దగ్గరుండి వివాహాలు జరిపించిన Cm

ABN , First Publish Date - 2022-05-27T15:26:31+05:30 IST

తన సొంత నియోజకవర్గమైన కొళత్తూరులో కొత్తగా మరమ్మతులు చేసి ఆధునకీకరించిన కళ్యాణమండపంలో 9 పేద జంటలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉచిత వివాహాలను

దగ్గరుండి వివాహాలు జరిపించిన Cm

అడయార్‌(చెన్నై): తన సొంత నియోజకవర్గమైన కొళత్తూరులో కొత్తగా మరమ్మతులు చేసి ఆధునకీకరించిన కళ్యాణమండపంలో 9 పేద జంటలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉచిత వివాహాలను జరిపించారు. నూతన వధూవరులకు మంగళసూత్రంతో పాటు 33 రకాల కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గం పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ కళ్యాణ మండపాన్ని పరిశీలించగా, దీనిని కొందరు ధ్వంసం చేసి వున్నారన్నారు. 1966లో కామరాజర్‌ చేతుల మీదుగా ఈ కళ్యాణమండపాన్ని ప్రారంభించారన్నారు. దీన్ని అసెంబ్లీ నియోజవర్గ నిధుల నుంచి అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కానీ, కొందరు రాజకీయ కక్షతో కోర్టులో పిటిషన్‌ వేశారన్నారు. కానీ, పార్టీకి చెందిన న్యాయవాదులు ఈ కేసులో గెలుపొందడంతో ఈ కళ్యాణ మండపానికి మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు. అయితే, ఈ మరమ్మతుల తర్వాత కూడా కామరాజర్‌ శిలాఫలకం తొలగించలేదన్నారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కామరాజర్‌ను అభిమానించే వ్యక్తినని, తన పెళ్ళిపత్రికను కామరాజర్‌కు తన తండ్రి కరుణానిధి తీసుకెళ్ళి ఇవ్వగా, ఈ వివాహానికి రావాలని ఉందని కానీ తన ఆరోగ్యం సహకరించడం లేదని కామరాజర్‌ చెప్పిన విషయం గుర్తు చేశారు. అయితే, వివాహానికి వస్తానంటే కల్యాణ మండపాన్ని మారుస్తానని కామరాజర్‌కు కరుణానిధి చెప్పారన్నారు. ఆ తర్వాత కామరాజర్‌ కారు కల్యాణవేదికపైకి వచ్చేలా వేదిక ఎంపిక చేసి, అక్కడ తన వివాహం జరిపించారన్నారు. భారతీదాసన్‌ చెప్పినట్టుగా వధూవరులు ఇంటికి దీపాలుగా, దేశానికి సేవకులుగా కొనసాగాలని దీవించారని చెప్పారు. కాగా, ఈ కళ్యాణమండపంలో 700 మంది కూర్చొనేలా ఆధునికీకరించినట్టు సీఎం వెల్లడించారు.. అలాగే, లిఫ్టు సౌకర్యం కూడా కల్పించామన్నారు. 

Updated Date - 2022-05-27T15:26:31+05:30 IST