CM Hitavu: ఆత్మహత్యలకు పాల్పడొద్దు

ABN , First Publish Date - 2022-07-27T14:13:35+05:30 IST

విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడవద్దని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని, ఉన్నత విద్యావంతులుగా రాణించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief

CM Hitavu: ఆత్మహత్యలకు పాల్పడొద్దు

                                      - విద్యార్థులకు సీఎం స్టాలిన్ హితవు


చెన్నై, జూలై 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడవద్దని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని, ఉన్నత విద్యావంతులుగా రాణించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) హితవు పలికారు. వేళచ్చేరిలో మంగళవారం ఉదయం జరిగిన గురునానక్‌ కళాశాల స్వర్ణోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ... ఇటీవల కాలంలో విద్యా సంస్థల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు తనకు తీరని వేదన కలిగిస్తున్నాయన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు వ్యాపార ధోరణికి స్వస్తి చెప్పి సేవాభావంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా సంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో సరిపెట్టుకోకూడదని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ఇదే విధంగా తల్లిదండ్రులు(parents) కూడా తమ పిల్లలను స్కూళ్లలో చేర్పించడంతో తమ బాధ్యత ముగిసిందని భావించకూడదన్నారు. తరచూ ఉపాధ్యాయులను సంప్రదించి జరిపి తమపిల్లల బాగోగులను తెలుసుకోవాలన్నారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగితే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడదని పేర్కొన్నారు. విద్యార్థినులు(female students) కూడా ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు. కీడు చేసేవారిని చూసి భయపడకూడదని, వారిని ధైర్యంగా ఎదుర్కొని అణచివేయాలన్న తమిళ మహాకవి భారతియార్‌ కవితను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థినులు నవ యువతులుగా ఉన్నత స్థితికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో మంత్రి దామో అన్బరసన్‌, రాష్ట్ర మైనారిటీల సంఘం అధ్యక్షుడు పీటర్‌ ఆల్ఫోన్స్‌, వేళచ్చేరి శాసనసభ్యుడు హసన్‌ మౌలానా, డిప్యూటీ మేయర్‌ మహేష్‏కుమార్‌, గురునానక్‌ కళాశాల అధ్యక్షుడు రాజేంద్ర సింగ్‌ బాసిన్‌, ప్రధాన కార్యదర్శి, కరస్పాండెంట్‌ మజ్జిద్‌సింగ్‌ నాయర్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంజీ రఘునాధన్‌, మాజీ సైనికాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-27T14:13:35+05:30 IST