Abn logo
Dec 2 2020 @ 23:45PM

పాడితోనే మహిళా సాధికారత

నల్లపురెడ్డిపల్లెలో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌, ఎంపీ, జేసీ, లబ్దిదారులు

ప్రతి రైతుకు చేదోడుగా పాడిపరిశ్రమ సాగాలి

రైతులతో ముఖాముఖిలో సీఎం

ఏపీ-అమూల్‌ పాలవెల్లువ పథకం ప్రారంభం

పులివెందుల, డిసెంబరు 2: పాడిపరిశ్రమతో మహిళా సాధికారత సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఏపీ-అమూల్‌ పాలవెల్లువ పథకాన్ని విజయవాడ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పులివెందుల నల్లపురెడ్డిపల్లెలోని రైతు భరోసా కేంద్రంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన మాట్లాడుతూ వ్యవసాయానికి వెన్నుదన్నుగా పాడిపరిశ్రమ నిలవాలన్నారు. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబం అభివృద్ధి చెందాలంటే పాడిపరిశ్రమ ఎంతో అవసరమన్నారు. అమూల్‌ సంస్థ పాడిరైతులకు మంచి ధర కల్పిస్తోందన్నారు. ఈ పథకాన్ని ఒక్క కడప జిల్లాలోనే వంద గ్రామాల్లో ప్రారంభించామన్నారు. కడప జిల్లాలో పాలను విక్రయిస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి ఆనలైన ద్వారా నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటి సారిగా 1500 మంది లబ్ధిదారులు ముందుకు వచ్చారన్నారు. నెలలతరబడి సాధ్యంకాని ఈ కార్యక్రమం కేవలం పదిరోజుల్లోనే చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 35వేల లీటర్ల పాలు సేకరించామన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులతో ముచ్చటించారు. అందులో భాగంగా నల్లపురెడ్డిపల్లెకు చెందిన లబ్ధిదారు అశ్విని మాట్లాడుతూ అమూల్‌ ప్రాజెక్టు ద్వారా పాలసేకరణ సాగించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అమూల్‌ ద్వారా ఇప్పటివరకు ఉన్న పాల ధర ఒక్కసారిగా పెరిగిందన్నారు. ఇదే కొనసాగితే మరిన్ని పాడిపశువులు తెచ్చుకొని పాడిపరిశ్రమ అభివృద్ధి చేసుకుంటామన్నారు. పాడిపరిశ్రమకు కావాల్సిన షెడ్డు, దాణా తదితర వాటికి బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తే మరింత వెసులుబాటుగా ఉంటుందని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హరికిరణ్‌, కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, అమూల్‌ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement