కర్ణాటకతో మళ్లీ జలజగడం

ABN , First Publish Date - 2022-03-22T15:59:44+05:30 IST

కావేరి నదిపై మెకెదాటు వద్ద కొత్త ఆనకట్టను నిర్మించేందుకు సిద్ధమైన కర్ణాటక ప్రభుత్వ వైఖరిని నిరశిస్తూ, ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.

కర్ణాటకతో మళ్లీ జలజగడం

మెకెదాటు నిర్మాణానికి నిధుల మంజూరుపై నిప్పులు చెరిగిన సీఎం స్టాలిన్‌

జడ్యాం నిర్మిస్తే కావేరీ పరివాహక ప్రాంతం ఎడారే

ప్రభుత్వాలు మారినా కర్ణాటక వైఖరిలో మార్పులేదు

న్యాయపరంగా అడ్డుకుంటామన్న మంత్రి దురైమురుగన్‌

ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే 

అసెంబ్లీలో ప్రత్యేకతీర్మానం.. ఏకగ్రీవంగా ఆమోదం


చెన్నై, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):  కావేరి నదిపై మెకెదాటు వద్ద కొత్త ఆనకట్టను నిర్మించేందుకు సిద్ధమైన కర్ణాటక ప్రభుత్వ వైఖరిని నిరశిస్తూ, ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. సోమవారం ఉదయం నీటివనరులశాఖ మంత్రి దురైమురుగన్‌ ప్రతిపాదించిన ప్రత్యేక తీర్మానానికి అన్ని పక్షాలు మద్దతు పలికాయి. డెల్టా జిల్లాల్లో సాగుభూములకు కావేరి జలాలే ప్రధాన ఆధారం. ప్రతియేటా కావేరి జలాలను కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందా అని డెల్టా రైతులు ఎదురు చూస్తుంటారు. కావేరి నదీ జలాల ఒప్పందం ప్రకారం కర్ణాటక ప్రభుత్వం రాష్ర్టానికి సరిపడా జలాలను సక్రమంగా పంపిణీ చేయడం లేదు. దీని గురించి కావేరి నిర్వాహక మండలి ఎన్ని ఉత్తర్వులు జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితులలో కావేరి నదిపై రాష్ట్ర సరిహద్దుకు చేరువలో మెకెదాటు అనే చోట కొత్త ఆనకట్టను నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేపట్టింది. ఇటీవలే మెకెదాటు ఆనకట్ట నిర్మాణం కోసం రూ.1000 కోట్ల మేరకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కావేరి డెల్టా రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.


ఈ నేపథ్యంలో శాసనసభలో నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ మెకెదాటు ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా, కావేరి ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను ఉల్లఘించి కర్ణాటక ప్రభుత్వం మెకెదాటు వద్ద ఆనకట్టను నిర్మించేందుకు సిద్ధమవుతోందని చెప్పారు. కావేరి జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు దశాబ్దాల తరబడి రాష్ట్ర నాయకులంతా తీవ్రంగా పోరాడినా ఫలితం లేకపోతోందని, కావేరి జలాల వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుంతో ఎవరూ చెప్పలేకున్నారని అన్నారు. కావేరి నీటి వివాదంలో ప్రతిసారి ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు, సుప్రీం కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కర్నాటక ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా కావేరి జలాలను విడుదల చేయడమే లేదని ఆరోపించారు. కావేరి జలాల కోసం 1968లో మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రులంతా ఎన్ని పోరాటాలు సాగించినా, న్యాయపోరాటాలు జరిపినా కర్ణాటక ప్రభుత్వం మొండివైఖరినే ప్రదర్శిస్తోందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం ఉల్లఘించినా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రేక్షక పాత్రనే పోషిస్తున్నాయని దురైమురుగన్‌ విమర్శించారు.


కావేరి నదీ జలాల వివాదాలను తాను 1989 నుండి గమనిస్తూ వస్తున్నానని, అన్నాదురై హయాంలో ప్రారంభమైన ఈ వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుందో చెప్పలేకున్నామని, ఈ విషయంలో ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకుంటే భావితరాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఇక కావేరి జలాల సాధనకోసం ఏ నాయకులు పాటుపడ్డారు, ఏయే ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి అనే వివాదాల జోలికి వెళ్ళకుండా కావేరి డెల్టా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సభలోని అన్ని పార్టీల సభ్యులు తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యేక తీర్మానానికి మద్దతు ఇవ్వాలని దురైమురుగన్‌ కోరారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కావేరి వివాదాల సమయంలో రాష్ట్రానికి అండగా నిలువలేదని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని విమర్శించారు. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కావేరి వివాదంలో న్యాయమైన నిర్ణయం తీసుకుంటారనే భావిస్తున్నానని చెప్పారు. కర్ణాటక పొరుగురాష్ట్రంగా ఉండటం వల్ల రెండు రాష్ట్రాలకు హాని కలుగకుండా న్యాయబద్ధంగా ప్రవర్తించాలనే కోరుకుంటున్నానని చెప్పారు.


కావేరి ట్రిబ్యునల్‌ 2007లో జారీ చేసిన తీర్పును 2018లో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును ఉల్లఘించేలా పొరుగురాష్ట్రాలను సంప్రతించకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి పొందకుండా కర్ణాటక ప్రభుత్వం కావేరి నదిపై మెకెదాటు వద్ద ఆనకట్టను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో మెకెదాటుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు జారీ చేయకూడదని కూడా ఈ తీర్మానంలో కోరుతున్నట్లు తెలిపారు. మెకెదాటుకు వ్యతిరేకంగా తాను ప్రతిపాదించిన తీర్మానానికి అన్ని పార్టీల సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు.


కర్ణాటక ప్రయత్నాలను అడ్డుకుంటాం...

ఈ తీర్మానానికి మద్దతుగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రసంగిస్తూ మెకెదాటు ఆనకట్ట నిర్మాణం కోసం కర్నాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను న్యాయపరంగానే అడ్డుకుంటామని ప్రకటించారు. నీటిపారుదల శాఖ మంత్రి దురైమురుగన్‌ తీర్మానాన్ని ప్రతిపాదించే సమయంలోనూ కావేరి జలాల వివాద చరిత్రను సమగ్రంగా సభకు వివరించడం అభినందనీయమని పేర్కొన్నారు. కావేరి ట్రిబ్యునల్‌, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లఘించేలా  ప్రభుత్వం ఆనకట్టను నిర్మించేందుకు ప్రయత్నించడం గర్హనీయమని పేర్కొన్నారు. ఈ తీర్మానానికి సభలోని అన్ని పార్టీల సభ్యులు మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత అన్నాడీఎంకే సభాపక్షనాయకుడు ఎడప్పాడి పళనిస్వామి, వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ప్రసంగించారు. అన్నాడీఎంకే సహా అన్ని పార్టీల సభ్యులు ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్‌ అప్పావు ప్రకటించారు.

Updated Date - 2022-03-22T15:59:44+05:30 IST