మూడేళ్లలో క్షయ రహిత రాష్ట్రం

ABN , First Publish Date - 2022-07-02T13:33:34+05:30 IST

మూడేళ్లలో రాష్ర్టాన్ని క్షయరహితంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 23 జిల్లాల కోసం

మూడేళ్లలో క్షయ రహిత రాష్ట్రం

- డిజిటల్‌ ఎక్స్‌రే సంచార వాహనాలను ప్రారంభించిన సీఎం స్టాలిన్‌

- 23 జిల్లాల కోసం రూ.10.65 కోట్లతో కొనుగోలు


చెన్నై, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మూడేళ్లలో రాష్ర్టాన్ని క్షయరహితంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 23 జిల్లాల కోసం రూ.10.65 కోట్లతో కొనుగోలు చేసిన డిజిటల్‌ ఎక్స్‌రే సంచార వాహనాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం ఉదయం నొచ్చికుప్పంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాల్లో క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. క్షయ ప్రబలేందుకు అవకాశాలున్న కర్మాగారాలు, నివాసప్రాంతాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో ఈ డిజిటల్‌ ఎక్స్‌రే సంచార వాహనాల ద్వారా వైద్యనిపుణులు ముందస్తు పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్సలందిస్తారని చెప్పారు. ఈ పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా క్షయవ్యాధిగ్రస్థులకు ఉచిత చికిత్స, అవసరమైన మందులతోపాటు రూ.500 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ వాహనంలో అమర్చిన డిజిటల్‌ ఎక్స్‌రే విద్యుత్‌ సరఫరా లేకపోయినా జనరేటర్‌ ద్వారా పనిచేసే సదుపాయం, వాహనంలో రెండు ఏసీ గదులున్నాయని వివరించారు. క్షయవ్యాధిపై అవగాహన ప్రచారం నిర్వహించేందుకు ఈ వాహనంలో ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ప్రచార చిత్రాలను ప్రదర్శిస్తారని తెలిపారు. గంటకు పది ఎక్స్‌రేలు తీసే సామర్థ్యం కలిగిన డిజిటల్‌ ఎక్స్‌రే వాహనాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు ఐదు లక్షల మందికి పరీక్షలు నిర్వహించనున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. క్షయవ్యాధిగ్రస్తులకు బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు వందకుపైగా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయన్నారు.  ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి వ్యాప్తిని తగ్గించటంలో విశిష్ట సేవలందించిన తిరువణ్ణామలై, కరూరు, కన్నియాకుమారి, నాగపట్టినం, నామక్కల్‌, శివగంగ, విల్లుపురం జిల్లాలకు చెందిన క్షయ విభాగం డిప్యూటీ డైరెక్టర్లకు స్టాలిన్‌ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఎం.సుబ్రమణ్యం, మేయర్‌ ఆర్‌.ప్రియా, డిప్యూటీ మేయర్‌ ఎం. మహేష్‏కుమార్‌, శాసనసభ్యులు ఉదయనిధి, డి.వేలు, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సెంథిల్‌కుమార్‌, జాతీయ ఆరోగ్య సంక్షేమ సంస్థ సంచాలకులు శిల్పా ప్రభాకర్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.


14 సంచార ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలు...

సచివాలయంలో శుక్రవారం జరిగిన మరో కార్యక్రమంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూ.3.92 కోట్లతో రూపొందించిన 14 సంచార ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలను కూడా ముఖ్యమంత్రి ఎంకే ప్రారంభించారు. ఈ వాహనాలను చెన్నై, తిరుచ్చి, తిరునల్వేలి, తిరుప్పూరు నగర పోలీసు కమిషనరేట్లకు వేలూరు, ధర్మపురి, కోయంబత్తూరు, నీలగిరి, మదురై, విల్లుపురం, రామనాధపురం, తంజావూరు జిల్లాలకు చెదిన జిల్లా ఫోరెన్సిక్‌ విభాగాలకు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సంచార ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలు, హత్యలు, దోపిడీలు, బాంబు పేలుళ్లు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ తదితర నేరాలు జరిగిన ప్రాంతాల్లోనే నేరస్తుల వేలిముద్రలు, రక్తపు నమూనాలను సేకరించి అప్పటికప్పుడే పరీక్షలుచేసి నేరస్థులను వీలైనంత త్వరగా నిర్బంధించేందుకు సాయపడతాయని ఆయన వివరించారు. 

Updated Date - 2022-07-02T13:33:34+05:30 IST