సీఎం జగన్‌ పర్యటన రద్దు

ABN , First Publish Date - 2022-08-08T06:10:18+05:30 IST

పాడేరులో ఈ నెల తొమ్మిదో తేదీన జరిగే ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరుకావడం లేదు.

సీఎం జగన్‌ పర్యటన రద్దు
ఆదివాసీ దినోత్సవానికి సిద్ధమవుతున్న వేదిక

- మే 12న మోదకొండమ్మ వేడుకలకు హాజరుకాని వైనం 

- డిప్యూటీ సీఎం, ఇన్‌చార్జి మంత్రితోనే ఆదివాసీ దినోత్సవం

- ముఖ్యమంత్రి పర్యటన రద్దుపై సర్వత్రా చర్చ 

                     (ఆంధ్ర జ్యోతి- పాడేరు) 

పాడేరులో ఈ నెల తొమ్మిదో తేదీన జరిగే ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరుకావడం లేదు. సీఎం పర్యటన రద్దయింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడం ఇది రెండోసారి. ఈ ఏడాది మే 12న స్థానిక మోదకొండమ్మ వేడుకలకు సీఎం జగన్‌ హాజవుతారని అప్పట్లో ఏర్పాట్లు చేశారు. అప్పుడు కూడా వాతావరణం బాగాలేదనే కారణంతో పర్యటన రద్దు చేశారు. ఈ ఏడాది రెండు మార్లు సీఎం జగన్‌ జిల్లా కేంద్రం పాడేరు పర్యటనలు రద్దు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆదివాసీ దినోత్సవానికి సీఎం జగన్‌ వస్తారో...? రారో..? అనే అనుమానం అధికార యంత్రాంగంలోనూ తొలుత నుంచి ఉండేది. అందువల్లే జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సీఎం జగన్‌ రాకపై స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారు. అనుకోని విధంగా సీఎం పర్యటన ఖరారైన రెండు రోజుల తరువాత దానిని కలెక్టర్‌ ప్రకటన చేశారు. అయితే పలువురు అధికారులు మాత్రం తొలి నుంచి సీఎం జగన్‌ రాకపై అనుమానం వ్యక్తం చేస్తుండేవారు. ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగడంతో పాటు బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో హెలికాప్టర్‌ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని అందరూ భావిస్తుండే వారు. అయినప్పటికీ సీఎం వచ్చినా...? రాకపోయినా...? ఆదివాసీ దినోత్సవ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో గిరిజనులతో సభ నిర్వహణకు అవసరమైన వేదికను సిద్ధం చేస్తున్నారు. అక్కడే పలువురు గిరిజన లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై స్టాళ్ల ఏర్పాటు వంటివి చేయనున్నారు.

డిప్యూటీ సీఎం, ఇన్‌చార్జి మంత్రి హాజరు

ఆదివాసీ దినోత్సవానికి డిప్యూటీ సీఎం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హాజరుకానున్నారు. అలాగే స్థానిక గిరిజన ప్రజాప్రతినిధులైన అరకులోయ ఎంపీ జి.మాధవి, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, ధనలక్ష్మి, ఏజెన్సీలో ప్రాంత ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు హాజరవుతారు. 


Updated Date - 2022-08-08T06:10:18+05:30 IST