పశుదాణా, మినరల్‌ మిక్స్చర్‌ ఫ్యాక్టరీలు

ABN , First Publish Date - 2022-01-20T15:53:16+05:30 IST

ఈరోడ్‌లో కొత్త పశుదాణా ఉత్పత్తి కర్మాగారం, హోసూరులో మినరల్‌ మిక్స్చర్‌ (ధాతు లవణం) తయారీ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈరోడ్‌లో ఆవిన్‌ సంస్థ, పాల ఉత్పత్తి

పశుదాణా, మినరల్‌ మిక్స్చర్‌ ఫ్యాక్టరీలు

                 - ఈరోడ్‌, హోసూరుల్లో ప్రారంభించిన CM Stalin


చెన్నై: ఈరోడ్‌లో కొత్త పశుదాణా ఉత్పత్తి కర్మాగారం, హోసూరులో మినరల్‌ మిక్స్చర్‌ (ధాతు లవణం) తయారీ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈరోడ్‌లో ఆవిన్‌ సంస్థ, పాల ఉత్పత్తి సహకార సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రోజుకు 100 టన్నుల పశుదాణా ఉత్పత్తి కర్మాగారాన్ని 1982లో నెలకొల్పారు. ఆ కర్మాగారంలో ప్రస్తుతం రోజుకు 150 టన్నుల పశుదాణా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశుదాణా ఉత్పత్తిని పెంచేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న పశుదాణా కర్మాగారం విస్తరణలో భాగంగా రూ.3.40 కోట్లతో కొత్త యంత్రాలతో నూతనంగా అభివృద్ధి చేశారు. దీంతో ఆ కర్మాగారంలో పశుదాణా ఉత్పత్తి రోజు కు 300టన్నులకు పెరగనుంది. ఈ కొత్త కర్మాగారాన్ని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్టాలిన్‌ ప్రారంభించారు. ఇదే విధంగా కృష్ణగిరి జిల్లా హోసూరు వద్ద రూ. 1.35 కోట్లతో నిర్మించిన మినరల్‌ మిక్స్చర్‌ (ధాతు లవణం) మిశ్రమం తయారీ కర్మాగారాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కర్మాగారంలో రోజుకు 12 మెట్రిక్‌ టన్నుల మినరల్‌ సాల్ట్‌ను ఉత్పత్తి చేయనున్నారని స్టాలిన్‌ వెల్లడించారు. 


ఆవిన్‌ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ...

సచివాలయంలో జరిగిన మరో కార్యక్రమంలో ఆవిన్‌ సంస్థ తయారు చేసిన నూడుల్స్‌ సహా కొత్త ఉత్పత్తులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆవిష్కరించారు. ఆవిన్‌ సంస్థ పాల్‌కోవా, రసగుల్లా, గులాబ్‌జామ్‌, మైసూర్‌పాక్‌ తదితర తీపి పదార్థాలను తయారు చేసి విక్రయిస్తోంది. ప్రస్తుతం ప్రీమియర్‌ మిల్క్‌ కేక్‌లను తయారు చేసి 250 గ్రాముల ప్యాక్‌ను రూ.100లకు విక్రయించనుంది. ఇదే విధంగా మామిడిపండ్ల రసం, స్ట్రాబెర్రీ మిశ్రమంతో కూడిన యోగర్ట్‌ పానీ యాన్ని కూడా తయారు చేసి 200 మి.లీ. ప్యాక్‌ను రూ.25లకు విక్రయించనుంది. వీటితోపాటు పాయసం మిక్స్‌ ప్యాకెట్లను కూడా మార్కెట్లో ప్రవేశపెడుతోంది. 100 గ్రాముల మిక్స్‌ ప్యాక్‌ను రూ.50లకు, 200 గ్రాముల ప్యాక్‌ను రూ.100లకు విక్రయించనుంది. ఇవే కాకుండా రూ.10లకే 70 గ్రాముల నూడుల్స్‌ ప్యాక్‌, డైరీ వైట్నర్‌ ప్యాక్‌లను కూడా మార్కెట్లో ప్రవేశపెట్ట నుంది.ఈ డైరీ వైట్నర్‌ పాల ప్యాకెట్లు 20 గ్రాములు, 200 గ్రాములు, 500ల గ్రాముల్లో రూ.10లు, రూ.80లు, రూ.200లకు లభించనున్నాయి. ఈ కొత్తరకం ఆవిన్‌ ఉత్పత్తులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమాల్లో నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌, డైరీ శాఖ మంత్రి ఎస్‌ఎం.నాజర్‌, పశుసంవర్థక, మత్స్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి తెన్‌కాశి ఎస్‌.జవహర్‌, పాల ఉత్పత్తి శాఖ కమిషనర్‌ కే ప్రకాష్‌, ఆవిన్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సుబ్బయన్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.


ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయ భవనాల ప్రారంభం..

సచివాలయంలో జరిగిన మరో కార్యక్రమంలో రూ.26.66 కోట్లతో నిర్మించిన ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయ భవనాలు, ఆ అధికారుల క్వార్టర్స్‌ను కూడా స్టాలిన్‌ ప్రారంభించారు. రూ.114. 48 కోట్లతో  నిర్మించనున్న మైలాడుదురై కలెక్టర్‌ కార్యాలయ భవనసముదాయానికి శంకుస్థాపన చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి, వేలూరు జిల్లా గుడియాత్తం, తిరువారూరు జిల్లా మన్నార్‌గుడి, రాణిపేట జిల్లా అరక్కోణం, మదురై జిల్లా తిరుమం గళం వద్ద రూ.9.85 కోట్లతో నిర్మించిన ఆర్డీవో కార్యాలయాలు, ఆరణి, గుడియాత్తం, అరక్కోణం, తిరుమంగళంలో రూ.148 కోట్లతో నిర్మించిన ఆర్డీవో క్వార్టర్స్‌కు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఇదే విధంగా వేలూరు జిల్లా కేవీకుప్పం, గుడియాత్తం, తిరువళ్లూరు జిల్లా ఆర్కేపేట, పుదుకోట జిల్లా అరంతాంగి, అవుడయార్‌కోవిల్‌లో రూ.14.76 కోట్ల తో నిర్మించిన తహసీల్దార్‌ కార్యాలయ భవనాలు, తిరువళ్లూరు జిల్లా ఆర్కేపేట, తిరువారూరు జిల్లా మన్నార్‌గుడిలో రూ.55లక్షలతో నిర్మించిన తహసీల్దార్ల నివాస గృహాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు, రెవెన్యూ శాఖ మంత్రి కేకే ఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, కొత్త కార్యాలయపు భవనాల ప్రారంభోత్సవ వేదికల వద్ద మంత్రులు ఏ చక్రపాణి, ఆర్‌,గాంధీ, పీ మూర్తి, ఎస్వీ మెయ్యనాధన్‌, డిప్యూటీ స్పీకర్‌ కే పిచ్చాండి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T15:53:16+05:30 IST