నూతన విద్యావిధానంపై Cmతో ప్రత్యేక కమిటీ భేటీ

ABN , First Publish Date - 2022-06-16T13:30:05+05:30 IST

రాష్ట్రంలో ప్రత్యేక విద్యావిధాన రూపకల్పన కోసం ఏర్పాటైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మురుగేశన్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా

నూతన విద్యావిధానంపై Cmతో ప్రత్యేక కమిటీ భేటీ

చెన్నై, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రత్యేక విద్యావిధాన రూపకల్పన కోసం ఏర్పాటైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మురుగేశన్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానాన్ని తోసిరాజని రాష్ట్రానికి కొత్త విద్యావిధానాన్ని రూపొందించే నిమిత్తం ఈ కమిటీ ఈ నెల 1న ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ మురుగేశన్‌ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా, ప్రొఫెసర్‌ జవహర్‌నేశన్‌, రామానుజం, సుల్తాన్‌ ఇస్మాయిల్‌, రామశ్రీనువాసన్‌, ప్రొఫెసర్‌ అరుణా రత్నం, రచయిత రామకృష్ణన్‌, చెస్‌ ఛాంపియన్‌ విశ్వనాధన్‌ ఆనంద్‌, సంగీత కళాకారుడు టీఎం కృష్ణా, విద్యావేత్త తులసీదాసన్‌, మాడస్వామి, హెడ్మాస్టర్‌ బాలు, అగరంట్రస్టు అధ్యక్షురాలు జయశ్రీ దామోదరన్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమైంది. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, ఈ రెండు రంగాలకు సంబంధించి నాణ్యమైన అంతర్జాతీయ విద్యావిధానాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా స్టాలిన్‌ కమిటీ సభ్యులకు సూచించారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా ఈ విద్యావిధానం ఉండాలని కోరారు. అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా, విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా విద్యావిధానం రూపొందించాలన్నారు. పరీక్షా పద్ధతుల్లోనూ పలు సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నూతన విద్యావిధానం వల్ల నిరుద్యోగ సమస్య సమసిపోవాలని, విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారి పలువురికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకునేలా ఉండాలని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఏడాదిపాటు అమలు చేయాల్సిన విద్యావిధానాన్ని వీలైనంత త్వరగా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన సూచించారు. ఈ సమావేశం సుమారు గంటకు పైగా కొనసాగింది.

Updated Date - 2022-06-16T13:30:05+05:30 IST