తుఫాన బాధితులకు తక్షణ సాయం

ABN , First Publish Date - 2020-11-29T05:25:14+05:30 IST

వరదకు గల్లంతై మృత్యుఒడి చేరిన రాజంపేటకు చెందిన ఇద్దరికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం, పునరావాస కేంద్రాల్లో ఉంటున్నవారికి రూ.500 చొప్పున సాయం అందించాలని సూచించారు.

తుఫాన బాధితులకు తక్షణ సాయం
సీఎం వైఎస్‌ జగనకు జిల్లాలో తుఫాను నష్టాన్ని వివరిస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌

మృతులకు రూ.5 లక్షల పరిహారం

పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి రూ.500

జిల్లా కలెక్టరును ఆదేశించిన సీఎం జగన

ఏరియల్‌ వ్యూ ద్వారా పింఛా ప్రాజెక్టు, నందలూరు ప్రాంతాల పరిశీలన

కడప, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాన బాధితులకు తక్షణ సాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన కలెక్టరు హరికిరణ్‌ను ఆదేశించారు. వరదకు గల్లంతై మృత్యుఒడి చేరిన రాజంపేటకు చెందిన ఇద్దరికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం, పునరావాస కేంద్రాల్లో ఉంటున్నవారికి రూ.500 చొప్పున సాయం అందించాలని సూచించారు. వరద ఉధృతికి గండి పడిన పింఛా ప్రాజెక్టుతో పాటు నందలూరు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే ద్వారా శనివారం సీఎం పరిశీలించారు. అనంతరం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో తుఫాన నష్టంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కలెక్టరు సి.హరికిరణ్‌ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన నష్టంపై కలెక్టరు సీఎం జగనకు పవర్‌ పాయింట్‌ ప్రదర్శన ద్వారా వివరించారు. జిల్లాలో వరద ఉధృతికి పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని వివరించారు. నివర్‌ తుఫాన వల్ల మూడు రోజుల్లో సగటున 10 సెం.మీల వర్షం పడింది. 25 సెం.మీల అధిక వర్షపాతం వల్ల రైల్వే కోడూరు ప్రాంతంలో రోడ్లు, వంతెనలు దెబ్బతిని రూ.30 కోట్లు నష్టం జరిగింది. జిల్లాలో 51 మండలాల్లో 72 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిని రూ.82 కోట్ల నష్టం జరిగితే.. చేతికొచ్చిన వరపైరు 15 వేల హెక్టార్లలో దెబ్బతిందని వివరించారు. ఉద్యాన పంటలు 3240.58 హెక్టార్లు దెబ్బతిని రూ.6 కోట్లకుపైగా నష్టం జరిగింది. 757 నివాసాలు దెబ్బతిన్నాయని సీఎంకు వివరించారు.  2,377 పశువులు, గొర్రెలు మృత్యువాతపడ్డాయని,రూ.143 కోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పోలీస్‌, ఫైర్‌, జాతీయ విపత్తుల రక్షణ బృందాలు కడప నగరంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన 12 వేల మందిని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించామని వివరించారు. కడప నగరంలో 2005లో బుగ్గవంక ఆఽధునికీకరణ, రక్షణ గోడల నిర్మాణం చేపడితే నేటికి 1.20 కి.మీల రక్షణగోడ అసంపూర్తిగా ఉందని, దానికి అదనంగా మరో 3 కి.మీలు నిర్మించాల్సి ఉందని అందుకు రూ.27 కోట్లు కావాలని కలెక్టరు వివరించారు.

Updated Date - 2020-11-29T05:25:14+05:30 IST