ఊటీ వెలుగులు

ABN , First Publish Date - 2022-05-22T13:45:43+05:30 IST

నీలగిరి జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఊటీ నగర ద్విశత వార్షికోత్సవాల్లో రూ.56.36 కోట్లతో పూర్తయిన ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. అక్కడి ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల

ఊటీ వెలుగులు

- ద్విశత వార్షికోత్సవాల్లో రూ.56.36 కోట్లతో పథకాలు ప్రారంభించిన Cm Stalin

- ఊటీ నిర్మాత జాన్‌సల్లివన్‌ విగ్రహావిష్కరణ


చెన్నై: నీలగిరి జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఊటీ నగర ద్విశత వార్షికోత్సవాల్లో రూ.56.36 కోట్లతో పూర్తయిన ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. అక్కడి ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శనివారం ఉదయం (ఊటీ-200’ పేరుతో ఆ నగర ద్విశత వార్షికోత్సవాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక సభలో రూ.34.30 కోట్లతో చేపట్టనున్న ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపన చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద 9500 మంది లబ్ధిదారులకు రూ.28.13 కోట్ల విలువైన సహాయాలు  పంపిణీ చేశారు. స్థానిక ఎంపీ ఎ. రాజా, ధర్మలింగం వేణుగోపాల్‌ సంయుక్తంగా  ‘ఊటీ ద్విశత వార్షికోత్సవాలు’ పేరిట రచించిన ప్రత్యేక సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రూ.6.82 కోట్లతో నిర్మించిన సబ్‌కలెక్టర్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాయం, కేత్తి సబ్‌డివిజన్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే రూ.2.73 కోట్లతో నిర్మించిన బీసీల సంక్షేమ శాఖ బాలుర వసతిగృహాన్ని, రూ.2.46 కోట్లతో నిర్మించిన పశుసంవర్థక కేంద్రాన్ని, రూ.14.80 కోట్లతో నిర్మించిన ఎమరాల్డ్‌ ఆస్పత్రి భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఇక రూ.1.73 కోట్లతో తెంగుమరహడాలో పశుసంవర్థక ఆస్పత్రి, ఊటీలోని వెటర్నరీ ఆస్పత్రి ప్రాంగణంలో వాహనాల పార్కింగ్‌ స్థలం, రూ.3.03 కోట్లతో కొత్తగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మించనున్న అత్యవసర చికిత్సా కేంద్రంకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎంపీ సామినాథన్‌, కే రామచంద్రన్‌, ఎంపీ ఎ. రాజా, శాసనసభ్యుడు ఆర్‌. గణేష్‌, నీలగిరి కలెక్టర్‌ అమ్రీత్‌ తదితరులు పాల్గొన్నారు.


విగ్రహావిష్కరణ: ఊటీ నగర ద్విశత వార్షికోత్సవాల్లో ఆ నగరాన్ని నిర్మించిన ఆంగ్లేయ ఉన్నతాధికారి, కోయంబత్తూరు జిల్లా మాజీ కలెక్టర్‌ జాన్‌ సల్లివన్‌ విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆవిష్కరించారు. 1819లో జాన్‌ సల్లివన్‌ కోయంబత్తూరు కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు చల్లటి వాతావరణంతో, అన్ని చోట్లా పచ్చదనం, నీటి సరస్సులతో కూడిన ఊటీని కనుగొన్నారు. ఆ ప్రాంతంలో రాళ్లతో ప్రత్యేక భవనాన్ని నిర్మించుకుని తరచూ బస చేసేవారు. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. ఇలా ఊటీని సర్వాంగ సుందరమైన నగరంగా నిర్మించిన జాన్‌ సల్లివన్‌ను స్మరిస్తూ బొటానికల్‌ గార్డెన్‌ రోడ్డులో ముక్కోపణపు ఆకారంలో ఉన్న ప్రాంతం వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆవిష్కరించారు. ఆ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


చిన్నారులకు వైద్యశిబిరం

పౌష్టికాహార లోపంతో ఉన్న ఆరేళ్ళలోపు చిన్నారుల కోసం ఏర్పాటైన ప్రత్యేక వైద్య పరీక్షల శిబిరాన్ని కూడా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. నీలగిరి జిల్లా దొడ్డబెట్ట గ్రామీణ శిశు సంరక్షణ కేంద్రంలో ఆయన ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర మంతటా ఈ పథకాన్ని విస్తరింపజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పౌష్టికాహారం లోపంతో ఉన్న ఆరేళ్లలోపు బాలబాలికలు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఎదుగుదలకు దోహదం చేసే మందులను అందించటమే ఈ పథకం ఉద్దేశమని ఆయన చెప్పారు. భావిభారత పౌరులు పౌష్టికాహార లోపం లేకుండా బలవర్థకమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇటీవల తాను శాసనసభలో ప్రకటించానని ఆయన చెప్పారు.

Updated Date - 2022-05-22T13:45:43+05:30 IST