‘స్థానికం’ బలోపేతం

ABN , First Publish Date - 2022-04-23T15:41:18+05:30 IST

స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేలా యేడాదికి ఆరు గ్రామసభలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. శాసనసభలో శుక్రవారం ఉదయం సభా నిబంధన 110 కింద ఓ

‘స్థానికం’ బలోపేతం

చెన్నై: స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేలా యేడాదికి ఆరు గ్రామసభలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. శాసనసభలో శుక్రవారం ఉదయం సభా నిబంధన 110 కింద ఓ ప్రకటన చేస్తూ... గతంలో తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యేడాదికి నాలుగు గ్రామసభలు జరిపేవారమని, అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే ఆ ఉత్తర్వులను రద్దు చేసిందని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా పంచాయతీలు, నగరపాలక, పురపాలక సంస్థల్లో అభివృద్ధి పనులు విరివిగా చేపడుతుందన్నారు. ప్రస్తుతం పంచాయతీలు, పట్టణ, నగర పంచాయతీల్లో సమస్యలు, కొరత గురించి చర్చించేందుకు అనువుగా యేడాదికి ఆరుగ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ మేరకు జనవరి 26, మే ఒకటి, ఆగస్టు 15, అక్టోబరు 2న, మార్చి 22, నవంబర్‌ ఒకటి తేదీల్లో ఈ గ్రామసభలు తప్పనిసరిగా జరుగుతాయని ఆయన చెప్పారు. 

             

ఉత్తమ పంచాయతీలకు నగదు పురస్కారం...

ఈ యేడాది నుంచి జిల్లాకు ఒకటి చొప్పున 37 ఉత్తమపంచాయతీలకు గాంధీ అవార్డులను బహూకరిస్తామని, ఆ మేరకు రూ.10లక్షల నగదు  పురస్కారం కూడా అందజేయనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే విధంగా జిల్లా పంచాయతీ, పట్టణ, నగరపంచాయతీ సభ్యుల సమావేశ భత్యాన్ని పదింతలకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక గ్రామపంచాయతీ అధ్యక్షుడు (సర్పంచ్‌), సభ్యుల సమావేశ భత్యాన్ని ఐదింతలకు పెంచనున్నట్లు వెల్లడించారు. సమావేశాల హాజరు భత్యాన్ని పెంచడం వల్ల 1.19 లక్షల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు లబ్ధిపొందుతారని వెల్లడించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీ సర్పంచులకు 13 ఏళ్లుగా వాహన సదుపాయం సమకూర్చలేదని, 2009లో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 385 మంది గ్రామ పంచాయతీ అధ్యక్షుల కు వాహనాలను అందజేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 13 యేళ్ళుగా వాహన సదుపాయం లేక ఇబ్బందులకు గురైన పంచాయతీ సర్పంచ్‌లందరికీ కొత్త వాహనాలు కొనుగోలు చేసి అందజేయనున్నట్లు ప్రకటించారు.


 గ్రామసచివాలయాల నిర్మాణం...

రాష్ట్ర వ్యాప్తంగా 600 గ్రామ సచివాలయాలు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఇందులో గ్రామపంచాయతీ అధ్యక్షుడికి గది, అన్ని శాఖలకు చెందిన మీటింగ్‌హాలు, గ్రామనిర్వహణాధికారి గది, కార్యనిర్వహణాధికారి గది వుంటాయి. గ్రామీణాభివృద్ధి శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ శాఖ, సామాజిక సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసే పథకాలను గ్రామీణ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే ఈ సచివాలయం పని. ఒక్కో గ్రామ సచివాలయ భవనాన్ని రూ.40 లక్షలతో నిర్మించనున్నట్లు సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2022-04-23T15:41:18+05:30 IST