అతి.. మహా అతి!

ABN , First Publish Date - 2022-04-22T08:11:44+05:30 IST

అంతకుముందు గుంటూరు, ఆ తర్వాత విశాఖ... ఇప్పుడు ఒంగోలు నగర వాసుల వంతు! సీఎం పర్యటన కారణంగా నానా ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు మూడు రోజులుగా వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. పొదుపు మహిళలకు సున్నావడ్డీ..

అతి.. మహా అతి!

సీఎం టూరు పేరిట ప్రజలకు నరకం

ఒంగోలులో 3 రోజుల ముందే హల్‌చల్‌

సీఎం పర్యటనకు భారీ కూల్చివేతలతో క్లియరెన్స్‌

పూర్తిగా ఆంక్షల వలయంలోకి ఒంగోలు 

కాన్వాయ్‌ సాగే 4 కి.మీ. మేర ఇనుప బారికేడ్లు

రోడ్డు మార్జిన్లలోని ఇళ్లు, బంకుల తొలగింపు

తోపుడుబండ్ల చిరువ్యాపారులపై దౌర్జన్యం

ఒక రోజు ముందే దుకాణాల మూత

నేడు ఒంగోలుకు సీఎం జగన్‌

సున్నావడ్డీ నగదు విడుదల రాజు వెడలక ముందే..


రాజులు, రాజ్యాలు ఉన్న కాలం సంగతి! రాజు అంతఃపురం దాటి రహదారి మీదికి వస్తే... ‘రాజు వెడలె రవితేజములలరగ’ అంటూ అంతా హడావుడి! నగర పౌరులెవరూ ఆ దారిలో ఉండొద్దు! ఎవరూ ఆ దారిలో అడ్డు రావొద్దు! ఎటు చూసినా సైనికుల ముట్టడి... కట్టడి! 


ఇప్పుడు రాజ్యాలు లేవు. రాజులూ పోయారు. కానీ... ముఖ్యమంత్రి జగన్‌ ఆనాటి రాజరికపు రోజులను గుర్తుకు తెస్తున్నారు. 


ఆయన... తాడేపల్లి భవనం నుంచి అడుగు బయటపెట్టి, జిల్లాల పర్యటనకు వెళితే... పోలీసుల కట్టడి, ముట్టడి! హెలికాప్టర్‌ ఎక్కి, నేరుగా సభాస్థలి వద్ద దిగితే... బతుకు జీవుడా అని సంతోషం! లేదంటే... చుక్కలు కనిపించడం ఖాయం! కాన్వాయ్‌ సాగిన పొడవునా బారికేడ్లు! దుకాణాలు బంద్‌! పౌరులెవరూ ఆ దారిలో అడుగు పెట్టొద్దు! శుక్రవారం జగన్‌ ఒంగోలు పర్యటన సందర్భంగా ఈ ‘అతి’ మరింత అతిగా మారింది. నగరవాసులకు 3 రోజుల ముందు నుంచే తిప్పలు మొదలయ్యాయి. గురువారం నుంచే దుకాణాలు మూసివేయించారు. కొత్త దంపతులను ఆశీర్వదించేందుకు సీఎం వెళ్లే మార్గంలో... బడుగుల దుకాణాలు, కొన్ని ఇళ్లనూ కూల్చివేశారు.


ఒంగోలు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):  అంతకుముందు గుంటూరు, ఆ తర్వాత విశాఖ... ఇప్పుడు ఒంగోలు నగర వాసుల వంతు! సీఎం పర్యటన కారణంగా నానా  ఇక్కట్లు పడుతున్నారు.  అధికారులు మూడు రోజులుగా వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. పొదుపు మహిళలకు సున్నావడ్డీ మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమం కోసం శుక్రవారం సీఎం ఇక్కడకు వస్తుండగా.. మూడు రోజుల ముందు నుంచే ప్రజలను కష్టాల్లోకి నెట్టేశారు. సీఎం కాన్వాయ్‌ శుక్రవారం వచ్చి వెళ్లే మార్గంలో భద్రత పేరుతో ఆంక్షల చట్రంలోకి జనజీవనాన్ని బిగించేశారు.


కాన్వాయ్‌ మార్గంలో నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న దుకాణాల, బంకుల తొలగింపు మూడురోజుల ముందు నుంచే మొదలైపోయింది. తోపుడుబండ్లను ఎక్కడికక్కడ తీసివేస్తూ చిరువ్యాపారుల బతుకుపై కొట్టారు. స్వాగత తోరణాల పేరిట ఒంగోలుని దాదాపుగా ఇనుప బారికేడ్లతో నింపేశారు. అధినేత మెప్పు కోసం స్థానిక నేతలు, కార్పొరేషన్‌, పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులు చేస్తున్న హడావుడి, ఎక్కడికకక్కడ పెడుతున్న ట్రాఫిక్‌ ఆంక్షలు స్థానికులకు, తోపుడుబండ్ల చిరువ్యాపారులకు, ప్రయాణికులకు సంకటంగా మారాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నిలిపివేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సీఎం కాన్వాయ్‌ సభా స్థలికి చేరుకునే దారంతా పోలీసులతో నిండిపోయింది. సీఎం వచ్చే సమయంలో మహిళలతో స్వాగతం పలికించేందుకంటూ ఆ మార్గంలో గురువారం ఎవరినీ నడవనీయలేదు. 


ప్రైవేటు దారిలో భారీగా కూల్చివేతలు

షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ఉదయం 10.10 గంటలకు సీఎం జగన్‌ ఒంగోలు చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగుముఖం పడతారు. ఈ క్రమంలోనే ఈ నగరంలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అయితే గతం నుంచి ఉన్న పీటీసీలోని హెలిప్యాడ్‌లో కాకుండా సభ జరిగే పీవీఆర్‌ హైస్కూలుకు దూరంగా ఉన్న ఏబీఎం కాలేజీలో హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేశారు. ఏబీఎంలోని హెలిప్యాడ్‌ నుంచి సభాస్థలికి సీఎం వచ్చిపోయే మార్గం ఒంగోలులోని పలు ప్రధాన ప్రాంతాల గుండా సాగుతుంది. ఈ దారి పొడవునా నివాసాలు, దుకాణాలు ఉండటంతోపాటు పలు కూడళ్లలో అనేక మంది చిరువ్యాపారుల తోపుడు బండ్లు, బంకుల ద్వారా ఉపాధి పొందుతుంటారు. సీఎం సభ జరిగే పీవీఆర్‌ బాయ్స్‌ హైస్కూలుకు వెళ్లేదారిలోని పీవీఆర్‌ గర్ల్స్‌ హైస్కూలు, రంగారాయుడి చెరువు ప్రాంతాల్లో భారీగా చిరు వ్యాపారుల బండ్లు, బంకులను తొలగించేస్తున్నారు. బందరురోడ్డులోని ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లే దారి లో కొంతదూరం రోడ్డు మార్జిన్లు, పక్కన నివాసాలున్నాయి. కార్పొరేషన్‌ అధికారులు వాటిని తొలగించడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. 

తరలింపునకు స్కూలు బస్సులా!

సీఎం సభను 10వేల మంది మహిళలతో విజయవంతం చేయాలనేది టార్గెట్‌. దీనికోసం దాదాపు 460కిపైగా బస్సులను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 200కు పైగా ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు చెందిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శుక్రవారం నుంచి 1నుంచి 9 వరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు స్కూలు బస్సులు స్వాధీనం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు సీఎం వస్తున్నది అధికారిక కార్యక్రమానికి అయినప్పటికీ... ఆయన కాన్వాయ్‌ ఒంగోలులో సాగే మార్గమంతా వైసీపీ తోరణాలతో ముంచెత్తారు. సభా ప్రాంగణమంతా వైసీపీ రంగులమయం చేశారు. ఆ పార్టీ నేతలు, అధినేతకు ఉన్న రంగుల పిచ్చిని ఈ ఏర్పాట్లు బయటపెట్టాయి. 


సీఎం రోడ్‌మ్యాప్‌ ఇలా..

ఒంగోలు రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఏబీఎం స్కూలుకు హెలికాప్టర్‌లో సీఎం జగన్‌ చేరుకుంటారు. అక్కడినుంచి రద్దీగా ఉండే 2 కిలోమీటర్ల పరిధిలోని రోడ్ల మీదుగా పీవీఆర్‌ హైస్కూలుకు చేరుకుని అధికార కార్యక్రమంలో పాల్గొంటారు. అదేమార్గంలో మళ్లీ కలెక్టర్‌ బంగ్లా వద్దకు చేరుకుని.. అటునుంచి బందర్‌రోడ్‌, పాత విజయదుర్గా ధియేటర్‌ మీదుగా కంది రవిశంకర్‌ ఇంటికి చేరుకుని.. వధూవరులను ఆశీర్వదిస్తారు. ఈ క్రమంలోనే 2 కిలోమీటర్లు ఉండే ఈ మార్గంలోని బందర్‌ రోడ్డులో కూల్చివేతలు చేపడుతున్నారు. కాన్వాయ్‌ సాగే ఈ నాలుగు కిలోమీటర్ల మార్గమంతా బారికేడ్లే దర్శనమిస్తున్నాయి. 


  అంతకుముందు ఇలా...

  • నవ్యాంధ్రకు జగన్‌ రెండో ముఖ్యమంత్రి. అంతకుముందు ఆయన తండ్రి వైఎస్‌ సహా అనేకమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. జిల్లాల్లో పర్యటించారు. కానీ... ఎప్పుడూ స్థానికంగా దుకాణాలను మూసివేయించడం, కాన్వాయ్‌ వెళ్లే దారి పొడవునా బారికేడ్లు కట్టడం వంటి ఉదంతాలు లేనే లేవు. 
  • మాజీ సీఎం చంద్రబాబు నక్సల్స్‌ హిట్‌లి్‌స్టలో ఉన్నారు. ఆయనకు జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంది. అయినా సరే... చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్లేటప్పుడు అతి కనిపించేది కాదు. సభ లేదా సమావేశం జరిగే ప్రాంతాన్ని మాత్రమే భద్రతా సిబ్బంది తమ స్వాధీనంలోకి తీసుకుంటారు. కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో కొద్దిసేపు మాత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు అమలయ్యేవి
  • ముఖ్యమంత్రులు పాల్గొనే సభల ప్రాంగణాల్లోకి అందరినీ అనుమతించేవారు. కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలూ చేసేవారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని.... కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టేవాళ్లు. కేసులు కూడా ఉండేవి కావు.
  • ముఖ్యమంత్రి సున్నితమైన ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం సహజం. అలాగే... సభా వేదిక చుట్టుపక్కల ఎత్తైన భవనాలు ఉంటే, వాటిలోకి రాకపోకలను నియంత్రించి... పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారు.


జగన్‌ వచ్చాక ఇలా...  

  • ముఖ్యమంత్రి జగన్‌ అడుగు బయటపెట్టారంటే... సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ సమావేశానికి వెళ్లిన ప్రతిసారీ... రాజధాని గ్రామాల్లో... ప్రతి ఇంటి ముందు ఒక పోలీసు నిల్చుంటున్నారు. తెరలు కట్టేస్తున్నారు.
  • జగన్‌ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వెళ్లే ప్రతిసారీ... విజయవాడ నగర ప్రజలకు కష్టాలే. ఆ మార్గంలో అరగంట నుంచి గంట ట్రాఫిక్‌ ఆపేస్తున్నారు.
  • గత ఏడాది జగన్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు గుంటూరుకు వెళ్లారు. అమరావతి రోడ్డు బారికేడ్లు కట్టి, దుకాణాలు మూసివేయించి ఒక్కరు కూడా వీధుల్లోకి రాకుండా కట్టడి చేశారు.
  • ఇటీవల జగన్‌ విశాఖపట్నం పర్యటనకు వెళ్లినప్పుడు మరింత అతి చేశారు. మూడుగంటలపాటు ప్రజలు నరకం అనుభవించారు. చివరికి... విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులను కూడా ఆపివేయడంతో వారు తమ లగేజీతో దాదాపు కిలోమీటరున్నర నడిచి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. 
  • జగన్‌ ఎక్కడికైనా వెళ్తున్నారంటే... ప్రతిపక్ష, ప్రజాసంఘాల నేతలను ముందురోజే గృహ నిర్బంధం చేస్తున్నారు. నోటీసులు ఇస్తున్నారు. నిరసనల సంగతి పక్కనపెడితే... ‘వినతిపత్రాలు కూడా ఇచ్చేందుకు వీల్లేదు’ అని నోటీసులు ఇస్తుండటం గమనార్హం.


ట్రయల్‌ తంటాలు

ట్రాఫిక్‌ నియంత్రణ కోసం రోడ్డు మధ్యలో గతంలో ఏర్పాటు చేసిన ఇనుప డివైడర్లను తొలగించారు. కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌, వాహనాల పార్కింగ్‌ ఇతరత్రా పరిశీలన పేరుతో రెండు రోజులుగా ఒంగోలుకు పెద్దఎత్తున ఉన్నతాధికారులు వచ్చిపోతున్నారు. పలు కూడళ్లలో ట్రయల్‌ పేరిట ఎక్కడికక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ట్రాఫిక్‌ నిలిపివేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. 

Updated Date - 2022-04-22T08:11:44+05:30 IST