నేడు ముఖ్యమంత్రి రాక

ABN , First Publish Date - 2022-08-16T07:00:43+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖపట్నం రానున్నారు.

నేడు ముఖ్యమంత్రి రాక

అచ్యుతాపురం సెజ్‌లో టైర్ల ఫ్యాక్టరీని ప్రారంభించనున్న జగన్మోహన్‌రెడ్డి


విశాఖపట్నం, అనకాపల్లి, అచ్యుతాపురం రూరల్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖపట్నం రానున్నారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 10.20 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి హెలికాప్టర్‌లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో గల ‘సెజ్‌’కు వెళతారు. సెజ్‌లో యకహోమా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్ల ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చెందిన మెగా ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఆప్టిమస్‌ డ్రగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, విన్‌విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌ లిమిటెడ్‌, సైనాప్టిక్స్‌ ల్యాబ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, స్టైరాక్స్‌ లైఫ్‌ సైన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఇషా రిసోర్సెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటలకు అక్కడ నుంచి బయలులేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.10 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ నివాసానికి వెళతారు. ఇటీవల వివాహమైన ఎమ్మెల్యే కుమారుడు, కోడలిని ఆశీర్వదిస్తారు. 1.40 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి వెళతారు.


రహదారిపై ఇనుప బారికేడ్లు

సీఎం రాక నేపథ్యంలో మర్రిపాలెం ప్రాంతంలో ఏర్పాటు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాక నేపథ్యంలో మర్రిపాలెం ప్రాంతంలో బారికేడ్ల ఏర్పాటుకు అనుకూలంగా సోమవారం రాత్రి రహదారిపై ఇనుప స్తంభాలు పాతారు. సీఎం ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌ఎడీ ఫ్లైవోవర్‌ మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్డులో వాసుపల్లి ఇంటికి వెళతారు. తిరిగి అదే రోడ్డులో వెనక్కి వెళతారు. ఈ నేపథ్యంలో వాసుపల్లి ఇంటి సమీపంలో మార్జిన్‌ కొంత మేర విడిచిపెట్టి బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై ఐరన్‌ రాడ్లు పాతారు. వీటి ఆధారంగా బారికేడ్లు ఏర్పాటుచేయవచ్చునంటున్నారు. సాధారణంగా ప్రముఖులు వచ్చినప్పుడు ట్రాఫిక్‌ను కొద్దిసేపు నిలిపివేసే సంప్రదాయం ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా రహదారిపై ఇనుప రాడ్లు పాతడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. బహుశా మంగళవారం ఈ మార్గంలో తిరిగేవారికి తిప్పలు తప్పవని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 



Updated Date - 2022-08-16T07:00:43+05:30 IST