27న సీఎం నగరానికి రాక

ABN , First Publish Date - 2022-06-25T06:29:24+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 27వ తేదీన నగరానికి రానున్నారు.

27న సీఎం నగరానికి రాక

విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 27వ తేదీన నగరానికి రానున్నారు. ఆయన ఆరోజు శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొని తల్లుల ఖాతాలకు సొమ్ములు విడుదల చేయనున్నారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 10.15 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ఇక్కడ నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం వెళతారు. అక్కడ కార్యక్రమం అనంతరం తిరిగి మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని...గన్నవరం వెళతారు. 


కరోనా కలకలం

- జిల్లాలో మరో 40 కేసులు నమోదు

విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 40 మందికి వైరస్‌ సోకినట్టు శుక్రవారం నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,91,880కు చేరింది. ఇందులో 1,90,551 మంది కోలుకోగా, ప్రస్తుతం 176 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌తో ఇప్పటివరకు  1,153 మంది మృతిచెందారు. కాగా రెండంకెల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. 


విద్యాశాఖ పరిధిలోకి జీవీఎంసీ పాఠశాలలు

ఉపాధ్యాయులు కూడా...

విశాఖపట్నం, జూన్‌ 24: మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల పరిధిలో గల పాఠశాలల బాధ్యతను విద్యా శాఖకు అప్పగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.దీంతో మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని 145  ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు విద్యాశాఖ పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి. ఉపాధ్యాయులు కూడా విద్యా శాఖ పరిధిలోకి వెళతారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజిత పథకాలు డీఈఓ పర్యవేక్షణలోనే జరుగుతాయి. జీతాలు ఎంఈవోల ద్వారా చెల్లించే అవకాశం ఉంది. అయితే బదిలీలు విద్యా శాఖ పర్యవేక్షణలో మునిసిపల్‌ స్కూల్స్‌లో మాత్రమే జరుగుతాయి. పాఠశాలల్లో పనిచేసే నాన్‌టీచింగ్‌, కంటింజెంట్‌ సిబ్బంది విద్యా శాఖ పరిధిలోకి వస్తారు. అయితే ఆస్తులు మాత్రం జీవీఎంసీ కిందే ఉంటాయి. ఇక ఉమ్మడి జిల్లాలోని ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీలు అయినప్పటికీ...అక్కడ పాఠశాలలు జిల్లా పరిషత్‌ పరిధిలోనే ఉన్నాయి.


13 వేల మద్యం బాటిళ్లు ధ్వంసం

విలువ రూ.21 లక్షలు 

భీమునిపట్నం (విశాఖపట్నం జిల్లా), జూన్‌ 24: గత కొంతకాలంగా భీమిలి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సర్కిల్‌ స్టేషన్‌ పరిధిలో పట్టుకున్న ఇతర రాష్ట్రాల మద్యం 12,718 క్వార్టర్‌ బాటిళ్లను శుక్రవారం ధ్వంసం చేశారు. విశాఖ ఎస్‌ఈబీ డీసీ బాబ్జీరావు ఆదేశాల మేరకు జేడీ బి.శ్రీనివాసరావు, ఈఎస్‌ బి.శ్రీనాథుడు పర్యవేక్షణలో భీమిలి పరిధిలో ఖాళీగా వున్న ఓ లేఅవుట్‌లో వీటిని పేర్చి జేసీబీతో ధ్వంసం చేశారు. తొలుత సీసాలను ఎస్‌ఈబీ, భీమునిపట్నం, వీఎస్‌పీ అనే ఇంగ్లీష్‌ అక్షరాల వరుసలో పేర్చి, అనంతరం ధ్వంసం చేశారు. ఈ మద్యం బాటిళ్ల ధర దాదాపు రూ.21 లక్షలు వుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎస్‌ఈబీ సీఐ వి.రామకృష్ణ, ఎస్‌ఐ డి.పద్మావతి, హెచ్‌సీ ఎన్‌.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-06-25T06:29:24+05:30 IST