చెన్నై: స్థానిక అడయార్ వద్దనున్న తొల్‌కాప్పియ పూంగా (ఉద్యానవనాన్ని)ను ముఖ్యమంత్రి స్టాలిన్ శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ ఉద్యానవనంలో జరుగుతున్న మరమ్మతులను తనిఖీ చేశారు. 2009లో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హాయంలో ఈ ఉద్యానవనాన్ని నెలకొల్పారు. 2011 నుంచి ఈ ఉద్యానవనం సందర్శనకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చెన్నై నదుల ప్రక్షాళన విభాగం అధికారులతో కలిసి కూవం, అడయారు నదుల మరమ్మతుల గురించి, రూ.2773 కోట్లతో చేపట్టనున్న బకింగ్‌హామ్ కాలువ మరమ్మతుల గురించి అధికారులతో స్టాలిన్ చర్చించారు. తొల్‌కాప్పియా పూంగాను విద్యార్థులు అధిక సంఖ్యలో సందర్శించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆయన ఆదేశించారు. స్టాలిన్‌తోపాటు మంత్రులు కేఎన్ నెహ్రూ, పొన్ముడి, నగరపాలక మంచినీటి సరఫరా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్‌సింగ్ బేదీ, చెన్నై నదుల ప్రక్షాళన విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ సీ స్వర్ణ, మెట్రోవాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయరాజ్‌కుమార్ ఆ పార్కును పరిశీలించారు.
ఇవి కూడా చదవండి