‘క్యూట్‌’కు వ్యతిరేకంగా తీర్మానం

ABN , First Publish Date - 2022-04-12T15:09:13+05:30 IST

కేంద్ర విశ్వవిద్యాలయాలలో డిగ్రీ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్బంధం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుకు నిరసనగా శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఓ తీర్మానాన్ని

‘క్యూట్‌’కు వ్యతిరేకంగా తీర్మానం

                       - అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదంఫ బీజేపీ సభ్యుల వాకౌట్‌


చెన్నై: కేంద్ర విశ్వవిద్యాలయాలలో డిగ్రీ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్బంధం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుకు నిరసనగా శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్‌ అప్పావు ప్రకటించారు. సోమవారం ఉదయం శాసనసభ సమావేశం ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన విద్యాపరమైన హక్కులను హరించే విధంగా చర్యలు చేపడుతోందని ఆరోపించారు. తాజాగా యూజీసీ నిధులతో నిర్వహిస్తున్న కేంద్ర విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కోర్సులలో చేరే విద్యార్థులు ప్రవేశపరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిం చాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. క్యూట్‌ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సభలో ఆయన ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ‘కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌‘ పేరిట ప్రవేశపెట్టనున్నట్లు యూజీసీ ఉత్తర్వు జారీ చేయడం గర్హనీయమన్నారు. ప్లస్‌-1లో అత్యధిక మార్కుల్లో ఉత్తీర్ణులైనవారు ఈ ప్రవేశపరీక్షల వల్ల తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్టేట్‌ సిలబ్‌సలలో ప్లస్‌-1 ఉత్తీర్ణులైన వారు జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి పాఠ్యాంశాల ప్రకారం నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేరని తాము ఎప్పడి నుంచో చెబుతున్నట్టు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో 80 శాతం మంది విద్యార్థులు స్టేట్‌ సిలబస్‌ చదివే ఉత్తీర్ణులువుతుంటారని, వీరంతా కేంద్ర విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేని దుస్థితి వస్తుందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి ‘క్యూట్‌’ కు వ్యతిరేకంగా ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని, ఇందుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని స్టాలిన్‌ కోరారు. ఈ తీర్మానంపై జరిగిన చర్చల్లో అన్నాడీఎంకే, కాంగ్రెస్‌, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం సహా అన్ని పార్టీల సభ్యులు ఈ తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.


బీజేపీ అభ్యంతరం, నిరసన 

కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రతిపాదించిన తీర్మానానికి బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ శాసనసభ్యుడు నయినార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ ఈ ప్రవేశపరీక్షలను అన్ని రాష్ట్రాల్లో నిర్బంధంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని, ఆయా రాష్ట్రాలు ఇష్డపడితేనే  జరుపుకోవచ్చునని ప్రకటించిందని, అలాంటప్పుడు వ్యతిరేక తీర్మానం ఎందుకని ప్రశ్నించారు. మంత్రి పొన్ముడి బదులిస్తూ నీట్‌ విషయంలోనూ బీజేపీ మెతకవైఖరి ప్రదర్శించడం వల్లే ఆ పరీక్షల వల్ల రాష్ట్రంలో గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఆ తర్వాత ఈ తీర్మానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న నయినార్‌ నాగేంద్రన్‌ వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ సభ్యులందరూ సభ నుండి నిష్క్రమించారు. ఆ తర్వాత ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్‌ అప్పావు ప్రకటించారు.

Updated Date - 2022-04-12T15:09:13+05:30 IST