ముఖ్యమంత్రికి ఢిల్లీ నుంచి పిలుపు

ABN , First Publish Date - 2021-05-11T15:57:21+05:30 IST

రాష్ట్రంలో అదుపు తప్పిన కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ప్రతిపక్షాలు, ప్రజలనుంచి విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో కొత్త రాజకీయ ఎత్తుగడకు తెర లేసిందనిపిస్తోంది. ముఖ్య

ముఖ్యమంత్రికి ఢిల్లీ నుంచి పిలుపు


బెంగళూరు: రాష్ట్రంలో అదుపు తప్పిన కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ప్రతిపక్షాలు, ప్రజలనుంచి విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో కొత్త రాజకీయ ఎత్తుగడకు తెర లేసిందనిపిస్తోంది. ముఖ్యమంత్రి యడియూరప్పను ఢిల్లీకి రావాలని అధిష్ఠానం పెద్దలు ఆహ్వానించడం సర్వత్రా ఉత్కంఠకు కారణం అవుతోంది. రెండు రోజులుగా రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మై, సీఎం కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయేంద్రలు ఢిల్లీలో గడిపిన విషయం తెలిసిందే. వారు సోమవారం వెనుతిరిగి రాగా ఆ వెంటనే ఢిల్లీ పెద్దలు సీఎం యడియూరప్పను ఆహ్వానించారు. సాధ్యమైనంత త్వరలోనే ఢిల్లీ రావాలనే పిలుపు ఇవ్వడం, కారణం ఏంటనేది స్పష్టత లేకపోవడంతో రాజకీయ చర్చకు తెరలేసింది. కాగా సీఎం యడియూరప్పపై మూడు రోజుల వ్యవధిలోనే రెండు భారీ అవినీతి ఆరోపణలు సొంత పార్టీనుంచే తలెత్తాయి. లక్షలకోట్ల విలువైన వక్ఫ్‌ ఆస్తుల అవినీతిలో సీఎం, కాంగ్రెస్‌ నేతలతో చేతులు కలిపారని బీజేపీ మైనారిటీ నేత అన్వర్‌ మానప్పాడి ఆదివారం ఆరోపించారు. ఇక బళ్ళారి జిల్లాలో 3600 ఎకరాల భూ మిని జిందాల్‌ కంపెనీకి తక్కువధరకే ఇచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు 46మంది అభ్యంతరం తెల్పుతూ ప్రధాని, పార్టీ అగ్రనేతలకు లేఖ రాశారు. నాలుగైదు రోజులుగా మరోసారి నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చింది. పదే పదే డీసీఎం అశ్వత్థనారాయణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ సహా పలువురు నాయకత్వ మార్పు లేదని ప్రకటిస్తున్నారు. వీరు పదే పదే ఆ విషయా న్ని వ్యాఖ్యానించడం కూడా నిగూఢార్థం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మళ్లీ రాజకీయ చర్చలు జోరందు కున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన హోం మంత్రి బొమ్మై మీడియాతో మాట్లాడుతూ కరోనా నియంత్రణ గురించి సహా మరే అంశం చర్చకు రాలేదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలసి కరోనా పరిస్థితిని వివరించామన్నారు. ప్రస్తుత తరుణంలో రాజకీయ అంశం చర్చకు సమయం కాదన్నారు. 

Updated Date - 2021-05-11T15:57:21+05:30 IST