నగరానికి సీఎం

ABN , First Publish Date - 2022-06-28T06:38:20+05:30 IST

శ్రీకాకుళం జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

నగరానికి సీఎం
సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌ ముఖ్యమంత్రికి స్వాగతం

విమానాశ్రయంలో స్వాగతం పలికిన మంత్రులు, అధికార పార్టీ నేతలు, అధికారులు


గోపాలపట్నం, జూన్‌ 27: శ్రీకాకుళం జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 9.50 గంటలకు ముఖ్యమంత్రి ఇక్కడకు చేరుకున్నారు. ఆయనకు జిల్లాకు చెందిన మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్‌, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సుభద్ర, విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా, పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌, తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన హెలికాప్టర్‌లో 10.10 గంటలకు శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలో ‘అమ్మఒడి’ కార్యక్రమం ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 2.10 గంటలకు హెలికాప్టర్‌లో విశాఖ చేరుకున్నారు. ఇక్కడ నుంచి సీఎం ప్రత్యేక విమానంలో 2.25 గంటలకు విజయవాడ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి,  తదితరులు వీడ్కోలు పలికారు.


జీవీఎంసీ పాఠశాలల విలీనం వేగవంతం

నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి

విద్యా శాఖ పరిధిలోకి స్కూళ్లు, ఉపాధ్యాయులు


విశాఖపట్నం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని పాఠశాలలను విద్యా శాఖలో విలీనం చేసే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. పాఠశాలలు, భవనాలకు సంబంధించిన వివరాలతోపాటు ఉపాధ్యాయుల సర్వీసు రికార్డులను జీవీఎంసీ విద్యా విభాగం అధికారులు సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్‌ పాఠశాలలను విద్యా శాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 24న ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. జీవీఎంసీ పరిధిలో 118 ప్రాథమిక, ప్రాథమికోన్నత, 27 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇకపై ఆయా పాఠశాలలన్నీ విద్యా శాఖ పరిధిలోకి వెళ్లనున్నాయి. పాఠశాలల భవనాల నిర్వహణ, ఉపాధ్యాయుల బదిలీలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి బాధ్యతలన్నీ విద్యా శాఖ చూడాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల పనితీరు పర్యవేక్షణ కూడా ఆ శాఖ అధికారులే చూడాల్సి ఉంటుంది. దీనిపై మునిసిపల్‌ పాఠశాలల ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జీవీఎంసీ పాఠశాలల్లో ప్రస్తుతం 27 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇక ఉన్నత పాఠశాలల్లో 541 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 450 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు పనిచేస్తున్నారు. 


జిల్లా ఆరోగ్య శాఖ అధికారిణిపై విచారణ?

పలు ఆరోపణలతో ఆరోగ్య శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు


విశాఖపట్నం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ విజయలక్ష్మిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొద్దిరోజుల కిందట నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, క్లాస్‌-4 ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌కు కొంతమంది ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టాల్సిందిగా డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ను కమిషనర్‌ ఆదేశించారు. ఈ మేరకు జోనల్‌ మలేరియా అధికారిణిని విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి నెల రోజుల్లో నివేదిక అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో పోస్టుల భర్తీలో తప్పుడు ధ్రువపత్రాలను అనుమతించారని, ఈ వ్యవహారంలో భారీమొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది.  అలాగే నర్సీపట్నంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోగా పనిచేసిన సమయంలో పీహెచ్‌సీ నిధులు దుర్వినియోగం చేశారని, విజయనగరం జిల్లా ఆరోగ్య శాఖ అధికారిణిగా పనిచేసిన సమయంలో తప్పుడు బిల్లులు సమర్పించి భారీ మొత్తాలను డ్రా చేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ అధికారిపై విచారణకు ఆదేశించడంతో కార్యాలయంలో కలకలం రేపింది. 

Updated Date - 2022-06-28T06:38:20+05:30 IST