర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో పనిచేసే కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ చేస్తానన్న హామీ అమలు కాలేదు. ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయవద్దని కార్మికులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు జిల్లాకు రానున్నారు. సీఏంగా బాధ్యతలు చేట్టాక జిల్లాలో నాలుగో పర్యటన. తమ గోడు పట్టించుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.


ఉన్నఫలంగా ఎక్కడికెళ్లాలి..?

గండికోట జలాశయంలో ఈ ఏడాది 27 టీఎంసీలు నిల్వ చేయాలనే లక్ష్యం మంచిదే. కొండాపురంలో 3,066 కుటుంబాలకు రూ.145.96 కోట్లు, తాళ్ల ప్రొద్దుటూరు, ఎర్రగుడి, చామలూరు, పి.అనంతపురం, ఏటూరు (కొంత భాగం), రేగడిపల్లి, కె.సుగుమంచిపల్లి గ్రామాల్లో 5,647 కుటుంబాలకు రూ.522.85 కోట్లు కలిపి.. రూ.668.81 కోట్లు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ నిఽధులు మంజూరు చేశారు. ప్రస్తుతం గండికోటలో 4.30 టీఎంసీల నిల్వ ఉంది. ఆగస్టులో కృష్ణా జలాలు మళ్లించే అవకాశం ఉంది. ‘చెక్కులు తీసుకోండి.. ఇళ్లు ఖాళీ చేయండని అధికారులు ఓ పక్క చెక్కులు ఇస్తూ మరో పక్క ఇళ్లు కూలుస్తున్నారు. ఉన్నఫలంగా పొమ్మంటే ఎక్కడికెళ్లాలి..? పునరావాస కాలనీల్లో ప్లాట్లే వేయలేదు.. కనీస సౌకర్యాలు లేవు. వచ్చే ఏడాది వరకైనా మాకు అవకాశం ఇవ్వండి. వెలిగొండ ప్రాజెక్టు తరహాలో పునరావాస ప్యాకేజీ రూ.12.50 లక్షలు ఇవ్వండి’ అంటూ గండికోట ముంపు గ్రామస్తులు విన్నవిస్తున్నారు. అలాగే.. ఇప్పటికే ఖాళీ చేసిన 14 గ్రామాలకు చెందిన 9,096 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6.75 లక్షలు చెల్లించారు. బ్యాలెన్స్‌రూ.3.25 లక్షల ప్రకారం రూ.364.13 కోట్లు ఎప్పుడిస్తారని అడుగుతున్నారు.


సమీక్షల్లోనే ఉక్కు పరిశ్రమ

రాయలసీమ ప్రజల స్వప్నం ‘కడప ఉక్కు పరిశ్రమ’. జమ్మలమడుగు మండలం పరిధిలోని సున్నపురాళ్లపల్లి, పెద్ద నందలూరు గ్రామాల మధ్య ఏపీ హై గ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌కు 2019 డిసెంబర్‌ 23న సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. రెండేళ్లు లక్ష్యంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. గతనెల తాడేపల్లి క్యాంప్‌ ఆఫీ్‌సలో పరిశ్రమ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలసి అధికారులతో సమీక్ష చేశారు. పరిశ్రమ టౌన్‌షి్‌ప, మౌలిక వసతులు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. పరిశ్రమ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని  సీఎం అధికారులను ఆదేశించారు. కాగా.. రోడ్లు, ప్రహరీ గోడ, విద్యుత్‌ సరఫరా నిర్మాణాలు, ఆర్టీపీపీ నుంచి విద్యుత్‌ లైన్‌ నిర్మాణాలు, నీటి సరఫరా వంటి పనులకు బడ్జెట్లో నిధుల కేటాయింపు ఆశాజనకంగా లేదు. ఈ స్టీల్‌ పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించి రెండేళ్ల లోగా ఉత్పత్తి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. కరువు సీమ యువతకు ఉపాధి కల్పించాలి.


పాదయాత్ర ‘తొలి హామీ’ అమలు ఎప్పుడు..?

2017 నవంబర్‌ 9న ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన సభలో ఆర్టీపీపీలో పని చేసే కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులను విద్యార్హతను బట్టి రెగ్యులర్‌ చేస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన తొలిహామీ ఇది. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది దాటినా ఆ హామీ అమలుకు ఒక్క అడుగుకూడా పడలేదు. సీమకే తలమానికమైన ఆర్టీపీపీలో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు 3,200 మంది పనిచేస్తున్నారు. పరోక్షంగా వివిధ రంగాల్లో మరో 20 వేల మంది ఉపాధి పొందుతున్నారు. 20 రోజులుగా ఇక్కడ ఉత్పత్తి ఆపేశారు. రూ.225 కోట్ల విలువైన 4.62 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలు కాపాడుకోవడానికి నానాకష్టాలు పడుతున్నారు. మరో పక్క ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని తెలిసి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తమను రెగ్యులర్‌ చేసి తొలి హామీ అమలు చేయాలని ఆర్టీపీపీని కాపాడాలని కోరుతున్నారు.


నిధులు ఇస్తేనే కరువు నేల సస్యశామలం

బ్రహ్మంసాగర్‌ జలాశయం నీటి సామర్థ్యం 17 టీఎంసీలు. 2007లో తొలిసారిగా 208 మీటర్ల లెవల్‌లో 13 టీఎంసీలు నిల్వ చేయగా.. ఆనకట్ట నుంచి లీకేజీలు ఏర్పడ్డాయి. పలుమార్లు నిపుణుల కమిటీ పరిశీలించి మరమ్మతులకు పలు సూచనలు చేశారు. 13 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఫిబ్రవరి నెలలో నిపుణుల కమిటీ డ్యాంను పరిశీలించారు. లీకేజీ ప్రాంతంలో 100 మీటర్ల పొడవు, 50 మీటర్ల ఎత్తుతో ‘డయాఫ్రం వాల్‌’ నిర్మించాలని సూచించింది. సుమారుగా రూ.50 కోట్లు కావాలి. అసంపూర్తి కాలువల నిర్మాణం, నిర్వహణకు మరో రూ.40 కోట్లు కావాలి. అలాగే.. డిసెంబర్‌ 23న సీఎం శంకుస్థాపన చేసిన కుందూ-టీపీజీ లిఫ్ట్‌, రాజోలి, జొలదరాశి జలాశయాలు తదితర ప్రాజెక్టులపై సీఎం దృష్టి సారిస్తేనే జిల్లా సస్యశామలం అవుతుందని నిపుణులు అంటున్నారు. 


వీటిపై దృష్టి పెట్టాలి

  • గత ప్రభుత్వం రైతుల నుంచి 28వేల టన్నుల పప్పుశనగలను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసింది. ఇంకా రైతులకు రూ.15 కోట్లు చెల్లించాలి.
  • 2007లో అప్పటి సీఎం వైఎస్సార్‌ కడప నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రెండు ప్యాకేజీలు పూర్తి చేసినా.. అక్కడక్కడా అసంపూర్తిగానే ఉన్నాయి. మరో రెండు ప్యాకేజీలు మొదలే కాలేదు.
  • బుగ్గవంక ఆధునికీకరణ 2006లో చేపట్టారు. ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. రూ.12.14 కోట్లకు ఇటీవల నిర్వహించిన టెండర్లలో అధికార పార్టీ నాయకులు కుమ్మకై ఖజానాకు గండి కొట్టారు. 
  • ప్రొద్దుటూరులో చేనేతలకు ఉపాధి కోసం అపెరల్‌ పార్కుకు స్థలం సేకరించినా పనులు చేపట్టలేదు. మూతబడ్డ పాల కర్మాగారాన్ని పునరుద్ధరించాలి.
  • కడప - రేణిగుంట వయా రాజంపేట మీదుగా నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేయాలి. భూ సేకరణకు శ్రీకారం చుట్టారు. నిధులు కేటాయించి తక్షణం పనులు చేపట్టాలి.
  • రైల్వేకోడూరులో బైపాస్‌, ఆర్టీసీ బస్టాండు నిర్మించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు.
  • జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. పసుపు, అరటి తదితర పంటలు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి వీలుగా పులివెందుల, కడప, రాజంపేట ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు నిర్మించాలి.

Updated Date - 2020-07-07T10:57:00+05:30 IST